పట్టుదల, కృషి ఉంటే తాము ఏదైనా సాధించవచ్చనే సామెతని అక్షరాల నిజం చేసి చూపించారు గౌరి ప్రసాద్ మహాడిక్. భర్త మేజర్ ప్రసాద్ వీరమరణం పొందిన అనంతరం తన భర్తపై, దేశంపై ప్రేమతో దేశరక్షణ కోసం సైన్యంలో చేరుతోంది. ఇప్పటి వరకు జరిగిన పరీక్షలలో ఎంపికైన ఆమె 2019 ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి చెన్నైలోని ఆర్మీ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందనుంది. 49 వారాల శిక్షణ అనంతర లెఫ్ట్‌నెంట్ కమాండర్‌గా మారనుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైకి పొరుగున ఉండే థాణే జిల్లాలోని విరార్‌లో నివసించే ప్రసాద్ మహాడిక్‌తో గౌరి వివాహం 2015 ఫిబ్రవరి 15వ తేదీన జరిగింది. ఇండో–చైనా సరిహుద్దు అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 2017 డిసెంబరులో ప్రసాద్ వీరమరణం పొందారు. ఈ వార్త విని గౌరీ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సర్వం కోల్పోయినట్లయిందామెకు.
భర్తకు నివాళిగా..
భర్త అంత్యక్రియల సమయంలో గుండె నిబ్బరం చేసుకుని ఆయనకు నివాళిగా తాను కూడా ఆర్మీలో చేరాలని నిర్ణయం తీసుకుంది. ఉన్నతవిద్యను అభ్యసించిన ఆమె ముంబైలోనే ఉద్యోగం చేసేది. అయితే అంత్యక్రియల అనంతరం పది రోజులు తిరగకుండానే భర్త అంత్యక్రియల సమయంలో ఆర్మీలో చేరి నివాళులు అర్పిస్తూ చేసిన ప్రతిజ్ఞ మేరకు తన ఉద్యోగానికి ముందుగా రాజీనామా చేసింది. అనంతరం ఆర్మీలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. దీనిపై కొందరు దుఃఖంలో ఏదో అన్నంత మాత్రాన ఆర్మీలో చేరాలా..? ఇది మూర్ఖత్వం అన్నారు. అయితే అత్తమామలు, తల్లిదండ్రులు ఆమెకు మద్దతుగా నిలిచారు. దీంతో ఆమె ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసింది.
2020లో లెఫ్ట్‌నెంట్ కమాండర్‌గా...?
ఆర్మీలో చేరి భర్త వేసుకున్నటువంటిæ యూనిఫామ్ వేసుకోవాలన్న గౌరి కల 2020లో నెరవేర నుంది. ఇందుకోసం కావల్సిన పరీక్షలలో ఇప్పటి వరకు ఉత్తీర్ణత సాధించి, ఆర్మీ ఉద్యోగానికి ఎంపికైంది. ముందుగా సర్వీస్ సెలక్షన్ బోర్డు (ఎస్‌ఎస్‌బి) నిర్వహించిన పరీక్షలలో గౌరి టాపర్‌గా నిలిచింది. ఇక చెన్నైలోని ‘ఆఫీస్ ట్రైనింగ్ అకాడమీ’ (ఓటిఎ)లో శిక్షణ పొందేందుకు అర్హత సంపాదించింది. దీంతో 2019 ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ఆమె ఓటిఎలో 49 వారాలపాటు శిక్షణలో ఉంటుంది. శిక్షణ పూర్తి అయిన తర్వాత 2020 మార్చిలో ఆమె లెఫ్ట్‌నెంట్ కమాండర్‌గా బాధ్యతలు స్వీకరించనుంది. ఆమె కర్తవ్యదీక్షకు సాక్షి సలామ్.
– గుండారపు శ్రీనివాస్
సాక్షి, ముంబాయి
అలాగే యూనిఫామ్ వేసుకోవాలి
నా నిర్ణయాన్ని మూర్ఖత్వమన్నవారే ఇప్పుడు నేను లెఫ్ట్‌నెంట్ కమాండర్‌గా ఎంపికయ్యానని తెలిసి అభినందనలు చెబుతున్నారు. సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఆర్మీలో చేరాలనే కల నెరవేరుతుండంతో ఆయన నాతో ఉన్నారనే అనుభూతిని పొందుతున్నాను. తొందర్లోనే నన్ను ‘లెఫ్టినెంట్ కమాండర్ గౌరి ప్రసాద్ మహాడిక్’ అని పిలుస్తారు. ఇది వినేందుకు చాల ఎకైసైట్‌మెంట్‌గా ఉంది. దేశానికి సేవ చేయాలనే ప్రసాద్ అర్థంతరంగా పోయారు. నేను దేశానికి సేవ చేసి ఆయన కోరికను తీరుస్తాను.
– గౌరి ప్రసాద్ మహాడిక్
Comments
Please login to add a commentAdd a comment