రోహిత్ అద్భుతమైన క్యాచ్
పల్లెకెలె:శ్రీలంకతో ఇక్కడ ఆదివారం జరుగుతున్న మూడో వన్డేలోనూ భారత బౌలర్లు తమ హవా కొనసాగిస్తున్నారు. తొలి ఎనిమిది ఓవర్లలోపే రెండు లంక వికెట్లు తీసి ఆ జట్టును ఆదిలోనే కష్టాల్లోకి నెట్టారు. ఓపెనర్ నిరోషన్ డిక్ వెల్లా(13), కుశాల్ మెండిస్ (1)లను పది పరుగుల వ్యవధిలో పెవిలియన్ కు పంపి పైచేయి సాధించారు.
బూమ్రా వేసిన ఇన్నింగ్స్ నాల్గో ఓవర్ నాల్గో బంతికి డిక్ వెల్లా ఎల్బీగా పెవిలియన్ చేరితే, మళ్లీ బూమ్రా వేసిన ఎనిమిదో ఓవర్ నాల్గో బంతికి మెండిస్ అవుటయ్యాడు. అయితే మెండిస్ ను రోహిత్ శర్మ అద్భుతమైన క్యాచ్ తో పెవిలియన్ కు పంపాడు. రెండో స్లిప్ లో ఉన్న రోహిత్ శర్మ కుడి వైపుకు పూర్తిస్థాయిలో డైవ్ కొట్టి క్యాచ్ ను ఒడిసిపట్టుకున్నాడు. దాంతో భారత్ శిబిరంలో్ ఆనందం వెళ్లివిరియగా, లంకేయులు మాత్రం నిరాశకు గురయ్యారు.