అది శక్తికి మించిన పని
‘సచిన్ సెంచరీల’ రికార్డుపై కోహ్లి
కొలంబో: వన్డే క్రికెట్‌లో విఖ్యాత బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన అత్యధిక సెంచరీల (49) రికార్డును అధిగమించడం అత్యంత కష్టమైన పని అని భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. 30వ సెంచరీతో రికీ పాంటింగ్ (ఆసీస్) రికార్డును సమం చేసిన ఈ భారత స్టార్ మాట్లాడుతూ ‘గ్రేట్ మ్యాన్ (సచిన్) రికార్డు అయ్యే పని కాదు. దాని కోసం శక్తికి మించి శ్రమించాలి. అందుకే దానిపై ఆలోచించడం లేదు. టీమ్ గెలిచేందుకు నేను అజేయంగా 90 పరుగులు చేసినా అదే అమూల్యమైందిగా భావిస్తాను’ అని అన్నాడు.
2019 ప్రపంచకప్‌పై: మెగా ఈవెంట్‌కు 20–25 మంది ప్లేయర్లను సన్నద్ధం చేస్తామని కోహ్లి అన్నాడు. వీరందరికీ ప్రపంచకప్ బరిలోకి దిగే సత్తా ఉండేలా తీర్చిదిద్దుతామన్నాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో కీలకమైన సిరీస్‌ల్లో కుర్రాళ్లకు అవకాశమిస్తామని... సుదీర్ఘమైన ఈ ప్రక్రియలో పారదర్శకతతో ఆటగాళ్లను ఎంపిక చేస్తామని చెప్పాడు. తద్వారా అత్యుత్తమ తుది జట్టు ప్రపంచకప్ ఆడుతుందన్నాడు.
అత్యధిక రేటింగ్ పాయింట్లతో....
దుబాయ్: ఐసీసీ వన్డే క్రికెటర్ల ర్యాంకింగ్స్‌లో రెండు దశాబ్దాల క్రితం సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డును స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి సమం చేశాడు. తాజా ర్యాంకింగ్స్‌లో కోహ్లి నంబర్‌వన్ ర్యాంక్‌ను మరింత పటిష్టం చేసుకుంటూ అత్యధికంగా 887 పాయింట్లు సాధించాడు. దీంతో భారత క్రికెటర్లలో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన ఆటగాడిగా సచిన్ సరసన నిలిచాడు. 1998లో సచిన్ ఈ ఫీట్ సాధించి నంబర్‌వన్‌గా నిలిచాడు.