స్విస్‌ ఓపెన్‌ నుంచి వైదొలిగిన సైనా | Departure from the Swiss Open Saina | Sakshi
Sakshi News home page

స్విస్‌ ఓపెన్‌ నుంచి వైదొలిగిన సైనా

Published Tue, Mar 14 2017 12:35 AM | Last Updated on Tue, Sep 5 2017 5:59 AM

స్విస్‌ ఓపెన్‌ నుంచి వైదొలిగిన సైనా

స్విస్‌ ఓపెన్‌ నుంచి వైదొలిగిన సైనా

నేటి నుంచి టోర్నమెంట్‌

బాసెల్‌ (స్విట్జర్లాండ్‌): గతంలో వరుసగా రెండుసార్లు (2011, 2012లో) స్విస్‌ ఓపెన్‌ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ టోర్నమెంట్‌ టైటిల్‌ను సాధించిన భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ ఈసారి బరిలోకి దిగడం లేదు. ఈ టోర్నీ కోసం ఎంట్రీ పంపించిన సైనాకు నిర్వాహకులు టాప్‌ సీడింగ్‌ను కూడా కేటాయించారు. అయితే సైనా చివరి నిమిషంలో ఈ టోర్నీ నుంచి తన ఎంట్రీని ఉపసంహరించుకుంది. వాస్తవానికి ఈ హైదరాబాద్‌ ప్లేయర్‌ ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ ముగిశాక బర్మింగ్‌హామ్‌ నుంచి నేరుగా ఈ టోర్నీలో బరిలోకి దిగాల్సింది. కానీ సైనా క్వార్టర్‌ ఫైనల్లోనే ఓడిపోవడం... ఈ నెలాఖర్లో భారత్‌లో ఇండియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావడం కోసం స్విస్‌ ఓపెన్‌ నుంచి ఆమె వైదొలిగింది. సైనాతోపాటు భారత్‌ నుంచి ఎంట్రీలు పంపించిన గద్దె రుత్విక శివాని, వైదేహి చౌదరీ కూడా ఈ టోర్నీ నుంచి తప్పుకున్నారు. ఈ ముగ్గురూ వైదొలగడంతో ప్రస్తుతం మెయిన్‌ ‘డ్రా’లో భారత్‌ తరఫున శ్రీకృష్ణప్రియ మాత్రమే బరిలో ఉంది.

ప్రణయ్‌ టైటిల్‌ నిలబెట్టుకునేనా?
టోర్నీ తొలిరోజు మంగళవారం క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లతోపాటు పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. 64 మందితో కూడిన పురుషుల సింగిల్స్‌ ‘డ్రా’లో భారత్‌ తరఫున డిఫెండింగ్‌ చాంపియన్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్, అజయ్‌ జయరామ్, సమీర్‌ వర్మ, సౌరభ్‌ వర్మ, శుభాంకర్‌ డే పోటీపడనున్నారు. 2015లో కిడాంబి శ్రీకాంత్, 2016లో ప్రణయ్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో టైటిల్‌ను సాధించారు. చైనా దిగ్గజం లిన్‌ డాన్‌ టాప్‌ సీడ్‌ పొందగా... అజయ్‌ జయరామ్‌కు మూడో సీడింగ్‌ దక్కింది. మరోవైపు మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప ద్వయం... పురుషుల డబుల్స్‌లో సుమీత్‌ రెడ్డి–మనూ అత్రి జంట, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్‌ చోప్రా జోడీ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement