జమ్మూ : దేశ రక్షణలో భాగం కావాలని రెండు నెలలు ఆటకు విరామం పలికిన టీమిండియా సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని బుధవారం విధుల్లో చేరాడు. లెఫ్టినెంట్ కల్నల్ హోదా కలిగిన ధోని ఆగస్ట్ 15 వరకు కశ్మీర్ లోయలో సేవలందించనున్నాడు. కశ్మీర్ లోయలోని సైనికులతో కలిసి పెట్రోలింగ్, గార్డ్, పోస్ట్ గార్డ్ డ్యూటీలను ధోని నిర్వర్తించనున్నాడు. కశ్మీర్‌లోని మిలిటెంట్ల ఏరివేతలో ప్రధాన భూమిక పోషించే విక్టర్ ఫోర్స్‌లో ధోని పనిచేయనున్నాడని, సైన్యంతో పాటే ఉంటాడని భారత ఆర్మీ ఇటీవల ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రపంచకప్ ముగిసిన అనంతరం దేశ రక్షణకు అహర్నిశలు శ్రమించే సైన్యం విధుల్లో తాను భాగం కావాలని భావించిన ఈ మిస్టర్ కూల్.. స్వయంగా వెస్టిండీస్ పర్యటనకు తప్పుకున్న విషయం తెలిసిందే.
2015 సంవత్సరం ఆగ్రాలో ధోనీ తొలిసారి సైనిక పారాట్రూపర్ గా నెలరోజుల పాటు శిక్షణ తీసుకున్నారు. పారాట్రూపర్ గా ప్రాణాలకు తెగించి రిస్క్ తీసుకొని విమానంలో నుంచి పారాచూట్ సహాయంతో దూకి శిక్షణ పొందారు. 1250 అడుగుల ఎత్తులో ఏఎన్ 32 సైనిక విమానం నుంచి ధోనీ పారాచూట్ సహాయంతో కిందకు దూకి, నేల మీద సురక్షితంగా ల్యాండవ్వడంతో ఆయన పారాట్రూపర్ గా అర్హత పొందారు. మిలయన్ డాలర్ల విలువ కలిగిన ధోనిలాంటి దిగ్గజం సాధారణ సైనికుడిలా దేశ కోసం సేవ చేయడం నేటి యువతకు మార్గదర్శకంగా ఉండనుంది. ముఖ్యంగా వారు దేశసైన్యంలో చేరే ఆసక్తిని రేకిత్తిస్తోంది. తన విధులు ప్రారంభించిన ధోనిపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment