అశ్విన్కు ఒకే ఓవర్ ఇచ్చారా?
ముంబై:భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి అత్యంత నమ్మకస్తుడైన బౌలర్ రవి చంద్రన్ అశ్విన్. అయితే ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన వరల్డ్ 20 సెమీ ఫైనల్లో అశ్విన్ చేత పూర్తి కోటా బౌలింగ్ వేయించకపోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆ మ్యాచ్లో అశ్విన్ కు ఇంకా రెండు ఓవర్లు మిగిలి ఉన్న సమయంలో విరాట్ కోహ్లికి బంతిని అప్పగించి చివరి ఓవర్ ను వేయించడం వెనుక మర్మమేమిటో ఇప్పటికీ అభిమానులకు అంతు చిక్కలేదు.
దాన్ని కాసేపు పక్కకు ఉంచితే ఐపీఎల్-9 సీజన్లో పుణే సూపర్ జెయింట్స్కు సారథ్యం వహిస్తున్న ధోని.. ముంబై ఇండియన్స్ తో జరిగిన ఆరంభపు మ్యాచ్ లో మరోసారి అదే పునరావృతం చేశాడు. పుణె జట్టులోనే ఉన్న ప్రధాన స్పిన్నర్ అశ్విన్కు కేవలం ఒక ఓవర్ మాత్రమే ఇవ్వడం మరోసారి వార్తల్లో నిలిచింది. అది కూడా ఇన్నింగ్స్ 16.0 ఓవర్. ఆ ఓవర్ వేసిన అశ్విన్ తొలి బంతికి ముంబై ఆటగాడు అంబటి రాయుడ్ని పెవిలియన్ కు పంపి సత్తా చాటుకున్నాడు. అయితే ఆ ఒక్క ఓవర్కే అశ్విన్ను పరిమితం చేయడంతో అతనిపై ధోనికి నమ్మకం సన్నగిల్లిందని వాదన కూడా వినిపిస్తోంది.
దీనిపై పుణె జట్టుకే చెందిన సహచర ఆటగాడు అజింక్యా రహానే కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అశ్విన్కు ఒక్క ఓవర్ మాత్రమే ఎందుకు ఇచ్చారనేది తనకు తెలియడం లేదన్నాడు.'అశ్విన్ ఒక అనుభవజ్ఞుడైన బౌలర్. అంతే కాకుండా నాణ్యమైన బౌలర్ కూడా. కానీ ఒక్క ఓవర్ కు మాత్రమే అశ్విన్ పరిమితం చేయాల్సి వచ్చిందనేది నాకు పూర్తిగా తెలియదు. కెప్టెన్ గా ధోని ఏ ప్రణాళికలతో ముందుకెళ్లాడో అతనికే తెలుస్తుంది' అని రహానే పేర్కొన్నాడు. తమ బౌలర్లు మెరుగ్గా బౌలింగ్ చేయడంతోనే విజయం సునాయాసంగా దక్కిందని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకున్న రహానే తెలిపాడు.