ఒక్క మ్యాచ్‌తో నిర్ణయించలేం
కోహ్లి కెప్టెన్సీపై అజహర్ అభిప్రాయం
న్యూఢిల్లీ: ఒక్క మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లి నాయకత్వ లక్షణాలపై అంచనాలకు రావొద్దని భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ కోరారు. రెగ్యులర్ కెప్టెన్ ఎంఎస్ ధోని గాయం వల్ల ఆసీస్‌తో జరిగే తొలి టెస్టుకు దూరం కావడంతో విరాట్ కోహ్లికి ఆ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ‘ఈ టెస్టు ఫలితం ద్వారా కోహ్లిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ధోని గాయం కారణంగా దూరమయ్యాడు కాబట్టే అతడికి ఈ అవకాశం దక్కింది.
అందుకే ఈ ఒక్క మ్యాచ్‌తో మనం అతడి కెప్టెన్సీని అంచనా వేయలేం. ముందు కోహ్లిని ఒంటరిగా వదిలేయాలి. అందరికీ తన బ్యాటే సమాధానం చెబుతుంది. వాస్తవానికి ఆసీస్‌కన్నా మన జట్టే బలంగా ఉంది. వార్నర్‌తో పాటు మరో ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్లు బాగా ఆడుతున్నారు. మ్యాచ్ ఫలితాన్ని మార్చే ఆటగాళ్లు ఆ జట్టులో లేరు. ఇలాంటి పరిస్థితిలో మన జట్టు గెలవకుంటే నేను నిరాశపడతాను’ అని అజహర్ తెలిపారు. వీలైనంత త్వరగా అక్కడి పరిస్థితులకు అలవాటు పడడమే అన్నింటికన్నా ముఖ్యమని భారత ఆటగాళ్లకు సూచించారు.