ముంబై: భారత మహిళలతో జరిగిన చివరిదైన మూడో వన్డేలో ఇంగ్లండ్ మహిళలు రెండు వికెట్ల తేడాతో గెలుపొందారు. భారత్ నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ మహిళలు 48.5 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి ఛేదించారు. ఫలితంగా భారత్ చేతిలో వైట్‌వాష్ నుంచి తప్పించుకున్నారు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ 49 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినప్పటికీ హీథర్ నైట్(47), డానియల్లీ వ్యాట్(56)లు రాణించి జట్టు విజయంలో ప్రధాన భూమిక పోషించారు. వీరిద్దరూ 69 పరుగుల జత చేసి జట్టు పరిస్థితిని చక్కదిద్దారు. ఆపై వ్యాట్-ఎల్విస్‌ల జోడి 56 పరుగులు జోడించడంతో ఇంగ్లండ్ విజయాన్ని అందుకుంది. భారత బౌలర్లలో గోస్వామి మూడు వికెట్లు సాధించగా, పూనమ్ యాదవ్, శిఖా పాండేలు తలో రెండు వికెట్లు తీశారు.
అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఓపెనర్ రోడ్రిగ్స్ డకౌట్‌గా పెవిలియన్ చేరినప్పటికీ, స్మృతీ మంధాన(66) మరోసారి మెరిశారు. ఆమెకు జతగా పూనమ్ రౌత్(56) రాణించడంతో భారత్ రెండో వికెట్‌కు 129 పరుగులు చేసింది. ఆ తర్వాత దీప్తి శర్మ(27 నాటౌట్), శిఖా పాండే(26)లు మాత్రమే రెండంకెల స్కోరును చేయడంతో భారత్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఇంగ్లండ్ బౌలర్లలో కేథరిన్ బ్రంట్ ఐదు వికెట్లతో రాణించగా, స్కీవర్, ఎల్విస్, ష్రబ్‌సోల్‌లు తలో వికెట్ తీశారు. ఇప్పటికే భారత్ మహిళలు సిరీస్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. వరుస రెండు వన్డేల్లో భారత్ మహిళలు విజయం సాధించి సిరీస్‌ను ముందుగానే చేజిక్కించుకున్నారు.
ఇక్కడ చదవండి: భారత మహిళలదే వన్డే సిరీస్
Comments
Please login to add a commentAdd a comment