ముంబై: ఇంగ్లండ్‌తో జరుగనున్న నిర్ణయాత్మక ఐదో టీ20లో భారత యువ ఆటగాడు ఇషాన్ కిషన్‌కు అవకాశం ఇవ్వాలని టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ అన్నాడు. కేఎల్ రాహుల్ స్థానంలో అతడికి తుది జట్టులో చోటు కల్పిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. అదే విధంగా, వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్‌ను ఆడించాలని పేర్కొన్నాడు. రెండో టీ20 ద్వారా అరంగేట్రం చేసిన ఇషాన్ కిషన్, ఆ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకుని ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మూడో టీ20(4 పరుగులు)లో అదే స్థాయిలో సత్తా చాటలేకపోయాడు. ఇక గజ్జల్లో గాయం కారణంగా నాలుగో మ్యాచ్‌కు అతడు దూరమయ్యాడు.
ఈ నేపథ్యంలో శనివారం నాటి మ్యాచ్‌కు ముందు జహీర్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగితే బాగుంటుంది. నిజాయితీగా చెప్పాలంటే, ఒకవేళ ఇషాన్ కిషన్ గాయం నుంచి కోలుకున్నట్లయితే, కేఎల్ రాహుల్ స్థానంలో అతడిని ఆడించాలి. ఒత్తిడిలోనూ దూకుడుగా ఆడగలడు. ఇక, వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్‌ను ఆడిస్తే బెటర్’’ అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా ఈ సిరీస్‌లో 4 మ్యాచ్‌లలోనూ కేఎల్ రాహుల్ పూర్తిగా విఫలమైన విషయం తెలిసిందే. అతడు నమోదు చేసిన స్కోర్లు వరుసగా 1,0,0,14.
Comments
Please login to add a commentAdd a comment