ఉమేశ్ విజృంభణ
కోల్ కతా:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ లో ఆడుతున్న తొలి మ్యాచ్ లోనే కోల్ కతా నైట్ రైడర్స్ పేసర్ ఉమేశ్ యాదవ్ విజృంభించాడు. గురువారం కింగ్స్ పంజాబ్ తో మ్యాచ్ లో నాలుగు వికెట్లు సాధించి తన రాకను ఘనంగా చాటుకున్నాడు. మ్యాక్స్ వెల్, డేవిడ్ మిల్లర్, సాహా, అక్షర్ పటేల్ లను అవుట్ చేసి సత్తా చాటాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు కు దిగిన కింగ్స్ పంజాబ్ కు శుభారంభం లభించింది. హషీమ్ ఆమ్లా, వోహ్రాలు దూకుడుగా ఆడటంతో కింగ్స్ పంజాబ్ ఐదు ఓవర్లలోనే 53 పరుగులు చేసింది. అయితే ఆరో ఓవర్ తొలి బంతికి వోహ్రా(28;19 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) మొదటి వికెట్ గా నిష్ర్రమించగా, ఆపై స్వల్ప వ్యవధిలో స్టోనిస్(9) కూడా అవుటయ్యాడు. ఆ తరుణంలో ఆమ్లాకు జత కలిసిన కెప్టెన్ మ్యాక్స్ వెల్ స్కోరు బోర్డును కాసేపు పరుగులు పెట్టించాడు. అయితే ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడికి గ్రాండ్ హోమ్ కు చెక్ పెట్టాడు.ఆమ్లా(25)ను అవుట్ చేసి కింగ్స్ కు షాకిచ్చాడు.
అనంతరం పరుగు వ్యవధిలోమ్యాక్ వెల్(25;14 బంతుల్లో3 ఫోర్లు, 1 సిక్స్) అవుట్ కావడంతో కింగ్స్ పంబాజ్ ఒక్కసారిగా కష్టాల్లో పడింది. ఆ సమయంలో డేవిడ్ మిల్లర్(28)-వృద్ధిమాన్ సాహా(25)ల జోడి మరమ్మత్తులు చేపట్టింది. బాధ్యతాయుతంగా ఆడుతూ స్కోరు బోర్డును చక్కదిద్దింది. ఈ జోడి 57 పరుగులు జోడించడంతో కింగ్స్ పంజాబ్ తిరిగి గాడిలో పడింది. అయితే వీరిద్దరూ 155 పరుగుల వద్ద వరుసగా పెవిలియన్ చేరడంతో కింగ్స్ తడబాటుకు గురైంది. ఇక చివరి రెండు ఓవర్లలో 14 పరుగులు రావడంతో కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది.
ఒకే ఓవర్ లో మూడు వికెట్లు..
ఈ మ్యాచ్ లో ఆది నుంచి దూకుడుగా కనిపించిన ఉమేశ్ యాదవ్ ఒకే ఓవర్ లో మూడు వికెట్లు సాధించి కింగ్స్ వెన్నువిరిచాడు. 18 ఓవర్ మూడో బంతికి డేవిడ్ మిల్లర్ ను పెవిలియన్ కు పంపిన ఉమేశ్..ఆ తరువాత బంతికి సాహాను అవుట్ చేశాడు. దాంతో ఉమేశ్ కు హ్యట్రిక్ ఛాన్సు వచ్చింది. అయితే ఆ ఛాన్స్ ను అక్షర్ పటేల్ అడ్డుకున్నాడు. కాగా, ఆ మరుసటి బంతికే అక్షర్ పటేల్ డకౌట్ గా పెవిలియన్ చేరాడు.