Asia Cup 2023 IND VS SL: లంకను గెలిచి... ఆసియా కప్‌ ఫైనల్లో భారత్‌ | Asia Cup 2023: India victory over Sri Lanka by 41 runs | Sakshi
Sakshi News home page

Asia Cup 2023 IND VS SL: లంకను గెలిచి... ఆసియా కప్‌ ఫైనల్లో భారత్‌

Published Wed, Sep 13 2023 12:29 AM | Last Updated on Wed, Sep 13 2023 9:06 AM

India Victory over Sri Lanka by 41 runs - Sakshi

ఆసియా కప్‌లో వరుసగా మూడో రోజూ భారత్‌దే... సోమవారం పాక్‌పై విజయానందాన్ని కొనసాగిస్తూ మంగళవారం కూడా మరో విజయాన్ని టీమిండియా తమ ఖాతాలో వేసుకొని ఫైనల్లోకి అడుగు పెట్టింది. బౌలింగ్‌కు బాగా అనుకూలించిన పిచ్‌పై శ్రీలంక స్పిన్నర్ల ధాటికి తడబడి 213 పరుగులకే పరిమితమైనా... మన బౌలింగ్‌ బలగంతో ఆ స్వల్ప స్కోరును కూడా కాపాడుకోగలిగింది. కొంత వరకు పోరాడగలిగినా చివరకు లంకకు ఓటమి తప్పలేదు.

కొలంబో: సూపర్‌–4 దశలో వరుసగా రెండో విజయంతో భారత జట్టు ఆసియా కప్‌ టోర్నీలో ఫైనల్‌కు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 41 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 49.1 ఓవర్లలో 213 పరుగులకే ఆలౌటైంది.

రోహిత్‌ శర్మ (48 బంతుల్లో 53; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... కేఎల్‌ రాహుల్‌ (44 బంతుల్లో 39; 2 ఫోర్లు), ఇషాన్‌ కిషన్‌ (61 బంతుల్లో 33; 1 ఫోర్, 1 సిక్స్‌) రాణించారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దునిత్‌ వెలలాగె (5/40) కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన నమోదు చేయగా, అసలంకకు 4 వికెట్లు దక్కాయి.

వరుసగా 14వ వన్డేలోనూ శ్రీలంక జట్టు ప్రత్యర్థిని ఆలౌట్‌ చేయగా... భారత జట్టు మొత్తం 10 వికెట్లను స్పిన్నర్లకే చేజార్చుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అనంతరం లంక 41.3 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. దునిత్‌ వెలలాగె (46 బంతుల్లో 42 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌), ధనంజయ డిసిల్వా (66 బంతుల్లో 41; 5 ఫోర్లు) రాణించారు. నాలుగు పాయింట్లతో ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకున్న భారత్‌ తమ చివరి సూపర్‌–4 మ్యాచ్‌లో శుక్రవారం బంగ్లాదేశ్‌తో తలపడుతుంది.

రెండు పాయింట్లతో ప్రస్తుతం శ్రీలంక, పాకిస్తాన్‌ సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. ఈ రెండు జట్ల మధ్య గురువారం జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో భారత్‌తో తలపడుతుంది. ఒకవేళ శ్రీలంక, పాకిస్తాన్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయితే మెరుగైన రన్‌రేట్‌ ఉన్న శ్రీలంక (–0.200) పాకిస్తాన్‌ (–1.892)ను వెనక్కి నెట్టి ఫైనల్‌ చేరుతుంది.  

ఆదుకున్న రాహుల్, కిషన్‌... 
గత మ్యాచ్‌ తరహాలోనే ఓపెనర్‌ రోహిత్‌ జట్టుకు శుభారంభం అందించాడు. శుబ్‌మన్‌ గిల్‌ (25 బంతుల్లో 19; 2 ఫోర్లు) కాస్త నెమ్మదిగా ఆడినా రోహిత్‌ దూకుడుతో భారత్‌ దూసుకుపోయింది. షనక ఓవర్లో రోహిత్‌ 4 ఫోర్లతో చెలరేగాడు. తొలి వికెట్‌కు 67 బంతుల్లోనే 80 పరుగులు జతచేరాయి.

అయితే వెలలాగె జట్టును దెబ్బ తీశాడు. తన తొలి మూడు ఓవర్లలో అతను వరుసగా గిల్, కోహ్లి (12 బంతుల్లో 3), రోహిత్‌లను అవుట్‌ చేయడంతో 11 పరుగుల వ్యవధిలో జట్టు 3 వికెట్లు కోల్పోయింది.ఈ దశలో కిషన్, రాహుల్‌ కలిసి పరిస్థితికి తగినట్లుగా జాగ్రత్తగా ఆడుతూ  జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 63 పరుగులు జత చేశాక రాహుల్‌ వికెట్‌ కూడా వెలలాగె ఖాతాలో చేరింది.

కిషన్‌ను అసలంక వెనక్కి పంపగా, తర్వాతి 16 పరుగుల వ్యవధిలో భారత్‌ మరో 4 వికెట్లు చేజార్చుకుంది. చివర్లో అక్షర్‌ పటేల్‌ (36 బంతుల్లో 26; 1 సిక్స్‌) కీలక పరుగులు జోడించి స్కోరును 200 దాటించాడు. గత మ్యాచ్‌ ఆడిన శార్దుల్‌ స్థానంలో అక్షర్‌ను భారత్‌ తుది జట్టులోకి తీసుకుంది.
 
పోరాడినా... 
శ్రీలంకలాగే మనమూ స్పిన్నర్లతో దెబ్బ కొట్టేందుకు సిద్ధమైనా... దానికి ముందే పేసర్లు వారి పనిపట్టారు. బుమ్రా, సిరాజ్‌ ధాటికి 25 పరుగులకే తొలి 3 వికెట్లు కోల్పోయిన లంక ఆ తర్వాత తక్కువ వ్యవధిలో మరో 3 వికెట్లు చేజార్చుకొని ఓటమి దిశగా పయనించింది.

అయితే  ఈ దశలో ధనంజయ, వెలలాగె భాగస్వామ్యం లంక విజయంపై ఆశలు రేపింది. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ వీరిద్దరు పరుగులు సాధించారు. ఏడో వికెట్‌కు ఈ జోడీ 75 బంతుల్లో 63 పరుగులు జోడించింది. ఎట్టకేలకు జడేజా ఈ భాగస్వామ్యాన్ని విడదీయడంతో భారత్‌ ఊపిరి పీల్చుకుంది.

రోహిత్‌@ 10,000
భారత కెపె్టన్‌ రోహిత్‌ శర్మ వన్డేల్లో అరుదైన మైలురాయిని అధిగమించాడు. లంకతో మ్యాచ్‌లో రజిత బౌలింగ్‌లో సిక్సర్‌తో 23 పరుగులకు చేరుకోగానే రోహిత్‌ 10 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. భారత్‌ తరఫున ఈ ఘనత సాధించిన ఆరో బ్యాటర్‌గా నిలిచిన రోహిత్‌ ఓవరాల్‌గా 15వ ఆటగాడు. తన 241వ ఇన్నింగ్స్‌లో తాజా రికార్డు అందుకున్న అతను ఈ జాబితాలో కోహ్లి (205 ఇన్నింగ్స్‌) తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. 

స్కోరు వివరాలు 
భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (బి) వెలలాగె 53; గిల్‌ (బి) వెలలాగె 19; కోహ్లి (సి) షనక (బి) వెలలాగె 3; ఇషాన్‌ కిషన్‌ (సి) వెలలాగె (బి) అసలంక 33; రాహుల్‌ (సి అండ్‌ బి) వెలలాగె 39; హార్దిక్‌ పాండ్యా (సి) మెండిస్‌ (బి) వెలలాగె 5; జడేజా (సి) మెండిస్‌ (బి) అసలంక 4; అక్షర్‌ పటేల్‌ (సి) సమరవిక్రమ (బి) తీక్షణ 26; బుమ్రా (బి) అసలంక 5; కుల్దీప్‌ (సి) ధనంజయ (బి) అసలంక 0; సిరాజ్‌ (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (49.1 ఓవర్లలో ఆలౌట్‌) 213. వికెట్ల పతనం: 1–80, 2–90, 3–91, 4–154, 5–170, 6–172, 7–178, 8–186, 9–186, 10–213. బౌలింగ్‌: రజిత 4–0–30–0, తీక్షణ 9.1–0– 41–1, షనక 3–0–24–0, పతిరణ 4–0–31–0, వెలలాగె 10–1–40–5, ధనంజయ 10–0–28– 0, అసలంక 9–1–18–4.  

శ్రీలంక ఇన్నింగ్స్‌: నిసాంక (సి) రాహుల్‌ (బి) బుమ్రా 6; కరుణరత్నే (సి) గిల్‌ (బి) సిరాజ్‌ 2; మెండిస్‌ (సి) (సబ్‌) సూర్యకుమార్‌ (బి) బుమ్రా 15; సమరవిక్రమ (స్టంప్డ్‌) రాహుల్‌ (బి) కుల్దీప్‌ 17; అసలంక (సి) రాహుల్‌ (బి) కుల్దీప్‌ 22; ధనంజయ (సి) గిల్‌ (బి) జడేజా 41; షనక (సి) రోహిత్‌ (బి) జడేజా 9; వెలలాగె (నాటౌట్‌) 42; తీక్షణ (సి) (సబ్‌) సూర్యకుమార్‌ (బి) పాండ్యా 2; రజిత (బి) కుల్దీప్‌ 1; పతిరణ (బి) కుల్దీప్‌ 0; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (41.3 ఓవర్లలో ఆలౌట్‌) 172. వికెట్ల పతనం: 1–7, 2–25, 3–25, 4–68, 5–73, 6–99, 7–162, 8–171, 9–172, 10– 172. బౌలింగ్‌: బుమ్రా 7–1–30–2, సిరాజ్‌ 5– 2–17–1, పాండ్యా 5–0–14–1, కుల్దీప్‌ 9.3– 0– 43–4, జడేజా 10–0–33–2, అక్షర్‌ 5–0–29 –0.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement