ఫుట్ బాల్ మ్యాచ్లో విషాదం
డాకర్: వినోదాన్ని పంచాల్సిన ఫుట్‌బాల్ మ్యాచ్.. అభిమానం హద్దులు దాటడంతో విషాదాన్ని మిగిల్చింది. పశ్చిమ ఆఫ్రికా దేశం సెనెగల్లో ఫుట్ బాల్ లీగ్ కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అభిమానులు మధ్య జరిగిన ఘర్షణ ఎనిమిది మంది మృత్యువాత పడటానికి కారణమైంది.
యూఎస్ ఓకామ్-స్టేడ్ డీ బార్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇరు జట్ల ఫ్యాన్స్ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. మొదటి యూఎస్ ఓకామ్ అభిమానులు.. స్టేడ్ డీ బార్ ఫ్యాన్స్ పై రాళ్లు విసరడం ఆరంభించారు. దాంతో అవతలి జట్టు అభిమానులు సైతం ఎదురుదాడికి దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. వీరిని బెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించగా కొంతమంది అభిమానులు తమ సీట్లను ఖాళీ చేసేందుకు యత్నించారు. అదే సమయంలో అభిమానుల రద్దీ బాగా పెరిగి సీట్లను అనుకుని ఉన్న గోడ కూలిపోయింది. దాంతో ఎనిమిది మంది తమ ప్రాణాలు కోల్పోగా, మరో 49 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.