సంతోషం డబుల్
అనుభవం తక్కువే అయినా... మైదానంలో మెరిసిన యువ క్రీడాకారులు ఆసియా క్రీడల్లో భారత సంతోషాన్ని ‘డబుల్' చేశారు. టెన్నిస్‌లో సానియా మీర్జా-సాకేత్‌ల ద్వయం, డిస్కస్‌త్రోలో సీమా పూనియా స్వర్ణ కాంతులు నింపారు. సాకేత్-సనమ్ జోడి టెన్నిస్‌లో... రెజ్లింగ్‌లో భజరంగ్ రజతాలతో తళుక్కుమన్నారు. అథ్లెటిక్స్‌లో మరో రెండు, రెజ్లింగ్‌లో ఇంకో కాంస్యంతో... ఓవరాల్‌గా పదో రోజు భారత్ ఖాతాలో ఏడు పతకాలు చేరాయి. ప్రత్యర్థులు తమకంటే బలంగా ఉన్నా... వర్షం కారణంగా మ్యాచ్‌లు ఆలస్యంగా సాగినా... భారత ‘ఎస్’ త్రయం (సానియా, సాకేత్, సీమా) అనుకున్నది సాధించి ‘త్రివర్ణాన్ని’ రెపరెపలాడించారు.
ఇంచియాన్: ఆసియా క్రీడల్లో సోమవారం తెలుగు వెలుగులు విరజిమ్మాయి. హైదరాబాద్ ద్వయం సానియా మీర్జా, సాకేత్ మైనేని టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణం సాధించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. ఫైనల్లో రెండోసీడ్ సానియా-సాకేత్ ద్వయం 6-4, 6-3తో టాప్‌సీడ్ హో చింగ్ చెన్-సియాన్ యిన్ పెంగ్ (చైనీస్‌తైపీ)పై విజయం సాధించింది. 69 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జోడి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలిసారి ఆసియా గేమ్స్‌లో ఆడుతున్న సాకేత్ భారీ సర్వీస్‌లతో పాటు నెట్ వద్ద ఆకట్టుకున్నాడు. బలమైన వ్యాలీలు సంధించాడు. తైపీ మహిళా ప్లేయర్ హోను లక్ష్యంగా చేసుకుని కొట్టిన షాట్లు కొన్నిసార్లు ఆమె శరీరాన్ని తాకాయి. తొలి సెట్ ఏడో గేమ్‌లో హో సర్వీస్‌ను బ్రేక్ చేసిన భారత జంట స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. అయితే సాకేత్ సర్వీస్‌లో పెంగ్ కొట్టిన బ్యాక్‌హాండ్ షాట్ బయటకు వెళ్లడంతో సెట్ భారత్ సొంతమైంది. అద్భుతమైన షాట్లతో రెండో సెట్‌ను ప్రారంభించిన సానియా జోడి తొలి గేమ్‌లోనే పెంగ్ సర్వీస్‌ను బ్రేక్ చేసింది. అయితే నాలుగో గేమ్‌లో సానియా సర్వీస్‌ను కోల్పోయింది. కానీ పుంజుకున్న భారత ద్యయం ప్రత్యర్థి సర్వీస్‌ను మళ్లీ బ్రేక్ చేసింది. ఆ తర్వాత భారత జోడి వెనుదిరిగి చూడలేదు. తొలిసారి ఆసియా క్రీడల్లో పాల్గొన్న సాకేత్ రెండు పతకాలు సాధిస్తే... సానియాకు ఇది కెరీర్‌లో 8వ ఆసియా గేమ్స్ పతకం కావడం విశేషం.
పురుషుల డబుల్స్ ఫైనల్లో ఐదోసీడ్ సాకేత్-సనమ్ ద్వయం 5-7, 6-7 (2/7)తో 8వ సీడ్ యాంగ్‌కు లిమ్-హెయాన్ చుంగ్ (కొరియా) చేతిలో ఓడి రెండో స్థానంలో నిలిచింది. దీంతో రజతం కైవసం చేసుకుంది. గంటా 29 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కొరియన్లు అద్భుతమైన షాట్లతో అలరించారు. తొలి సెట్‌లో ఓడిన తర్వాత రెండోసెట్‌లో భారత జోడి తీవ్రంగా పోరాడింది. దీంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో కొరియన్లు దూకుడును పెంచడంతో భారత జంట 1-4, 2-6తో వెనుకబడింది. ఈ దశలో సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో పాటు నాలుగు మ్యాచ్ పాయింట్లు గెలిచి కొరియన్లు స్వర్ణం చేజిక్కించుకున్నారు.
భవిష్యత్‌కు భరోసా...
లియాండర్ పేస్, మహేశ్ భూపతి, రోహన్ బోపన్న... ఈ ముగ్గురూ కొన్నేళ్లుగా భారత టెన్నిస్‌కు పర్యాయపదంగా ఉన్నారు. పేస్, భూపతి వయస్సు నాలుగు పదులు దాటగా... బోపన్న వయస్సు 34 ఏళ్లు. మరి వీరి తర్వాత ఎవరు? డబుల్స్‌లో మన సంగతేంటి? ఇలాంటి సందేహాలకు తెరదించుతూ... భారత టెన్నిస్ భవిష్యత్‌కు భరోసా కల్పిస్తూ... రాకెట్ వేగంతో దూసుకొచ్చిన యువతేజమే సాకేత్ మైనేని. 1987లో అక్టోబరు 19న వైజాగ్‌లో జన్మించిన సాకేత్... 11 ఏళ్ల వయస్సులో టెన్నిస్ రాకెట్ పట్టాడు. ఆ తర్వాత మెరుగైన శిక్షణ కోసం హైదరాబాద్‌కు మకాం మార్చాడు. 2005లో జాతీయ జూనియర్ చాంపియన్‌గా అవతరించాడు. 2006లో విద్యాభ్యాసం కోసం అమెరికాలోని అలబామా యూనివర్సిటీలో చేరాడు. ఐదేళ్లపాటు అమెరికాలో ఉన్న సాకేత్ ఒకవైపు చదువుతూనే మరోవైపు తన టెన్నిస్ మెళకువలకు పదునుపెట్టి అలబామా యూనివర్సిటీ టాప్ ప్లేయర్ స్థాయికి ఎదిగాడు. 2011లో భారత్‌కు వచ్చిన వెంటనే ఐటీఎఫ్ ఫ్యూచర్స్ టోర్నీలో పాల్గొని సింగిల్స్‌తోపాటు డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచాడు. ఇప్పటివరకు కెరీర్‌లో తొమ్మిది సింగిల్స్ టైటిల్స్, 14 డబుల్స్ టైటిల్స్ సాధించాడు. 6 అడుగుల 4 అంగుళాల ఎత్తు, 90 కేజీల బరువు ఉన్న సాకేత్ భారీ సర్వీస్‌లకు పెట్టింది పేరు. చైనీస్ తైపీతో జనవరిలో జరిగిన డేవిస్ కప్ పోరులో సాకేత్ భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత కొరియాతో పోరులోనూ ఆడాడు. తాజాగా ఆసియా క్రీడల్లో పతకాలతో భారత పురుషుల టెన్నిస్‌కు ఆశాకిరణమయ్యాడు. - సాక్షి క్రీడావిభాగం
ఆనవాయితీ కొనసాగింది...
ఆసియా క్రీడల్లో కచ్చితంగా భారత్‌కు పతకం అందిస్తోన్న క్రీడాంశాల్లో మహిళల డిస్కస్ త్రో ఒకటి. చివరి మూడు ఆసియా క్రీడల్లో (బుసాన్ 2002, దోహా 2006, గ్వాంగ్‌జౌ 2010) మనకు ఈ అంశంలో పతకాలు వచ్చాయి. నాలుగోసారీ ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ సీమా పూనియా (అంటిల్) భారత్ ఖాతాలో స్వర్ణాన్ని జమ చేసింది. 31 ఏళ్ల ఈ హర్యానా అమ్మాయి వరుసగా మూడు కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించగా... ఇన్నాళ్లు లోటుగా ఉన్న ఆసియా క్రీడల్లోనూ తన సత్తా చాటుకుంది. బరిలోకి దిగిన తొలిసారే పసిడి కాంతులు విరజిమ్మింది. 2006 మెల్‌బోర్న్ కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం నెగ్గిన సీమా... అదే ఏడాది దోహా ఆసియా క్రీడలకు ముందు డోపింగ్‌లో పట్టుబడి ఈ క్రీడలకు దూరమైంది. 5 అడుగుల 11 అంగుళాల ఎత్తు, 75 కేజీల బరువున్న సీమా 2010 ఆసియా క్రీడల్లో బరిలోకి దిగలేదు. డిస్కస్ త్రో కోచ్ అంకుష్ పూనియాను 2011లో వివాహం చేసుకున్న సీమా లండన్ ఒలింపిక్స్‌లో నిరాశపరిచింది. ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం నెగ్గిన సీమా అదే జోరును కొనసాగించి ఇప్పుడు స్వర్ణం గెలిచింది. - సాక్షి క్రీడావిభాగం
అంచనాలకు మించి రాణించిన భారత అథ్లెట్ సీమా పూనియా అంటిల్ అథ్లెటిక్స్‌లో తొలి స్వర్ణాన్ని అందించింది. మహిళల డిస్కస్ త్రో ఫైనల్లో డిస్క్‌ను 61.03 మీటర్ల దూరం విసిరిన ఆమె అగ్రస్థానంలో నిలిచింది. సీమా నాలుగో ప్రయత్నంలో ఈ దూరాన్ని అందుకుంది.
వెటరన్ ప్లేయర్ కృష్ణ పూనియా 55.57 మీటర్ల దూరంతో నాలుగో స్థానంతో సంతృప్తిపడింది.
మహిళల 1500 మీటర్ల రేసులో ఓపీ జైషా కాంస్యం సంపాదించింది. ఫైనల్ రేసులో 4:13.46 సెకన్లలో లక్ష్యాన్ని ముగించి మూడో స్థానంలో నిలిచింది.
అజిత్ మర్కోస్ సిని 4:17.12 సెకన్ల టైమింగ్‌తో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.
పురుషుల 3 వేల మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో నవీన్ కుమార్ కాంస్యంతో మెరిశాడు. ఫైనల్లో నవీన్ 8:40.39 సెకన్ల టైమింగ్‌తో మూడో స్థానం సాధించాడు. ఇది అతని వ్యక్తిగత బెస్ట్.
ఆగమేఘాల మీద చైనాకు...
ఆసియా క్రీడల మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణం గెలిచిన సానియా మీర్జా... సోమవారం తన కెరీర్‌లోనే అత్యంత బిజీగా రోజును గడిపింది. షెడ్యూల్ ప్రకారం ఆసియా క్రీడల్లో ఫైనల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు మొదలవ్వాలి. కానీ వర్షం కారణంగా వాయిదాపడి, సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ముగిసింది. అయితే సానియా మీర్జా చైనా ఓపెన్‌లో మహిళల డబుల్స్‌లో కారాబ్లాక్‌తో కలిసి బరిలోకి దిగాల్సి ఉంది. అదృష్టవశాత్తు సానియా జోడికి తొలి రౌండ్‌లో బై లభించింది. దీంతో సోమవారం రాత్రి బయల్దేరితే మంగళవారం చైనాలో రెండో రౌండ్ ఆడే అవకాశం ఉంటుంది. దీంతో మొత్తం లగేజ్ అంతా సర్దేసుకుని స్టేడియానికి వచ్చి మ్యాచ్ అయిపోయాక నేరుగా ఎయిర్‌పోర్ట్‌కు ఆగమేఘాల మీద వెళ్లింది. నిజానికి తొలుత సానియా ఆసియా క్రీడలకు దూరమవ్వాలని భావించినా... మనసు మార్చుకుని చైనా ఓపెన్ వదిలేయాలని అనుకుంది. అయితే ఆ టోర్నీలో తొలి రౌండ్ బై దొరకడం వల్ల ఇప్పుడు చైనా ఓపెన్‌లో కూడా ఆడనుంది. - సాక్షి, హైదరాబాద్