రోహిత్ శర్మ ఒంటరి పోరాటం..!
పల్లెకెలె: శ్రీలంకతో జరగుతున్న మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ శతకం సాధించాడు. 118 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో సెంచరీ చేసి జట్టును నడిపించాడు. మరోవైపు లంక నిర్దేశించిన 218 పరుగుల స్వల్ప టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా టపార్డర్ బ్యామ్స్ మెన్ తడబడటంతో రెండో వన్డే పరిస్థితి మరోసారి కనిపించింది. అయితే ఓపెనర్ రోహిత్ శర్మ ఆచితూచి ఆడుతూ, చెత్త బంతులనే బౌండరీలకు తరలిస్తూ ఇన్నింగ్స్ ను నడిపించాడు. భారత్ 61 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండగా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (43 నాటౌట్) తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ ను సరిదిద్దాడు. భారత్ 39 ఓవర‍్లలో 4 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది.
ఆకట్టుకున్న ధనంజయ
రెండో వన్డేలో భారత టాప్, మిడిలార్డర్ వెన్ను విరిచిన లంక యువ సంచలన అఖిల ధనంజయ ఈ మ్యాచ్ లోనూ ఆకట్టుకున్నాడు. జట్టు స్కోరు 61 వద్ద తాను వేసిన తొలి ఓవర్లోనే కేఎల్ రాహుల్ (17) ను వెనక్కి పంపాడు. బౌండరీ దగ్గర లంక ఆటగాడు క్యాచ్ పట్టడంతో నిరాశగా వెనుదిరిగాడు. ఆ తర్వాత కేదార్ జాదవ్ ను డకౌట్ చేయడంతో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది.