ధోని ధమాకా... | Dhoni gives RPS a fantastic win | Sakshi
Sakshi News home page

ధోని ధమాకా...

Published Sun, Apr 23 2017 1:20 AM | Last Updated on Tue, Sep 5 2017 9:26 AM

ధోని ధమాకా...

ధోని ధమాకా...

► రైజింగ్‌ పుణేను గెలిపించిన ‘మిస్టర్‌ కూల్‌’
► 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 నాటౌట్‌
► సన్‌రైజర్స్‌కు మూడో పరాజయం  


ఆహా.. ఎన్నాళ్లైంది ధోని నుంచి ఇలాంటి ఇన్నింగ్స్‌ చూసి.. జట్టులో ఉన్నాడన్న మాటే కానీ అతను గతంలో మాదిరి ధనాధన్‌ ఆటను ప్రదర్శించడమే గగనమైపోయింది. అటు అభిమానులు కూడా దాదాపుగా అతడి బ్యాటింగ్‌ విన్యాసాన్ని పట్టించుకోవడమే మానేశారు. అయితే 18 బంతుల్లో 47 పరుగులు కావాల్సిన దశలో ‘మిస్టర్‌ కూల్‌’ ధోని బ్యాట్‌ ఒక్కసారిగా గర్జించింది. అంచనాలకు అందని విధంగా బౌండరీల వర్షం కురిపిస్తూ ఒక్కసారిగా సమీకరణాలు మార్చేశాడు. దీంతో మ్యాచ్‌ రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌ వైపు తిరిగింది. ఆఖరి బంతిని ఫోర్‌గా మలిచి విజయం అందించడంతో పాటు తానెప్పటికీ ‘సూపర్‌ ఫినిషర్‌’ అని ధోని నిరూపించుకున్నాడు. మరోవైపు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బయటి వేదికపై హ్యాట్రిక్‌ పరాజయం పాలైంది. ఆఖరి ఓవర్లలో బౌలర్లు తడబడటంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.  

పుణే: బయటి వేదికల్లోనూ సత్తా నిరూపించుకోవాలనుకున్న డిఫెండింగ్‌ చాంపియన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మళ్లీ భంగపడింది. ఎంఎస్‌ ధోని (34 బంతుల్లో 61 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) వీర బాదుడుకు రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌ ఆఖరి బంతికి ఆరు వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానం నుంచి పుణే నాలుగో స్థానానికి చేరుకుంది.

మహారాష్ట్ర క్రికెట్‌ సంఘం (ఎంసీఏ) మైదానంలో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 176 పరుగులు చేసింది. ఉనాద్కట్, తాహిర్, క్రిస్టియాన్‌లకు ఒక్కో వికెట్‌ దక్కింది. అనంతరం లక్ష్యం కోసం బరిలోకి దిగిన పుణే 20 ఓవర్లలో 4 వికెట్లకు 179 పరుగులు చేసింది. రాహుల్‌ త్రిపాఠి (41 బంతుల్లో 59; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీ చేయగా... మనోజ్‌ తివారి (8 బంతుల్లో 17 నాటౌట్‌; 3 ఫోర్లు) వేగంగా ఆడాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పురస్కారం ధోనికి దక్కింది. సన్‌రైజర్స్‌ జట్టు తమ తదుపరి మ్యాచ్‌ను బెంగళూరులో మంగళవారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో ఆడుతుంది.

చివర్లో దూకుడు...
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభంలో నత్తనడకలా సాగింది. ఆరో ఓవర్‌లో వార్నర్‌ రెండు ఫోర్లు బాదడంతో పవర్‌ప్లేలో 45 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొమ్మిదో ఓవర్‌లో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (29 బంతుల్లో 30; 5 ఫోర్లు) అవుట్‌ కావడంతో తొలి వికెట్‌కు 55 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇది ఈ సీజన్‌లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యంత నెమ్మదైన హాఫ్‌ సెంచరీ భాగస్వామ్యం. 12వ ఓవర్‌లో హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌లో విలియమ్సన్‌ (14 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్‌) తొలి సిక్స్‌ బాదినా... ఆ తర్వాతి ఓవర్‌లోనే అవుటయ్యాడు.

అటు వార్నర్‌ నెమ్మదిగా ఆడటంతో జట్టు స్కోరు వంద పరుగులు చేరేందుకు 15 ఓవర్లు ఆడాల్సి వచ్చింది. 17వ ఓవర్‌లో వార్నర్‌ను ఉనాద్కట్‌ బౌల్డ్‌ చేయగా హెన్రిక్స్, దీపక్‌ హుడా చివర్లో ధాటిగా ఆడటంతో స్కోరు పెరిగింది. 19వ ఓవర్‌లో చెరో సిక్స్‌ బాదగా చివరి ఓవర్‌లో హెన్రిక్స్‌ వరుసగా రెండు ఫోర్లు, హుడా మరో ఫోర్‌ కొట్టడంతో జట్టుకు కాస్త గౌరవప్రదమైన స్కోరు లభించింది. వీరిద్దరి జోరుతో చివరి నాలుగు ఓవర్లలో జట్టు 54 పరుగులు సాధించగలిగింది. అలాగే నాలుగో వికెట్‌కు ఈ జోడి మధ్య అజేయంగా 47 పరుగులు జత చేరాయి.

చెలరేగిన ధోని...
భారీ లక్ష్యం కాకపోయినా నాలుగో ఓవర్‌లోనే పుణే జట్టు ఓపెనర్‌ రహానే (2) వికెట్‌ను కోల్పోయింది. అయితే కెప్టెన్‌ స్మిత్‌ (21 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్సర్లు)తో కలిసి రాహుల్‌ త్రిపాఠి బ్యాట్‌ ఝుళిపించాడు. సిరాజ్‌ బౌలింగ్‌లో వరుసగా 4,6తో చెలరేగగా ఆ తర్వాత ఐదో ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఫోర్‌తో మరింత జోరు కనబరిచాడు. 32 బంతుల్లో టి20ల్లో త్రిపాఠి తొలి అర్ధ సెంచరీ సాధించాడు. అటు పదో ఓవర్‌లో రెండు భారీ సిక్సర్లు సంధించిన స్మిత్‌ను మరుసటి ఓవర్‌లో రషీద్‌ బౌల్డ్‌ చేయడంతో రెండో వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.

మరోవైపు లేని పరుగు కోసం ప్రయత్నించిన త్రిపాఠిని రషీద్‌ నేరుగా వికెట్లకు త్రో విసిరి రనౌట్‌ చేయడంతో పుణేకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అటు స్టోక్స్‌ (10) మరోసారి నిరాశపరిచాడు. ఈ దశలో అప్పటి వరకు నిదానంగా ఆడుతున్న ధోని ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. చివరి 18 బంతుల్లో 47 పరుగులు కావాల్సిన దశలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 18వ ఓవర్‌లో వరుసగా సిక్స్, ఫోర్‌ కొట్టిన అతను భువీ వేసిన 19వ ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు, ఓ సిక్స్‌తో 29 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.

ఇక ఆఖరి ఓవర్‌లో విజయానికి 11 పరుగులు కావాల్సి ఉండగా హైడ్రామా నెలకొంది. తొలి బంతిని మనోజ్‌ తివారి ఫోర్‌గా మలిచాడు. రెండో బంతికి సింగిల్‌ తీశాడు. మూడో బంతికి ధోని, నాలుగో బంతికి తివారి ఒక్కో సింగిల్‌ తీశారు. ఐదో బంతి ఆడిన ధోని రెండు పరుగులు సాధించాడు. దాంతో రైజింగ్‌ పుణే విజయానికి ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. చివరి బంతిని ధోని ఎక్స్‌ట్రా కవర్‌ దిశగా బౌండరీ దాటించి పుణేకు సూపర్‌ ఫినిష్‌ ఇచ్చి విజయాన్ని అందించాడు.

స్కోరు వివరాలు
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: డేవిడ్‌ వార్నర్‌ (బి) ఉనాద్కట్‌ 43; శిఖర్‌ ధావన్‌ (సి) త్రిపాఠి (బి) తాహిర్‌ 30; విలియమ్సన్‌ ఎల్బీడబ్ల్యూ (బి) క్రిస్టియాన్‌ 21; హెన్రిక్స్‌ నాటౌట్‌ 55; దీపక్‌ హుడా నాటౌట్‌ 19; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 176.
వికెట్ల పతనం: 1–55, 2–84, 3–129.
బౌలింగ్‌: ఉనాద్కట్‌ 4–0–41–1; వాషింగ్టన్‌ సుందర్‌ 3–0–19–0; స్టోక్స్‌ 2–0–19–0; శార్దుల్‌ ఠాకూర్‌ 4–0–50–0; క్రిస్టియాన్‌ 4–0–20–1; తాహిర్‌ 3–0–23–1.
రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌ ఇన్నింగ్స్‌: రహానే (సి) కౌల్‌ (బి) బిపుల్‌ శర్మ 2; రాహుల్‌ త్రిపాఠి (రనౌట్‌) 59; స్మిత్‌ (బి) రషీద్‌ 27; ధోని నాటౌట్‌ 61; స్టోక్స్‌ (సి) సబ్‌–శంకర్‌ (బి) భువనేశ్వర్‌ 10; మనోజ్‌ తివారి నాటౌట్‌ 17; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 179.
వికెట్ల పతనం: 1–15, 2–87, 3–98, 4–121.
బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–39–1; బిపుల్‌ శర్మ 4–0–30–1; సిరాజ్‌ 4–0–42–0; సిద్ధార్థ్‌ కౌల్‌ 3–0–45–0; రషీద్‌ ఖాన్‌ 4–0–17–1; హెన్రిక్స్‌ 1–0–4–0.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement