టీమిండియా కోచ్‌గా ఆయనా???
న్యూఢిల్లీ: టీమిండియా కోచ్‌గా అనిల్‌కుంబ్లే ఆకస్మిక రాజీనామా అనంతరం బీసీసీఐ కోచ్ వేట మొదలు పెట్టింది. గతంలో వెస్టిండీస్ పర్యటన అనంతరం కోచ్ నియమించాలని, అప్పటి వరకూ కుంబ్లే కోచ్‌గా కొనసాగుతాడని బీసీసీఐ ప్రకటించింది. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ, కుంబ్లే మధ్య వివాదాలు తలెత్తడంతో కుంబ్లే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో జట్టు మాజీ డైరెక్టర్ రవిశాష్త్రికి బీసీసీఐ కోచ్ పదవికి తలుపులు తెరిచినట్టయింది. ఇది వరకే కోహ్లీ రవిశాష్త్రిని ఛీఫ్‌కోచ్‌గా నియమించాలని బీసీసీఐని కోరిన సంగతి విదితమే.
సచిన్ టెండూల్కర్, సౌరవ్‌గంగూలీ, వీవీఎస్ లక్ష్మణలతో కూడిన క్రికెట్ సలహా కమిటీ అంగీకరిస్తే రవిశాస్త్రి కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు నియమించిన అడ్మినిస్టేటరీ కమిటీ తెలిపింది. అడ్మినిస్ట్రేటివ్ కమిటీ సభ్యుడు తెలిపిన సమాచారం ప్రకారం, ఇంతకుముందు కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న వారు మాత్రమే కోచ్ పదవికి అర్హులు. కానీ సలహా కమిటీ ప్రత్యేక విన్నపం ద్వారా బయటి వ్యక్తులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. మామూలుగా రవిశాస్త్రి కోచ్ పదవికోసం దరఖాస్తు చేసుకోలేదు. దీంతో ఆయన్ని కోచ్‌గా ఎంపిక చేసుకొనే అవకాశంలేదు. కానీ బీసీసీఐ ప్రత్యేక విన్నపం ద్వారా ఆస్థానాన్ని భర్తీ చేసుకోవచ్చు. రవిశాష్త్రిని ఇంటర్యూ చేయాలనుకుంటే ఆయనకోసం తలుపులు తెరిచే ఉన్నాయని ఆయన తెలిపారు. ఇందుకోసం బీసీసీఐ ప్రత్యేక విన్నపాన్ని అడ్మినిస్ట్రేటివ్ కమిటీకి సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ బీసీసీఐ అలా చేయకపోతే రవిశాష్త్రిని కోచ్‌గా ఎంపిక చేసే అవకాశం లేదు.
గతేడాది కోచ్ పదవికోసం కుంబ్లేతో పోటీ ఓడిపోవడంతో ఇప్పుడు దరఖాస్తు చేసుకోలేదు. అయితే చాంపియన్‌ట్రోఫీకి వెళ్లే ముందు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్‌లు రవిశాష్త్రిని పరిగణలోకి తీసుకోవాలని బీసీసీఐని కోరారు. అంతే కాకుండా కోచ్ పదవికోసం భారత్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, సన్‌రైజర్స్ కోచ్ టామ్‌మూడీ, రిచర్డ్ పైబస్, ఆఫ్ఘనిస్తాన్ కోచ్ లాల్ చంద్ రాజ్‌పుత్, దొడ్డా గణేష్‌లు దరఖాస్తు చేసుకున్నారు.