Army training
-
సైన్యాధికారిణిగా గల్వాన్ అమరుని అర్ధాంగి
న్యూఢిల్లీ: గల్వాన్ లోయలో చైనా సైన్యంతో ఘర్షణల్లో అమరుడైన భారత సైనికుడు నాయక్ దీపక్ సింగ్ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన సతీమణి సైతం కదనరంగంలోకి దూకారు. చెన్నై కేంద్రంగా పనిచేసే ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(ఓటీఏ)లో విజయవంతంగా ఆర్మీ శిక్షణ పూర్తిచేసుకున్నాక 29 ఏళ్ల లెఫ్టినెంట్ రేఖా సింగ్.. ఆర్మీ ఆర్డ్‌నన్స్ కోర్ విభాగంలో శనివారం విధుల్లో చేరారు. తూర్పు లద్దాఖ్‌లో ఫ్రంట్‌లైన్ యూనిట్లో ఆమె కర్తవ్య దీక్షను మొదలుపెట్టారని ఆర్మీ ఉన్నతాధికారులు చెప్పారు. ఆర్మీ మెడికల్ కోర్లో సభ్యుడైన నాయక్ దీపక్ సింగ్ ఆ తర్వాతికాలంలో బిహార్ రెజిమెంట్ 16వ బెటాలియన్‌లో నర్సింగ్ అసిస్టెంట్‌గా చేరారు. 2020 జూన్‌లో గల్వాన్‌లోయలో చైనా సైనికులతో పోరాడింది ఈ బెటాలియన్ బృందమే. ఘర్షణల్లో గాయపడినా కూడా నాయక్ తోటి 30 మంది క్షతగాత్రులైన సైనికులకు అత్యవసర వైద్యసాయం చేసి అద్భుత ధైర్యసాహసాలు ప్రదర్శించారని నాడు కేంద్రం శ్లాఘించింది. -
Hyderabad: అగ్నివీర్లు వచ్చేశారు.. రిపోర్టు చేసిన తొలి బ్యాచ్
కంటోన్మెంట్: మూడేళ్ల విరామం అనంతరం ఆర్మీ ట్రెయినింగ్ క్యాంపులు కళకళాడుతున్నాయి. ఆర్మీలో ఉద్యోగాల నియామకం కోసం ప్రయోగాత్మకంగా చేపట్టిన అగ్నివీర్ పథకంలో భాగంగా తొలి బ్యాచ్‌కు చెందిన అగ్నివీర్లు హైదరాబాద్‌లోని ఆర్టిలరీ సెంటర్లో రిపోర్టు చేశారు. 30వ తేదీ వరకు మొత్తం 2,500 మంది అగ్నివీర్లు రిపోర్టు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. 2023 చివరి నాటికి మొత్తం 6,000 మంది అగ్నివీరులు తమ శిక్షణ పూర్తి చేసుకోనున్నారు. శిక్షణ కేంద్రంలో రిపోర్టు చేసిన అగ్నివీర్లకు ఆర్మీ ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. అగ్నివీర్ల శిక్షణకు అవసరమైన సకల సదుపాయాలను కల్పిస్తున్నారు. (క్లిక్ చేయండి: కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు లేనట్టే!) -
Army Officer: తల్లికి తగ్గ తనయుడు
చెన్నై: తన తల్లి అడుగుజాడల్లో నడిచి తాను అనుకున్నది సాధించాడు ఓ యువకుడు. తల్లికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడు. తల్లి ఎక్కడైతే శిక్షణ తీసుకుని ఆర్మీ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్చించారో అదే అకాడమీ నుంచి 27 ఏళ్ల తర్వాత ఆర్మీ ఆఫీసర్‌గా ఎదిగాడు రిటైర్డ్ మేజర్ స్మితా చతుర్వేది కుమారుడు. తల్లీకుమారుల ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది భారత రక్షణ శాఖ. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్‌గా మారాయి. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ఇటీవలే వేడుకలు నిర్వహించారు. మాల్దీవులకు చెందిన సైన్యాధినేత మేజర్ జెనరల్ అబ్దుల్లా శామాల్ హాజరయ్యారు. ఆ ప్రత్యేక రోజున రిటైర్డ్ మేజర్ స్మితా, ఆమె కుమారుడు ఉన్న ఫోటోను రక్షణ శాఖ చెన్నై అకాడమీ ప్రతినిధి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘27 ఏళ్ల క్రితం 1995లో రిటైర్డ్ మేజర్ స్మితా చతుర్వేది చెన్నైలోని ట్రైనింగ్ అకాడమీ నుంచే సైన్యంలో చేరారు. అదే అకాడమీ నుంచి అదే రీతిలో ఆమె కుమారుడు సైతం సైన్యంలోకి వచ్చారు.’ అని రాసుకొచ్చారు. A rare euphoric moment for a Lady Officer: Major Smita Chaturvedi (Retd) Commissioned from Officers Training Academy, Chennai before 27 years in 1995, saw her son getting Commissioned in the same manner in the same Academy today. @artrac_ia @SpokespersonMoD @DefenceMinIndia pic.twitter.com/hGRaAbQS0k — Defence PRO Chennai (@Def_PRO_Chennai) July 30, 2022 ఇదీ చదవండి: రాకెట్ లాంచ్‌ని ప్రత్యక్షంగా చూడాలనుకునే వారికి ‘ఇస్రో’ బంపర్ ఆఫర్ -
స్త్రీ శక్తి: ఆర్మీ లాయర్ అఖిల
‘అఖిల నారాయణ్ గురించి కాస్త చెప్పండి’ అని అడిగితే... సమాధానం తట్టక బుర్ర గోక్కునేవాళ్లు ఉండొచ్చు. సినిమాలు ఎక్కువగా చూసే వాళ్లు అయితే ‘ఆ..గుర్తొచ్చింది. పోయిన సంవత్సరం ఒక సినిమాలో నటించింది కదా!’ అంటారు. అరుల్ దర్శకత్వంలో వచ్చిన తమిళ్ హారర్ మూవీ ‘కదంపారీ’లో అఖిల నటించింది. అయితే ఇప్పుడు ఆమె గురించి చెప్పుకోవడానికి ఈ హారర్ సినిమా మాత్రమే అక్కర్లేదు. యూఎస్‌లో భారత సంతతికి చెందిన అఖిల తాజాగా అక్కడి సైన్యంలో లాయర్‌గా చేరింది. ‘భేష్’ అనిపించుకుంటోంది. లీగల్ అడ్వైజర్‌గా ఆమె సేవలు అందించనుంది. ‘యూఎస్ ఆర్మీ కంబాట్ ట్రైనింగ్’లో కొన్ని నెలల పాటు కఠినమైన శిక్షణ పొందింది అఖిల. రెడ్, వైట్, బ్లూ...అనే మూడు దశల్లో సాగే ఆర్మీ కంబాట్ ట్రైనింగ్‌లో వెపన్ ఆపరేటింగ్, వారియర్ టాస్క్, బ్యాటిల్ డ్రిల్స్, టాక్టికల్ స్కిల్...మొదలైనవాటిలో శిక్షణ ఇస్తారు. అఖిలకు సంగీతం అంటే బోలెడు ఇష్టం. ‘నైటింగిల్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్’ పేరుతో ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తోంది. -
ఆ గుండె ఆగిపోలేదు
రెండేళ్ల క్రితం కశ్మీర్లో ఉగ్రవాదులతో ముఖాముఖి పోరాడుతూ మాతృభూమి కోసం ప్రాణాలు అర్పిస్తున్న క్షణాల్లోనూ చివరి వరకు మేజర్ కౌస్తుభ్ రాణే గుండె.. దేశం కోసమే కొట్టుకుంది. ఆ గుండె ఆగిపోదని, భార్యగా తను బతికున్నంత వరకు దేశం కోసం కొట్టుకుంటూనే ఉంటుందని శత్రువుకు చెప్పదలచుకున్నారు కనికా రాణే. అందుకే ఆర్మీలో చేరారు. శిక్షణ పూర్తి చేశారు. ఇప్పుడిక కమాండెంట్‌గా విధులకు సిద్ధమౌతున్నారు. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుంచి నలభై తొమ్మిది వారాల శిక్షణను ముగించుకుని శనివారం నాడు క్యాంపస్ బయటికి వచ్చిన 230 మంది ఆర్మీ ఆఫీసర్లలో 29 ఏళ్ల కనికా కౌస్తుభ్ రాణే కూడా ఒకరు. నిజానికైతే ఆమె ఇప్పుడు ఏ మల్టీనేషనల్ కంపెనీలోనో ప్రాజెక్టు మేనేజరుగా లేదా అంతకంటే పైస్థాయిలో కొనసాగుతూ ఉండవలసినవారు. కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ చేసి, ఎంబీఏలో పట్టభద్రురాలై ఉన్న కనికకు తను ఎంచుకున్న కెరియర్లో కొన్ని లక్ష్యాలు ఉండేవి. కొన్ని ధ్యేయాలు ఉండేవి. కొన్ని కలలు ఉండేవి. అవన్నీ పక్కనపెట్టి.. భర్త లక్ష్యాలు, భర్త ధ్యేయాలు, భర్త కలల్ని కనురెప్పల మధ్య ఒత్తుల్లా వెలిగించుకుని గత ఏడాది వార్ విడోస్ విభాగంలో సర్వీస్ సెలక్షన్ బోర్డు పరీక్ష రాసి, ర్యాంకు సంపాదించి ఆర్మీలో చేరేందుకు అర్హత సంపాదించారు. అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు ఆర్మీలో లెఫ్టినెంట్ ఆఫీసర్‌గా కమాండెంట్ బాధ్యతల్ని చేపట్టబోతున్నారు. ఆ బాధ్యతలు ఆమె భర్త కౌస్తుభ్ రాణే మిగిల్చి వెళ్లినవి! రాణే భారత సైన్యంలో మేజర్. దేశమే ఆయన సర్వస్వం. దేశ రక్షణ, దేశ భద్రత, దేశ గౌరవం కోసమే ప్రతిక్షణం ఆలోచించాడు. అనుక్షణం కార్మోన్ముఖుడు అయి ఉన్నాడు. ప్రాణాలను ఫణంగా పెట్టి కశ్మీర్లో ఉగ్రవాదులతో తలపడుతూ ఆ భీకర పోరులో నేల కొరుగుతున్న క్షణంలోనూ ఆయన గుండె దేశం కోసమే కొట్టుకుంది. అయితే భార్యగా తను బతికి ఉన్నంత కాలం అతడి గుండె తన దేశం కోసం కొట్టుకుంటూనే ఉంటుందని శత్రువుకు చెప్పదలచుకున్నారు కనిక. అందుకే ఆర్మీలో చేరారు. 2018 ఆగస్టులో.. శ్రీనగర్‌కు 125 కి.మీ. దూరంలోని బందీపురా జిల్లా గురెజ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖను దాటి దేశం లోపలికి వస్తున్న ఉగ్రవాద చొరబాటు దారులతో పోరాడుతూ మేజర్ కౌస్తుభ్ రాణే ప్రాణాలు కోల్పోయారు. ఆయనతో పాటు హమీర్సింగ్, మన్‌దీప్‌సింగ్, విక్రమ్‌జీత్‌సింగ్ అనే ముగ్గురు సైనికులు వీర మరణం పొందారు. మేజర్ రాణేకు మరణానంతరం శౌర్య చక్ర అవార్డు లభించింది. ఆయన భార్య కనిక ముంబై నుంచి ఉధంపూర్ వెళ్లి ఆ అవార్డును ఎంత అపురూపంగా అందుకుని వచ్చారో.. శనివారం చెన్నై పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆర్మీ యోగ్యత పత్రాలను అంతే అపురూపంగా, దీక్షగా అందుకున్నారు. ‘‘నా భర్త కలల్ని నిజం చేయడానికి ఆయన స్థానంలో నేను ఆర్మీలోకి వచ్చాను’’ అని ఆమె చెబుతున్న వీడియోను రక్షణశాఖ పీఆర్వో ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘‘నా భర్త ఎప్పుడూ నా కలల్ని నిజం చేసుకోడానికి ప్రోత్సహించేవారు. ఆయన మరణంతో ఆయన కలలే నా కలలయ్యాయి’’ అని కనిక అన్నారు. ‘‘మా పాత్రలు మారాయంతే. లక్ష్యం, ధ్యేయం ఒక్కటే. దేశ భద్రత, దేశ రక్షణ’’ అని ఆమె చెబుతున్నప్పుడు ఆమె మాటలో పట్టుదల ప్రస్ఫుటమయింది. ఆర్మీ శిక్షణను కూడా ఆమె అంతే పట్టుదలతో పూర్తి చేశారు. ‘‘శిక్షణలో శారీరకబలం కంటే కూడా మానసిక బలం ఎక్కువ అవసరం. నేనెప్పుడూ వంద మీటర్ల దూరానికి మించి పరుగు తీయలేదు. ఇప్పుడు 40 కి.మీ. వరకు పరుగెత్తగలను! మనసు గట్టిగా ఉంటే మనిషికి గట్టితనం వస్తుంది’’ అన్నారు కనిక. ఆమెకొక కొడుకు. అగస్త్య (4). భర్త తల్లిదండ్రులు కూడా ఆమెతో ఉంటున్నారు. వారి బాధ్యతను తీసుకున్నట్లే, దేశ రక్షణ విధులనూ నిర్వర్తించేందుకు సిద్ధం అయ్యారు ఆర్మీ లెఫ్టినెంట్ కనిక. -
ధోని తిరుగు ప్రయాణం..
లెహ్: పారామిలటరీ రెజిమెంట్‌లో సేవ చేసేందుకు వెళ్లిన భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని.. దాన్ని విజయవంతంగా ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ మేరకు న్యూఢిల్లీకి బయల్దేరే క్రమంలో లెహ్ ఎయిర్‌పోర్ట్‌లో ధోని దర్శనిమిచ్చాడు. భారత సైన్యంలో 106 టీఏ పారా బెటాలియన్‌తో కలిసి 15 రోజుల పాటు ధోని పనిచేశాడు. జూలై 30వ తేదీ నుంచి ఆర్మీ బెటాలియన్‌లో శిక్షణ తీసుకోవడంతో అక్కడ విధుల్లో పాల్గొన్నాడు. ఆగస్టు15 వ తేదీతో ధోని కాల పరిమితి ముగియడంతో ఇంటికి చేరుకునేందు తిరుగు ప్రయాణం అయ్యాడు. కశ్మీర్ లోయలోని సైనికులతో కలిసి పెట్రోలింగ్, గార్డ్, పోస్ట్ గార్డ్ డ్యూటీలను ధోని నిర్వర్తించాడు. కశ్మీర్‌లోని మిలిటెంట్ల ఏరివేతలో ప్రధాన భూమిక పోషించే విక్టర్ ఫోర్స్‌లో ధోని పనిచేశాడు. ఆర్మీలో గౌరవ లెప్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోని.. సైన్యంతో కలిసి విధులు నిర్వర్తించేందుకు వెస్టిండీస్ పర్యటనకు దూరమైన విషయం తెలిసిందే. 2015 సంవత్సరం ఆగ్రాలో ధోని తొలిసారి సైనిక పారాట్రూపర్ గా నెలరోజుల పాటు శిక్షణ తీసుకున్నారు. పారాట్రూపర్ గా ప్రాణాలకు తెగించి రిస్క్ తీసుకొని విమానంలో నుంచి పారాచూట్ సహాయంతో దూకి శిక్షణ పొందారు. 1250 అడుగుల ఎత్తులో ఏఎన్ 32 సైనిక విమానం నుంచి ధోనీ పారాచూట్ సహాయంతో కిందకు దూకి, నేల మీద సురక్షితంగా ల్యాండవ్వడంతో ఆయన పారాట్రూపర్ గా అర్హత పొందారు. -
క్రికెట్‌కు బ్రేక్..సైనిక విధుల్లో ధోని
-
సైనిక విధుల్లో చేరిన ధోని
జమ్మూ : దేశ రక్షణలో భాగం కావాలని రెండు నెలలు ఆటకు విరామం పలికిన టీమిండియా సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని బుధవారం విధుల్లో చేరాడు. లెఫ్టినెంట్ కల్నల్ హోదా కలిగిన ధోని ఆగస్ట్ 15 వరకు కశ్మీర్ లోయలో సేవలందించనున్నాడు. కశ్మీర్ లోయలోని సైనికులతో కలిసి పెట్రోలింగ్, గార్డ్, పోస్ట్ గార్డ్ డ్యూటీలను ధోని నిర్వర్తించనున్నాడు. కశ్మీర్‌లోని మిలిటెంట్ల ఏరివేతలో ప్రధాన భూమిక పోషించే విక్టర్ ఫోర్స్‌లో ధోని పనిచేయనున్నాడని, సైన్యంతో పాటే ఉంటాడని భారత ఆర్మీ ఇటీవల ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రపంచకప్ ముగిసిన అనంతరం దేశ రక్షణకు అహర్నిశలు శ్రమించే సైన్యం విధుల్లో తాను భాగం కావాలని భావించిన ఈ మిస్టర్ కూల్.. స్వయంగా వెస్టిండీస్ పర్యటనకు తప్పుకున్న విషయం తెలిసిందే. 2015 సంవత్సరం ఆగ్రాలో ధోనీ తొలిసారి సైనిక పారాట్రూపర్ గా నెలరోజుల పాటు శిక్షణ తీసుకున్నారు. పారాట్రూపర్ గా ప్రాణాలకు తెగించి రిస్క్ తీసుకొని విమానంలో నుంచి పారాచూట్ సహాయంతో దూకి శిక్షణ పొందారు. 1250 అడుగుల ఎత్తులో ఏఎన్ 32 సైనిక విమానం నుంచి ధోనీ పారాచూట్ సహాయంతో కిందకు దూకి, నేల మీద సురక్షితంగా ల్యాండవ్వడంతో ఆయన పారాట్రూపర్ గా అర్హత పొందారు. మిలయన్ డాలర్ల విలువ కలిగిన ధోనిలాంటి దిగ్గజం సాధారణ సైనికుడిలా దేశ కోసం సేవ చేయడం నేటి యువతకు మార్గదర్శకంగా ఉండనుంది. ముఖ్యంగా వారు దేశసైన్యంలో చేరే ఆసక్తిని రేకిత్తిస్తోంది. తన విధులు ప్రారంభించిన ధోనిపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. -
ధోని.. నీ దేశభక్తికి సెల్యూట్: విండీస్ క్రికెటర్
హైదరాబాద్: రెండు నెలలు ఆర్మీకి సేవలందించాలన్న టీమిండియా సీనియర్ క్రికెటర్ ఎంఎస్ ధోని నిర్ణయంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇప్పటికే ఆర్మీ ఉన్నతాధికారులతో సహా, టీమిండియా మాజీ ఆటగాళ్లు గౌతమ్ గంభీర్, కపిల్ దేవ్ వంటి దిగ్గజాలు ధోని నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షెల్డన్ కాట్రెల్ ధోని తీసుకున్న నిర్ణయానికి ముగ్దుడయ్యాడు. అంతేకాకుండా అతడి దేశభక్తి సెల్యూట్ అంటూ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా గతేడాది రాష్ట్రపతి నుంచి పద్మ విభూషణ్ అందుకుంటున్న వీడియోని జతచేశాడు. ‘మైదానంలో ధోని ఎంతో స్పూర్తినిస్తాడు. అతను గొప్ప దేశ భక్తుడు. దేశానికి సేవలందించాలన్న అతని అంకితభావం అమోఘం’అంటూ కాట్రెల్ తొలి ట్వీట్లో పేర్కొన్నాడు. అనంతరం మరో ట్వీట్లో ‘ఈ వీడియోని స్నేహితులు, కుటుంబ సభ్యులకి షేర్ చేస్తున్నాను. ఎందుకంటే అటువంటి క్షణాన్ని నేను ఎంత గర్విస్తానో వాళ్లకి తెలుసు. ఆ క్షణంలో ధోని, అతని భార్య సాక్షిని చూస్తేంటే జీవిత భాగస్వామిపై, దేశం పట్ల ఉన్న ప్రేమ ప్రతిబింబిస్తుంది’అంటూ ధోని పద్మవిభూషణ్ తీసుకుంటున్న వీడియోను జతచేసి పోస్ట్ చేశాడు. ప్రస్తుతం కాట్రెల్ ట్వీట్లు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ‘మైదానంలో నువ్వు సెల్యూట్‌తో సంబరాలు చేసుకుంటే .. నీ ట్వీట్‌కు, మంచితనానికి మేమందరం సెల్యూట్ చేస్తున్నాం’అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా, కాట్రెల్ కూడా జమైకా సైన్యంతో కలిసి పనిచేస్తూనే క్రికెట్ ఆడుతున్నాడు. దీంతో.. ఇప్పటికీ అతను మైదానంలో వికెట్ పడగొడితే..? సైనికుడి తరహాలో ఫీల్డ్ అంపైర్ వైపు వాక్ చేసి సెల్యూట్ కొట్టి సంబరాలు చేసుకుంటాడు. తాజాగా ధోనీకి కూడా గౌరవంగా ట్వీట్ ద్వారా సెల్యూట్ కొట్టాడు. తన రెండు నెలల సైనిక శిక్షణను ధోని గత గురువారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. జులై 31 నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు 106 టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్‌తో కలిసి ధోనీ పనిచేయనున్నాడు. కశ్మీర్లో ఉన్న విక్టర్ ఫోర్స్‌తో ధోనీ కలవనున్నాడు. అక్కడ పారాచూట్ రెజిమెంట్‌తో శిక్షణ ప్రారంభిస్తాడు. ఆర్మీ ట్రైనింగ్‌లో భాగంగా ధోని పెట్రోలింగ్, గార్డ్, పోస్ట్ డ్యూటీలను నిర్వర్తించనున్నాడు. This man is an inspiration on the cricket field. But he is also a patriot and a man that gives to his country beyond duty. I have been at home in Jamaica with my boys these past weeks and had time to reflect (1/2) — Sheldon Cotterell (@SaluteCotterell) July 28, 2019 I shared this video with friends and family because they know how I feel about honour but the moment between wife and husband truly shows an inspirational kind of love for country and partner. Please enjoy as I did. pic.twitter.com/Pre28KWAFD — Sheldon Cotterell (@SaluteCotterell) July 28, 2019 -
ధోని ఆర్మీ ట్రైనింగ్.. గంభీర్ కామెంట్
న్యూఢిల్లీ : టీమిండియా సీనియర్ క్రికెటర్ ఎంఎస్ ధోని రెండు నెలల సైనిక శిక్షణపై మాజీ దిగ్గజ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, కపిల్ దేవ్‌లు స్పందించారు. ‘ధోని తీసుకున్న నిర్ణయం స్ఫూర్తి దాయకం. ఇప్పటికే అనేకమార్లు ఆర్మీపై తనకున్న అభిమానాన్ని చూశాము. ఇప్పుడు తన నిర్ణయంతో ఆర్మీపై తనకున్న అంకితభావాన్ని చాటుకున్నాడు. ధోని లాంటి దిగ్గజం తీసుకున్న నిర్ణయంతో వేలాది మంది యువత సైన్యంలో పని చేయాలన్న స్ఫూర్తిని కలిగిస్తుంది’అంటూ గౌతమ్ గంభీర్ పేర్కొన్నారు. ‘ఆర్మీకి సేవలందించాలనుకున్న ధోని నిర్ణయం అభినందనీయం. ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి చాలా ధైర్యం ఉండాలి. అత్యంత యూత్ ఫాలోయింగ్ ఉన్న ధోనిని ఆర్మీ దుస్తుల్లో చూసి యువత సైన్యంలోని పనిచేయాలనే భావన, స్ఫూర్తి కలుగుతుంది’అంటూ కపిల్ దేవ్ ప్రశంసించాడు. కాగా, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన రెండు నెలల సైనిక శిక్షణను గురువారం ప్రారంభించాడు. పారాచూట్ రెజిమెంట్‌లో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోని... బెంగళూరులోని బెటాలియన్ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేశాడు. అతడు ఈ నెల 31 నుంచి ఆగస్ట్ 15 వరకు బెటాలియన్‌తో ఉంటాడు. విక్టర్ ఫోర్స్‌లో భాగంగా దీని యూనిట్ కశ్మీర్ లోయలో విధులు నిర్వర్తిస్తోంది. సైన్యం ప్రధాన కార్యాలయం నుంచి అనుమతి వచ్చాక ధోని... పహారా, గార్డ్, సెంట్రీ పోస్ట్, దళంలో భాగమవడం తదితర బాధ్యతలు చేపడతాడు. -
‘ధోనికి ప్రత్యేక రక్షణ అవసరం లేదు’
న్యూఢిల్లీ: దేశ రక్షణలో భాగమైన సైనికుడికి ప్రత్యేక రక్షణ కల్పించాల్సిన అవసరంలేదని.. అతడే దేశానికి, ప్రజలకు రక్షణగా నిలవాలని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ టీమిండియా సీనియర్ క్రికెటర్ ఎంఎస్ ధోనిని ఉద్దేశించి పేర్కొన్నారు. రెండు నెలల సైనిక శిక్షణను ధోని గురువారం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నెల 31 నుంచి ఆగస్ట్ 15 వరుకు కశ్మీర్ లోయలో విధులు నిర్వర్తించనున్నాడు. ఈ సందర్భంగా బిపిన్ రావత్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ధోని ట్రైనింగ్ ప్రారంభమైంది. 106 టెర్రిటోరియల్ ఆర్మీ బెటాలియన్‌లో చేరాడు. కశ్మీర్లో విక్టర్ ఫోర్స్ పేరిట నిర్వహించే యూనిట్లో ఈ బెటాలియన్ పని చేయనుండగా.. వారితో పాటే ధోని కూడా ఉండనున్నారు. కమ్యూనికేషన్, స్టాటిక్ రక్షణలో ఈ బెటాలియన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ బెటిలియన్‌లోనే ధోని పని చేయడం అతడికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక ధోనికి ప్రత్యేకంగా వసతులు ఏర్పాటుచేయలేదు. మామూలు సైనికుడికి ఎలాంటి సదుపాయాలు అందిస్తామో ధోనికి కూడా అవే లభిస్తాయి. ఇక ధోని కోసం ప్రత్యేక రక్షణ కల్పించము. అతడే దేశానికి, ప్రజలకు రక్షణగా ఉంటాడు’అంటూ బిపిన్ రావత్ వివరించారు. ఇక ప్రపంచకప్ అనంతరం క్రికెట్‌కు రెండు నెలల పాటు సెలవు తీసుకున్న ధోని.. ఆర్మీకి సేవలందించాలని నిర్ణయించుకున్నాడు. దీనికి ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ కూడా అనుమతించడంతో ధోని ఆర్మీ ట్రైనింగ్‌కు మార్గం సుగుమమైంది. ‘ధోనిలాంటి భారత క్రికెట్ దిగ్గజం తీసుకున్న నిర్ణయం.. దేశ యువతలో సైన్యంలో పని చేయాలన్న స్ఫూర్తిని కలిగిస్తుంది. అతడు కోరుకునేది కూడా అదే’ అని ఓ అధికారి తెలిపాడు. వైమానిక దళ విమానం నుంచి ఐదు పారాచూట్ జంపింగ్‌లు చేయడం ద్వారా ధోని 2015లోనే పారాట్రూపర్‌గా అర్హత సాధించిన విషయం తెలిసిందే. -
ధోని ఆర్మీ సేవలు కశ్మీర్ లోయలో!
న్యూఢిల్లీ : టీమిండియా సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోని రెండు నెలల పాటు సైన్యంలో సేవలందించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్ ముగిసిన అనంతరం దేశ రక్షణకు అహర్నిశలు శ్రమించే సైన్యం విధుల్లో తానూ భాగం కావాలని ఈ మిస్టర్ కూల్ నిర్ణయించుకున్నాడు. దీనిలో భాగంగా లెఫ్టినెంట్ కల్నల్ హోదా కలిగిన ధోని జులై 31 నుంచి ఆగస్ట్ 15 వరకు కశ్మీర్ లోయలో సేవలందించనున్నాడు. దీనికి సంబంధించి ఆర్మీ ఓ ప్రకటన విడుదల చేసింది. కశ్మీర్ లోయలోని సైనికులతో కలిసి పెట్రోలింగ్, గార్డ్, పోస్ట్ గార్డ్ డ్యూటీలను ధోని నిర్వర్తించనున్నాడని అధికారులు తెలిపారు. కాగా ధోనీ 2011 సంవత్సరంలోనే గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా పొందారు. ఆయన టెరిటోరియల్ ఆర్మీకి చెందిన 106 ఇన్ ఫాంట్రీ బెటాలియన్‌కు చెందిన వారు. ఈ బెటాలియన్ లోనే పారచూట్ శిక్షణ ఇస్తారు. ప్రస్తుతం ధోనీ ప్రాతినిధ్యం వహిస్తున్న బెటాలియన్ బెంగళూరు హెడ్ క్వార్టర్స్ కేంద్రంగా పనిచేస్తుంది. 2015 సంవత్సరం ఆగ్రాలో ధోనీ తొలిసారి సైనిక పారాట్రూపర్ గా నెలరోజుల పాటు శిక్షణ తీసుకున్నారు. పారాట్రూపర్ గా ప్రాణాలకు తెగించి రిస్క్ తీసుకొని విమానంలో నుంచి పారాచూట్ సహాయంతో దూకి శిక్షణ పొందారు. 1250 అడుగుల ఎత్తులో ఏఎన్ 32 సైనిక విమానం నుంచి ధోనీ పారాచూట్ సహాయంతో కిందకు దూకి, నేల మీద సురక్షితంగా ల్యాండవ్వడంతో ఆయన పారాట్రూపర్ గా అర్హత పొందారు. -
అతడి తర్వాత...
పట్టుదల, కృషి ఉంటే తాము ఏదైనా సాధించవచ్చనే సామెతని అక్షరాల నిజం చేసి చూపించారు గౌరి ప్రసాద్ మహాడిక్. భర్త మేజర్ ప్రసాద్ వీరమరణం పొందిన అనంతరం తన భర్తపై, దేశంపై ప్రేమతో దేశరక్షణ కోసం సైన్యంలో చేరుతోంది. ఇప్పటి వరకు జరిగిన పరీక్షలలో ఎంపికైన ఆమె 2019 ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి చెన్నైలోని ఆర్మీ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందనుంది. 49 వారాల శిక్షణ అనంతర లెఫ్ట్‌నెంట్ కమాండర్‌గా మారనుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైకి పొరుగున ఉండే థాణే జిల్లాలోని విరార్‌లో నివసించే ప్రసాద్ మహాడిక్తో గౌరి వివాహం 2015 ఫిబ్రవరి 15వ తేదీన జరిగింది. ఇండో–చైనా సరిహుద్దు అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 2017 డిసెంబరులో ప్రసాద్ వీరమరణం పొందారు. ఈ వార్త విని గౌరీ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సర్వం కోల్పోయినట్లయిందామెకు. భర్తకు నివాళిగా.. భర్త అంత్యక్రియల సమయంలో గుండె నిబ్బరం చేసుకుని ఆయనకు నివాళిగా తాను కూడా ఆర్మీలో చేరాలని నిర్ణయం తీసుకుంది. ఉన్నతవిద్యను అభ్యసించిన ఆమె ముంబైలోనే ఉద్యోగం చేసేది. అయితే అంత్యక్రియల అనంతరం పది రోజులు తిరగకుండానే భర్త అంత్యక్రియల సమయంలో ఆర్మీలో చేరి నివాళులు అర్పిస్తూ చేసిన ప్రతిజ్ఞ మేరకు తన ఉద్యోగానికి ముందుగా రాజీనామా చేసింది. అనంతరం ఆర్మీలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. దీనిపై కొందరు దుఃఖంలో ఏదో అన్నంత మాత్రాన ఆర్మీలో చేరాలా..? ఇది మూర్ఖత్వం అన్నారు. అయితే అత్తమామలు, తల్లిదండ్రులు ఆమెకు మద్దతుగా నిలిచారు. దీంతో ఆమె ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసింది. 2020లో లెఫ్ట్‌నెంట్ కమాండర్‌గా...? ఆర్మీలో చేరి భర్త వేసుకున్నటువంటిæ యూనిఫామ్ వేసుకోవాలన్న గౌరి కల 2020లో నెరవేర నుంది. ఇందుకోసం కావల్సిన పరీక్షలలో ఇప్పటి వరకు ఉత్తీర్ణత సాధించి, ఆర్మీ ఉద్యోగానికి ఎంపికైంది. ముందుగా సర్వీస్ సెలక్షన్ బోర్డు (ఎస్ఎస్బి) నిర్వహించిన పరీక్షలలో గౌరి టాపర్‌గా నిలిచింది. ఇక చెన్నైలోని ‘ఆఫీస్ ట్రైనింగ్ అకాడమీ’ (ఓటిఎ)లో శిక్షణ పొందేందుకు అర్హత సంపాదించింది. దీంతో 2019 ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ఆమె ఓటిఎలో 49 వారాలపాటు శిక్షణలో ఉంటుంది. శిక్షణ పూర్తి అయిన తర్వాత 2020 మార్చిలో ఆమె లెఫ్ట్‌నెంట్ కమాండర్‌గా బాధ్యతలు స్వీకరించనుంది. ఆమె కర్తవ్యదీక్షకు సాక్షి సలామ్. – గుండారపు శ్రీనివాస్ సాక్షి, ముంబాయి అలాగే యూనిఫామ్ వేసుకోవాలి నా నిర్ణయాన్ని మూర్ఖత్వమన్నవారే ఇప్పుడు నేను లెఫ్ట్‌నెంట్ కమాండర్‌గా ఎంపికయ్యానని తెలిసి అభినందనలు చెబుతున్నారు. సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఆర్మీలో చేరాలనే కల నెరవేరుతుండంతో ఆయన నాతో ఉన్నారనే అనుభూతిని పొందుతున్నాను. తొందర్లోనే నన్ను ‘లెఫ్టినెంట్ కమాండర్ గౌరి ప్రసాద్ మహాడిక్’ అని పిలుస్తారు. ఇది వినేందుకు చాల ఎకైసైట్మెంట్గా ఉంది. దేశానికి సేవ చేయాలనే ప్రసాద్ అర్థంతరంగా పోయారు. నేను దేశానికి సేవ చేసి ఆయన కోరికను తీరుస్తాను. – గౌరి ప్రసాద్ మహాడిక్ -
ట్రైనింగ్ వెళ్లకుండానే ... యువకుడు ఆత్మహత్య
నల్గొండ : ఉద్యోగంలో చేరాల్సిన రోజే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నల్గొండ జిల్లా వలిగొండ మండలం సుంకిశాలలో ఆదివారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన ప్రభుదాసు ఇటీవలే ఆర్మీకి ఎంపికయ్యాడు. అందులోభాగా ఈ రోజే ట్రైనింగ్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే గ్రామంలోని బావి వద్ద ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం గ్రామస్థులు ప్రభుదేసు మృతదేహాన్ని చూసి ... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్మీ విమానం నుంచి ధోనీ జంప్
-
10వేల అడుగుల ఎత్తు నుంచి ధోనీ పారాచూట్ జంప్
న్యూఢిల్లీ : టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆర్మీ శిక్షణలో భాగంగా బుధవారం ప్యారాచూట్ జంప్ చేశాడు. ఆగ్రాలోని పారా ట్రైనింగ్ స్కూల్లో ధోనీ రెండు వారాల పాటు శిక్షణ పొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం ధోనీ ఏఎన్ 32 ఆర్మీ విమానం నుంచి పదివేల అడుగుల ఎత్తులో తొలి పారాచూట్ జంప్ చేశాడు. అతడు మరో నాలుగు పారాచూట్ జంప్స్ చేయాల్సి ఉంది. 2011లో భారత సైన్యం గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్ హోదాతో ధోనీని గౌరవించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ధోనీ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్నాడు. -
ఆర్మీ శిక్షణకు వెళ్లిన ధోనీ
న్యూఢిల్లీ: భారత టి-20, వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆర్మీ శిక్షణకు వెళ్లాడు. గతంలో భారత సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్ హోదా పొందిన ధోనీ.. ప్రస్తుతం ఆగ్రాలోని ఎలైట్ పారా రెజిమెంట్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. శిక్షణ తీసుకుంటానంటూ ఇటీవల ధోనీ ఆర్మీ ఉన్నతాధికారులకు లేఖ రాయడంతో వారు అనుమతించారు. ఆగ్రాలోని పారా ట్రైనింగ్ స్కూల్లో ధోనీ రెండు వారాల పాటు శిక్షణ పొందనున్నాడు. ధోనీ శిక్షణ పొందిన తర్వాత ఐదు పారాచూట్ జంప్స్ చేయగలడని రక్షణ శాఖ ప్రతినిధి సీతాన్షు కర్ చెప్పారు. 2011లో భారత సైన్యం గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్ హోదాతో ధోనీని గౌరవించిన సంగతి తెలిసిందే. ధోనీకి కమెండో యూనిఫాం కూడా బహూకరించింది.