ఐదేళ్ల తర్వాత...
టెస్టుల్లో అగ్రస్థానానికి ఆస్ట్రేలియా
వన్డేల్లోనూ కంగారూలే టాప్
టి20ల్లో నంబర్‌వన్‌గా భారత్
దుబాయ్: ఐదేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌లో వన్డేల్లో, టెస్టుల్లోనూ తిరుగులేని ఆధిపత్యం కనబరచి నంబర్‌వన్‌గా చలామణి అయిన ఆస్ట్రేలియా... క్రమంగా తన వైభవం కోల్పోయింది. అయితే తాజాగా విడుదల చేసిన ఐసీసీ ర్యాంకుల్లో తిరిగి ఆస్ట్రేలియా వన్డేల్లో, టెస్టుల్లోనూ నంబర్‌వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఐదేళ్ల తర్వాత ఆస్ట్రేలియా జట్టు నంబర్‌వన్ స్థానానికి రావడం విశేషం. దక్షిణాఫ్రికాతో సమానంగా 123 రేటింగ్ పాయింట్లను కలిగి ఉన్నప్పటికీ దశాంశ స్థానాల ఆధారంగా కంగారూలది పైచేయి అయింది.
ఇక వన్డే ర్యాంకుల్లో ఆసీస్ (115 రేటింగ్ పాయింట్లు) నంబర్ వన్ ర్యాంకును నిలబెట్టుకుంది. అటు టెస్టుల్లో, ఇటు వన్డేల్లో టాప్‌లో నిలవడం 2008 డిసెంబర్ తర్వాత ఇదే మొదటిసారి కావడం విశేషం. ఏడాది కాలంలో టెస్టుల్లో ఘోరంగా విఫలమైన భారత్ మూల్యం చెల్లించుకుంది. మూడో స్థానం నుంచి ఐదుకు దిగజారింది. అయితే వన్డే ర్యాంకుల్లో ఒక రేటింగ్ పాయింట్ కోల్పోయినప్పటికీ ధోనీసేన (112) రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది.
గెలవకున్నా ఎలాగంటే...
వార్షిక ర్యాంక్‌లను ప్రకటించడానికి మూడు సీజన్ల ప్రదర్శనను పరిగణలోకి తీసుకుంటారు. 2011-12 నుంచి 2013-14 సీజన్లు వరకు మ్యాచ్‌ల ఫలితాలను పరిగణలోకి తీసుకుంటారు. దీంతో ఆసీస్ సాధించిన తాజా యాషెస్ విజయానికి ఎక్కువ పాయింట్లు రావడం ఆ జట్టుకు కలిసొచ్చింది.
టి20ల్లో భారత్ టాప్
ఐసీసీ టి20 ర్యాంకుల్లో ధోనీసేన మళ్లీ అగ్రస్థానానికి చేరింది. వార్షిక ర్యాంకుల ప్రకారం భారత్ ఒక ర్యాంకును మెరుగుపర్చుకుంది. ఫలితంగా టి20 ప్రపంచ చాంపియన్ శ్రీలంక ఒక ర్యాంకు కోల్పోయి రెండోస్థానంలో నిలిచింది. 12 నెలల కాలంలో భారత్ ఒకే ఒక్క టి20 మ్యాచ్‌లో ఓడగా.. శ్రీలంక మాత్రం నాలుగు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది.