
ఇంగ్లండ్ ఘనవిజయం
పాకిస్తాన్‌తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ జట్టు 330 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌ను 1-1తో...
పాకిస్తాన్‌తో రెండో టెస్టు
మాంచెస్టర్: పాకిస్తాన్‌తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ జట్టు 330 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఆట నాలుగో రోజు సోమవారం 565 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన పాకిస్తాన్ 70.3 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ మొహమ్మద్ హఫీజ్ (72 బంతుల్లో 42; 7 ఫోర్లు; 1 సిక్స్), అసద్ షఫీఖ్ (53 బంతుల్లో 39; 8 ఫోర్లు) మినహా అందరూ విఫలమయ్యారు. పేసర్లు జేమ్స్ అండర్సన్, వోక్స్‌తో పాటు స్పిన్నర్ మొయిన్ అలీ మూడేసి వికెట్లతో పాక్ వెన్నువిరిచారు.
అంతకుముందు ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 30 ఓవర్లలో వికెట్ నష్టానికి 173 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓపెనర్ అలిస్టర్ కుక్ (78 బంతుల్లో 76 నాటౌట్; 9 ఫోర్లు), జో రూట్ (48 బంతుల్లో 71 నాటౌట్; 10 ఫోర్లు) వన్డే తరహాలో ఆడి పాక్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు. వచ్చే నెల 3 నుంచి ఎడ్జ్‌బాస్టన్‌లో మూడో టెస్టు జరుగుతుంది.