ఫైల్‌ఫోటో
న్యూఢిల్లీ : టీమిండియా సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోని రెండు నెలల పాటు సైన్యంలో సేవలందించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్ ముగిసిన అనంతరం దేశ రక్షణకు అహర్నిశలు శ్రమించే సైన్యం విధుల్లో తానూ భాగం కావాలని ఈ మిస్టర్ కూల్ నిర్ణయించుకున్నాడు. దీనిలో భాగంగా లెఫ్టినెంట్ కల్నల్ హోదా కలిగిన ధోని జులై 31 నుంచి ఆగస్ట్ 15 వరకు కశ్మీర్ లోయలో సేవలందించనున్నాడు. దీనికి సంబంధించి ఆర్మీ ఓ ప్రకటన విడుదల చేసింది. కశ్మీర్ లోయలోని సైనికులతో కలిసి పెట్రోలింగ్, గార్డ్, పోస్ట్ గార్డ్ డ్యూటీలను ధోని నిర్వర్తించనున్నాడని అధికారులు తెలిపారు.
కాగా ధోనీ 2011 సంవత్సరంలోనే గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా పొందారు. ఆయన టెరిటోరియల్ ఆర్మీకి చెందిన 106 ఇన్ ఫాంట్రీ బెటాలియన్‌కు చెందిన వారు. ఈ బెటాలియన్ లోనే పారచూట్ శిక్షణ ఇస్తారు. ప్రస్తుతం ధోనీ ప్రాతినిధ్యం వహిస్తున్న బెటాలియన్ బెంగళూరు హెడ్ క్వార్టర్స్ కేంద్రంగా పనిచేస్తుంది. 2015 సంవత్సరం ఆగ్రాలో ధోనీ తొలిసారి సైనిక పారాట్రూపర్ గా నెలరోజుల పాటు శిక్షణ తీసుకున్నారు. పారాట్రూపర్ గా ప్రాణాలకు తెగించి రిస్క్ తీసుకొని విమానంలో నుంచి పారాచూట్ సహాయంతో దూకి శిక్షణ పొందారు. 1250 అడుగుల ఎత్తులో ఏఎన్ 32 సైనిక విమానం నుంచి ధోనీ పారాచూట్ సహాయంతో కిందకు దూకి, నేల మీద సురక్షితంగా ల్యాండవ్వడంతో ఆయన పారాట్రూపర్ గా అర్హత పొందారు.
Comments
Please login to add a commentAdd a comment