కోచ్ రవిశాస్త్రికి బీసీసీఐ భారీ ప్యాకేజీ
న్యూఢిల్లీ: గతంలో ఏ కోచ్‌కు దక్కని భారీ వేతన ప్యాకేజీని టీమిండియా నూతన కోచ్ రవిశాస్త్రి అందుకోనున్నాడు. ఏడాది కాలవ్యవధికిగానూ శాస్త్రి ఏడున్నర కోట్లకు పైగా అందుకోనున్నట్లు ప్రచారంలో ఉంది. ఇటీవలే కోచ్ పదవి నుంచి తప్పుకున్న అనిల్ కుంబ్లే దాదాపు ఏడు కోట్ల వరకు వార్షిక వేతనం అందుకున్నాడు. అయితే ప్రస్తుత పరిస్థితులు రవిశాస్త్రికి అనుకూలం కావడంతో రూ.7.5కోట్లకు మించిన ప్యాకేజీని కూడా అతడు చేజిక్కుంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొందరు బీసీసీఐ పెద్దలు ఈ విషయం చెప్పకనే చెబుతున్నారు. మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లీ మద్దతుతో అతడు తన వేతనపై భారీ డిమాండ్లు చేయగా, అందుకు బీసీసీఐ అంగీకరించినట్లు సమాచారం.
గతంలో టీమ్ డైరెక్టర్‌గా వ్యవహరించిన 2014-16 సమయంలో రవిశాస్త్రి రూ.7 కోట్ల వార్షిక వేతనం అందుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రధాన కోచ్ సహాయక సిబ్బందిగా ఉండే బౌలింగ్, బ్యాటింగ్ కన్సల్టెంట్‌లకు రూ.2 కోట్లకు మించి ఇచ్చే యోచనలో బీసీసీఐ లేదు. త్వరలోనే ఈ ప్యాకేజీలపై చర్చించి స్పష్టత ఇవ్వనుంది బీసీసీఐ. బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌కు రూ.2 కోట్ల వేతనమంటే అతడి ప్యాకేజీ కొంతమేరకు పెరిగినట్లే. బ్యాటింగ్ కోచ్‌గా కొనసాగేందుకు బంగర్ ఐపీఎల్ ఫ్రాంచైజీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాటింగ్ కోచ్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఒకవేళ శాస్త్రి కోరుకున్నట్లుగా భరత్ అరుణ్‌ను బౌలింగ్ కోచ్‌గా తీసుకుంటే అతడు ఐపీఎల్ జట్టు బెంగళూరుతో పాటు హైదరాబాద్ రంజీ జట్టు బౌలింగ్ కోచ్ పదవికి స్వస్తి పలకాల్సిందే.
ఇండియా-ఏ, అండర్ 19 జట్లకు కోచ్‌గా మరో రెండేళ్లపాటు కొనసాగనున్న రాహుల్ ద్రవిడ్ తొలి ఏడాదికి రూ.4.5 కోట్లు, రెండో ఏడాదికి రూ.5 కోట్లు అందుకోనున్నాడు. ఒకవేళ విదేశాల్లో బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా కొనసాగితే బీసీసీఐ అందుకోసం ద్రవిడ్‌కు మరికొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. గతేడాది జహీర్‌ఖాన్‌ను సంప్రదించగా కేవలం 100 రోజులకే రూ.4 కోట్లు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఓవైపు రవిశాస్త్రికి అతడు నమ్మకస్తుడు అవకపోవడం, మరోవైపు భారీ ప్యాకేజీలు డిమాండ్ చేయడం జహీర్‌కు కష్టాలు తెచ్చిపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.