'ధవన్ ఫుట్ వర్క్ సరిగా లేదు'
న్యూఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9వ సీజన్లో ఘోరంగా విఫలమవుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ శిఖర్ ధవన్ ఫుట్ వర్క్ సరిగా లేదని భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉన్న ధవన్ ఫుట్ వర్క్ లో లోపాలు కనిపిస్తున్నాయన్నాడు. అతని ఫుట్ వర్క్ నెమ్మదించడంతోనే ధవన్ పేలవంగా నిష్క్రమిస్తున్నాడని గవాస్కర్ పేర్కొన్నాడు.
'ధవన్ పరుగులు చేయాలన్న ఒత్తిడిలో ఉన్నాడు. ఇటీవల వరుస నాలుగైదు మ్యాచ్ల్లో ధవన్ విఫలమవుతూ వస్తున్నాడు. ఇది అతను గతంలో చేసిన పరుగులను మరిచిపోయాలే చేస్తుంది. ప్రత్యేకంగా ధవన్ ఇటీవల ఆడిన మ్యాచ్ లను గమనిస్తే అతని పాదాల్లో కదలిక సరిగా లేదు. దాన్ని కొద్దిగా సరి చేసుకుంటే ధవన్ మళ్లీ గాడిలో పడే అవకాశం ఉంది'అని గవాస్కర్ తెలిపాడు.
ఇదిలాఉండగా ఈ ఐపీఎల్లో సూపర్ ఫామ్లో ఉన్న గౌతం గంభీర్పై గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుత గంభీర్ ఫామ్ నిజంగా ఆనందం కల్గిస్తుందన్నాడు. అది ఏ స్థాయి క్రికెట్ అనేది ఇక్కడ ప్రధానంగా కాదన్నాడు. గంభీర్ తన ఫుట్ వర్క్ ను సరి చేసుకోవడానికి విశేషంగా శ్రమించి సక్సెస్ అయ్యాడని గవాస్కర్ పేర్కొన్నాడు.