ధోనిసేన ప్రాక్టీస్ | Dhonisena Practice | Sakshi
Sakshi News home page

ధోనిసేన ప్రాక్టీస్

Published Wed, Jun 17 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 3:50 AM

ధోనిసేన ప్రాక్టీస్

ధోనిసేన ప్రాక్టీస్

కోహ్లి షాట్‌తో బంగర్ మోకాలికి దెబ్బ

 ఢాకా : బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ నేపథ్యంలో భారత జట్టు ప్రాక్టీస్ మొదలుపెట్టింది. గత కొన్ని రోజులుగా బంగ్లాలో భారీ వర్షాలు కురుస్తున్నా.. మంగళవారం మధ్యాహ్నం ఎండ కాయడంతో టీమిండియా నాలుగు గంటల పాటు నెట్స్‌లో చెమటోడ్చింది. మధ్యాహ్నం ఒకటిన్నరకు స్టేడియానికి వచ్చిన భారత్ జట్టు కాసేపు స్ట్రెచింగ్ చేసింది. తర్వాత నెట్ ప్రాక్టీస్‌తో పాటు ఫుట్‌బాల్ ఆడింది. ముందుగా స్టువర్ట్ బిన్నీ, భువనేశ్వర్, జడేజాలు నెట్‌లో బ్యాటింగ్‌కు పదును పెట్టుకున్నారు.

ఉమేశ్, మోహిత్, ధోని, కోహ్లిలు పేసర్ల నెట్స్‌ను ఉపయోగించుకున్నారు. ఓ 20 నిమిషాల ప్రాక్టీస్ తర్వాత బ్యాట్స్‌మెన్ అందరూ భారీ షాట్లకు ప్రయత్నించారు. కోహ్లి, రోహిత్, రహానే, ధావన్, ధోనిలు పేస్, స్పిన్ ఎదుర్కోవడంతో పాటు త్రోడౌన్స్‌నూ ప్రాక్టీస్ చేశారు. అయితే కోహ్లి కొట్టిన ఓ స్ట్రయిట్ డ్రైవ్.. త్రోడౌన్స్ చేస్తున్న సహాయక కోచ్ బంగర్ కుడి మోకాలిని బలంగా తాకింది. దీంతో ఆటగాళ్లందరూ ప్రాక్టీస్ ఆపేసి బంగర్ దగ్గరకు వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత బౌలింగ్ కోచ్ భరత్ త్రో డౌన్ బాధ్యతలు తీసుకున్నారు. కోహ్లి, ఉమేశ్, ధావన్, రైనాలు ఫీల్డింగ్, క్యాచింగ్ ప్రాక్టీస్ కూడా చేశారు.

 బంగ్లాను తేలిగ్గా తీసుకోవడం లేదు: రైనా
 బంగ్లాదేశ్ జట్టును తామెంత మాత్రం తక్కువ అంచనా వేయడం లేదని డాషింగ్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా స్పష్టం చేశాడు. ఈ కారణంతోనే మూడు వన్డేల సిరీస్‌కు పూర్తి స్థాయి జట్టుతో వచ్చామని చెప్పాడు. 2014, జూన్‌లో ఇక్కడ పర్యటించిన భారత జట్టులో ఎనిమిది మంది స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చారు. అయితే అందులో ఏడుగురు ఇప్పుడు జట్టుతో పాటే ఉన్నారు.  ‘ఇటీవలి కాలంలో వన్డే ఫార్మాట్‌లో బంగ్లా అద్భుతంగా ఆడింది. అందుకే మేం దీన్ని చాలా ప్రాముఖ్యంగా తీసుకుంటున్నాం. ప్రతీ మ్యాచ్‌నూ ఆస్వాదిస్తూ విజయం సాధించాలనుకుంటున్నాం’ అని రైనా తెలిపాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ వాతావరణ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రతీ మ్యాచ్‌కు రిజర్వ్ డేను కేటాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement