దినేశ్ కార్తీక్
న్యూఢిల్లీ: భారత వెటరన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్ తాను మళ్లీ భారత జట్టుకు ఆడగలనని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)కు సారథిగా ఉన్న అతను గత ఏడాది వన్డే ప్రపంచకప్‌లో వైఫల్యంతో జట్టుకు దూరమయ్యాడు. అయితే ఇప్పుడు టి20 ప్రపంచకప్ ఆడే టీమిండియాలో చోటు దక్కించుకోవడమే తన లక్ష్యమని అతను చెబుతున్నాడు. టి20ల్లో తనకు మెరుగైన రికార్డు ఉందని, కుర్రాళ్లతో దీటుగా పొట్టి ఫార్మాట్ ఆడగలనని చెప్పాడు. ‘గత ప్రపంచకప్ నాకు చేదు అనుభవాన్నిచ్చింది. ఆశించినట్లు ఆడలేకపోయాను. బాగా ఆడాల్సిన కీలక సమయంలో చేతులెత్తేయడంతో జట్టు నుంచి తప్పించారు. ఇది అర్థం చేసుకోగలను. అయితే పొట్టి ఫార్మాట్‌లో నాకు మంచి రికార్డు ఉంది.
భారత టి20 జట్టులోకి వచ్చే అర్హత నాకూ ఉందని నేను భావిస్తున్నాను. పైగా నేను ఇటీవల దేశవాళీ టి20ల్లో బాగా ఆడాను. పునరాగమనం చేస్తాననడంలో నాపై నాకెలాంటి సందేహం లేదు’ అని అన్నాడు. గతేడాది జట్టుకు దూరమవడం భారంగా ఉన్నా... దేశానికి ఆడాలన్న కసి తనలో ఏమాత్రం తగ్గలేదన్నాడు. తన 15 ఏళ్ల కెరీర్ ఆసాంతం ఎత్తుపల్లాలతోనే సాగిందని చెప్పుకొచ్చాడు. టి20ల్లో అతని గణాంకాలు మెరుగ్గా ఉన్నాయి. 143.52 స్ట్రయిక్ రేట్, 33.25 సగటుతో కార్తీక్ పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో రాణించి పునరాగమనం చేయాలని కార్తీక్ భావిస్తుండగా... కోవిడ్–19 కారణంగా లీగ్ జరిగే అవకాశం లేకపోవడంతో అతని కోరిక నెరవేరడం అంత సులువు కాదు. దీనిపై అతను మాట్లాడుతూ ‘టీమిండియాకు ఆడతాననే నమ్మకం నాకుంది. నేనే కాదు మొత్తం ప్రపంచమే నమ్మకంపై నడుస్తుంది’ అని అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment