దుబాయ్: వివాదాస్పదంగా మారిన అంపైర్ నిర్ణయ సమీక్షా పద్ధతి (డీఆర్‌ఎస్) పనితీరును అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సమీక్షించింది. అయితే టెక్నాలజీ మూలాల్లోకి వెళ్లకుండా మరో నిబంధనను జత చేయాలని నిర్ణయించింది.
ఇక్కడ రెండు రోజుల పాటు జరిగిన ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ (సీఈసీ) సమావేశం అనంతరం పలు నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో డీఆర్‌ఎస్‌తో పాటు ఓవర్ రేట్, వెలుతురు లేమి, అంపైరింగ్‌లో టెక్నాలజీ వాడకం, వన్డే నిబంధనలు తదితర అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఈసీ పలు సూచనలు కూడా చేసింది. కొత్త నిబంధనలు అక్టోబర్ 1నుంచి అమల్లోకి వస్తాయి.
టెస్టు మ్యాచుల్లో ఇప్పటి వరకు ఒక ఇన్నింగ్స్‌లో రెండు రివ్యూలను మాత్రమే అనుమతించేవారు. అయితే కొత్త నిబంధన ప్రకారం ప్రతీ 80 ఓవర్ల తర్వాత రెండు రివ్యూలకు అవకాశం ఉంటుంది. అందుబాటులో ఉన్న రివ్యూలను వాడినా, వాడకున్నా 80 ఓవర్ల తర్వాత మాత్రం రెండింటినే ఉపయోగించుకోవాలి.
వన్డేల్లో రెండు కొత్త బంతులను వాడుతున్న ప్రస్తుత నిబంధనను సవరించారు. ఇకపై ఏదేని కారణంతో ఆరంభానికి ముందే 25 ఓవర్ల మ్యాచ్‌గా నిర్ణయమైతే ఒకే బంతిని వాడతారు.
50 ఓవర్ల పాటు మనగలిగే సామర్థ్యం ఉండి, ఇరు జట్లకు సమాన అవకాశాలు ఉండేలా కొత్త బంతిని అభివృద్ధి చేయాలని క్రికెట్ కమిటీకి సూచన. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ను ఐసీసీ అక్టోబరులో అధికారికంగా ప్రకటిస్తుంది.
ప్రతీ 80 ఓవర్లకు రెండు రివ్యూలు!
Published Thu, Sep 19 2013 12:51 AM | Last Updated on Fri, Sep 1 2017 10:50 PM
Advertisement