
అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో డకౌటైనా, రెండో మ్యాచ్‌లో మాత్రం మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్(49 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆడిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. తొలి టీ20 తుది జట్టు ఎంపిక విషయంలో(రోహిత్‌కు విశ్రాంతినివ్వడం) కొద్ది రోజుల కిందట టీమిండియా సారధిపై విరుచుకుపడిన ఆయన.. రెండో టీ20లో కోహ్లి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌ను ఆకాశానికెత్తేశాడు. అంతటితో ఆగకుండా మ్యాచ్‌ను ముగించడంలో కోహ్లి.. దిగ్గజ ఆటగాడు సచిన్‌తో సరిసమానమని కొనియాడాడు. ఈ విషయంలో యువ క్రికెటర్లు రిషబ్ పంత్, ఇషాన్ కిషన్‌లు కోహ్లిని ఆదర్శంగా తీసుకోవాలని సూచనలు చేశాడు.
అరంగేట్రం మ్యాచ్‌లోనే ఇషాన్ కిషన్(32 బంతుల్లో 56; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అదరగొట్టే ప్రదర్శన చేసినా, కోహ్లిలా ఆఖరి దాకా క్రీజ్‌లో ఉండేందుకు అనాసక్తి కనబరిచాడని, ఈ విషయంలో అతను కెప్టెన్ సలహాలు తీసుకోవాలని సూచించాడు. అలాగే మరో యువ ఆటగాడు రిషబ్ పంత్ (13 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) సైతం వేగంగా పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించాడే కానీ, కోహ్లిలా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడన్నాడు. జట్టును విజయతీరాలకు చేర్చడంలో కోహ్లి చాలా పట్టుదలగా ఉంటాడని, ఈ కసిని యువ క్రికెటర్లు కూడా కలిగి ఉండాలని అభిప్రాయపడ్డాడు.
ఇటీవలకాలంలో వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న విరాట్ కోహ్లికి తాజా ఇన్నింగ్స్ ఊరట కలిగించి ఉంటుదని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌తో ముగిసిన టెస్ట్ సిరీస్‌లో సైతం అంతగా ఆకట్టుకోని కోహ్లి రెండో టీ20లో అద్భుతమైన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి యువ క్రికెటర్లకు మార్గదర్శిగా నిలిచాడని సెహ్వాగ్ కితాబునిచ్చాడు. కాగా, ఇంగ్లండ్‌తో ముగిసిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి 1-1తో సిరిస్‌ను సమం చేసింది. ఇరు జట్ల మధ్య మూడో మ్యాచ్ ఇదే వేదికగా ఇవాళ ప్రారంభంకానుంది.
Comments
Please login to add a commentAdd a comment