బీసీసీఐ వెంట పడతారెందుకు?
కరాచీ: డిసెంబర్ లో పాకిస్థాన్ -టీమిండియాల మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ కు సంబంధించి చర్చలను ఇక్కడితో ముగిస్తే మంచిదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ చీఫ్ లు అభిప్రాయపడుతున్నారు. భారత్ తో పరిస్థితులో అనుకూలంగా లేనప్పుడు వారి వెంట పడటం అనవసరమంటూ ఇజాజ్ భట్, తాఖీర్ జియా, ఖాలీద్ మహద్మ్ లు పాక్ బోర్డుకు స్పష్టం చేశారు.
'ఇక బీసీసీఐ వెంట పడటం మానండి. ఇరు దేశాల చర్చల్లో భాగంగా ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన దాడితోనైనా చర్చలు ఆపడం మంచిది. భారత్ తోనే ఎందుకు క్రికెట్ మ్యాచ్ లు ఆడాలనుకుంటున్నారో నాకు తెలియడం లేదు. వాళ్లు సముఖంగా లేనప్పుడు మనం వారి వెంట పడటం సరైన పని అనిపించుకోదు. ఈ విషయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ షహర్యార్ విజ్ఞప్తి మేరకు ఇప్పటికే తనకు భారత్ లో ఉన్న క్రికెట్ స్నేహితులతో చర్చలు జరిపా. అందుకు అక్కడ్నుంచి వ్యతిరేకంగా సమాధానం వచ్చింది. దీన్ని షహర్యార్ కూడా తెలిపాను. షహర్యార్ కు మళ్లీ తన మాటగా చెబుతున్నాను. ఇప్పటికైనా సిరీస్ కు చర్చలు మానుకోవడం మంచిది' అని ఇజాజ్ భట్ తెలిపారు.
ఇదిలా ఉండగా, బీసీసీఐ చర్చలను వదిలిపెట్టి.. పాకిస్థాన్ లో త్వరలో జరుగనున్న ట్వంటీ 20 సూపర్ లీగ్ పై దృష్టిపెడితే మంచిదని తాఖీర్ జియా పేర్కొన్నారు. ఈ రోజు జరిగింది చాలా బాధాకరం అంటూ మరో మాజీ చీఫ్ ఖాలీద్ మహ్మద్ అన్నారు. ఈ ఘటనను బట్టి పాకిస్థాన్ తో సిరీస్ కు భారత్ సిద్ధంగా లేదని అర్ధమవుతుందని ఆయన అసహనం వ్యక్తం చేశారు.