
సఫారీలకు మరో షాక్
డర్బన్: టెస్టు క్రికెట్లో నెంబర్ వన్ జట్టు దక్షిణాఫ్రికాకు మరో షాక్ తగిలింది. సఫారీలతో నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ 241 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ సిరీస్లో ఇంగ్లండ్ 1-0తో ముందంజ వేసింది. సఫారీలు గత ఐదు టెస్టుల్లో నాలుగింటిలో ఓటమి చవిచూడటం గమనార్హం. భారత్తో టెస్టు సిరీస్ను 0-3లో సఫారీలు ఓడిన సంగతి తెలిసిందే.
ఇంగ్లండ్తో తొలి టెస్టు చివరి రోజు బుధవారం 416 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సఫారీలు 174 పరుగులకు కుప్పకూలారు. ఇంగ్లండ్ బౌలర్లు ఫిన్ నాలుగు, అలీ మూడు వికెట్లు పడగొట్టారు. దక్షిణాఫ్రికా జట్టులో ఓపెనర్ ఎల్గర్ (40) టాప్ స్కోరర్. తొలి ఇన్నింగ్స్ల్లో ఇంగ్లండ్ 303, దక్షిణాఫ్రికా 214 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 326 పరుగులు చేసింది.