Asia Cup 2023 Final Ind VS SL: ద్వైపాక్షిక సిరీస్‌లు కాకుండా మూడు అంతకంటే ఎక్కువ దేశాలు పాల్గొన్న అంతర్జాతీయ టోర్నీలలో భారత జట్టు విజేతగా నిలిచి ఐదేళ్లయింది. 2018లో ఆసియా కప్ టైటిల్ సాధించాక భారత జట్టు మరో టోర్నీలో చాంపియన్‌గా నిలువలేదు.
2019 వన్డే ప్రపంచకప్‌లో, 2022 టి20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్స్‌లో ఓడిన టీమిండియా... 2019, 2023 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్‌లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్ల చేతుల్లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది.
ఈ నేపథ్యంలో అంతర్జాతీయ టోర్నీ టైటిల్ నిరీక్షణ ముగించేందుకు భారత జట్టుకు ఆసియా కప్ రూపంలో మరో అవకాశం దక్కింది. స్ఫూర్తిదాయక ఆటతీరుతో ఆకట్టుకుంటున్న శ్రీలంకతో నేడు జరిగే ఫైనల్లో టీమిండియా ‘ఢీ’కొంటుంది.
తుది పోరులో గెలిచి భారత జట్టు టైటిల్ నిరీక్షణకు తెరదించుతుందా లేదా మరికొన్ని నెలలు పొడిగిస్తుందా మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.
కొలంబో: వర్షంతో దోబూచులాడిన ఆసియా కప్ వన్డే క్రికెట్ టోర్నమెంట్ తుది అంకానికి చేరుకుంది. ఆదివారం భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగే ఫైనల్‌తో ఈ టోర్నీకి తెరపడనుంది. వచ్చే నెలలో మొదలయ్యే వన్డే ప్రపంచకప్‌నకు సన్నాహకంగా భారత్, శ్రీలంక జట్లకు ఈ టోర్నీ ఉపయోగపడుతోంది. బంగ్లాదేశ్‌తో చివరి ‘సూపర్–4’ మ్యాచ్‌లో అనూహ్యంగా ఓడిపోయిన భారత జట్టు ఫైనల్‌ను మాత్రం తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు.
వాళ్లంతా వచ్చేస్తున్నారు
బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, సిరాజ్, బుమ్రా ఫైనల్లో బరిలోకి దిగుతారు. అక్షర్ పటేల్ చేతి వేళ్లకు గాయం కావడంతో అతను ఫైనల్‌కు దూరమయ్యాడు. అక్షర్ పటేల్‌కు ప్రత్యామ్నాయంగా టీమ్ మేనేజ్‌మెంట్ స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను శనివారం కొలంబోకు రప్పించింది.
బ్యాటింగ్ పరంగా భారత్ పటిష్టంగా కనిపిస్తోంది. రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, కోహ్లి, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా మెరిస్తే భారత్ భారీ స్కోరు చేయడం ఖాయం. ఈ టోర్నీలో గిల్, కోహ్లి, రాహుల్ ఒక్కో సెంచరీ కూడా చేశారు. బౌలింగ్‌లోనూ భారత్ సమతూకంగా ఉంది. జస్‌ప్రీత్ బుమ్రా, సిరాజ్, పాండ్యా పేస్‌తో ఆకట్టుకుంటే.. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా స్పిన్‌తో ప్రత్యర్థిని కట్టడి చేయగలరు.
సమష్టిగా రాణిస్తూ...
ఆసియా కప్‌లో ఆరుసార్లు చాంపియన్‌గా నిలిచిన శ్రీలంక ఏడో టైటిల్‌పై గురి పెట్టింది. భారత్ అత్యధికంగా ఏడుసార్లు ఆసియా కప్ టైటిల్‌ను సాధించింది. పలువురు స్టార్ ఆటగాళ్లు అందుబాటులో లేకపోయినా ఈ టోర్నీలో శ్రీలంక స్ఫూర్తిదాయక ఆటతో ఫైనల్‌కు దూసుకొచ్చింది. దాసున్ షనక నాయకత్వంలో తుది పోరులోనూ అదే జోరు కొనసాగించాలని శ్రీలంక పట్టుదలతో ఉంది.
బ్యాటింగ్‌లో కుశాల్ మెండిస్, నిసాంక, అసలంక, సమర విక్రమపై లంక ఆశలు పెట్టుకుంది. షనక, ధనంజయ డిసిల్వా, వెలలాగె ఆల్‌రౌండ్ పాత్రలను పోషిస్తారు. గాయం కారణంగా స్పిన్నర్ తీక్షణ ఫైనల్‌కు దూరమయ్యాడు. పతిరణ, కసున్ రజిత తమ పేస్‌తో భారత బ్యాటర్లను ఏమేరకు కట్టడి చేస్తారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment