ఐసీసీలో భారీ మార్పులు
దుబాయ్: ప్రపంచ క్రికెట్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి ఉన్న ఆధిపత్యం ఇక నామమాత్రమే కానుందా? ఈ అధికారం ఇక భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ), క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ), ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)లకే చెందనుందా? తాజా పరిస్థితులను గమనిస్తే అవుననే సమాధానం వస్తుంది. ఐసీసీ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి.
దీంట్లో భాగంగా ఇప్పటికే రెవిన్యూ పరంగా అధిక ఆదాయాన్నిస్తున్న బీసీసీఐ, సీఏ, ఈసీబీలకు కీలక నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని కట్టబెట్టనున్నారు. ఈమేరకు ఈనెల 28, 29న దుబాయ్‌లో జరిగే ఐసీసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో ఓ ముసాయిదాను ప్రవేశపెట్టనున్నారు. ఈ మూడు బోర్డులు ముఖ్య సభ్యులుగా ఉన్న ఐసీసీ ఫైనాన్స్ అండ్ కమర్షియల్ ఎఫైర్స్ కమిటీ కొన్ని సవరణలు ప్రతిపాదించింది. ఇవి అమల్లోకి వస్తే క్రికెట్‌పై గుత్తాధిపత్యం ఈ మూడు క్రికెట్ బోర్డుల చేతికే వస్తుంది. అలాగే ఐసీసీ ఆదాయంలో కూడా వీటికి భారీ వాటానే దక్కనుంది. అయితే ఈ ప్రతిపాదనలపై ఇతర సభ్య దేశాల ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్టు ఐసీసీ తెలిపింది.
ప్రతిపాదిత సవరణలు
ఐసీసీకి వచ్చిన ఆదాయాన్ని క్రికెట్ బోర్డులకు పంచే విధానంలో మార్పు
పరిపాలన నిర్మాణం, భవిష్యత్ పర్యటన కార్యక్రమం (ఎఫ్‌టీపీ)
టెస్టు ర్యాంకింగ్స్ ఇచ్చే పద్దతి
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ స్థానంలో చాంపియన్స్ ట్రోఫీ పునరుద్ధరణ
కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీ నియామకంలో బీసీసీఐ, ఈసీబీ, సీఏలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వడం, ఇతర అన్ని కమిటీలపై అధికారాన్ని కల్పించడం
ఐసీసీలో కీలక పదవులైన చైర్మన్, ఫైనాన్స్ అండ్ కమర్షియల్ ఎఫైర్స్ కమిటీ పదవులకు మూడు క్రికెట్ బోర్డుల నుంచే నామినేషన్‌లు వేయడం
ఇక ముగ్గురిదే పెత్తనం!
Published Sun, Jan 19 2014 1:44 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM
Advertisement
Advertisement