భారత సీనియర్ పురుషుల క్రికెట్ జట్టులో క్రమశిక్షణ, ఐక్యత పెంపొందించేందుకు బీసీసీఐ 10 పాయింట్ల మార్గదర్శకాలను రూపొందించింది. భారత ఆటగాళ్లు కింద పేర్కొన్న గైడ్‌లైన్స్‌ను పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవలికాలంలో భారత జట్టు వరుస వైఫల్యాలకు క్రమశిక్షణ లేమి కారణమని భావిస్తున్న బీసీసీఐ ఈ కఠిన మార్గదర్శకాలను అమల్లోకి తేవాలని నిర్ణయించింది.
బీసీసీఐ ప్రవేశపెట్టిన 10 పాయింట్ల క్రమశిక్షణా మార్గదర్శకాలు..
దేశవాలీ క్రికెట్ ఆడటం తప్పనిసరి
జాతీయ జట్టు ఎంపికకు పరిగణలోకి తీసుకోవాలంటే ఇకపై ఆటగాళ్లు దేశవాలీ క్రికెట్‌లో తప్పనిసరిగా ఆడాలి. ఆటగాళ్లు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ పొందాలంటే కూడా దేశవాలీ క్రికెట్‌లో తప్పనిసరిగా ఆడాలి.
కుటుంబాలతో వేరుగా ప్రయాణం చేయడం నిషేధం
మ్యాచ్‌లు జరిగే సమయంలో లేదా ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొనే సమయంలో ఆటగాళ్లు కుటుంబాలతో కలిసి వేరుగా ప్రయాణాలు చేయడం నిషేధం. మ్యాచ్‌లు జరిగే సమయంలో ఆటగాళ్లు వేరుగా కుటుంబాలతో కలిసి ప్రయాణించడం జట్టు ఐక్యతను దెబ్బతీస్తుందని బీసీసీఐ భావిస్తుంది.
అధిక లగేజీ భారాన్ని ఆటగాళ్లే మోయాల్సి ఉంటుంది
ఆటగాళ్లు పరిమితికి మించి లగేజీని క్యారీ చేస్తే సొంత ఖర్చులు పెట్టుకోవాల్సి ఉంటుంది.
వ్యక్తిగత సిబ్బందితో ప్రయాణాలు ఆపండి
విదేశీ పర్యటనల సమయంలో ఆటగాళ్ళు వంటవారు, హెయిర్ డ్రెస్సర్లు, స్టైలిస్టులు, సెక్యూరిటీ గార్డులతో ప్రయాణించడాన్ని నిషేధించాలని బీసీసీఐ నిర్ణయించింది.
అధికారిక కార్యక్రమాలకు అందుబాటులో ఉండాలి
బీసీసీఐ అధికారిక కార్యక్రమాలకు (షూటింగ్‌లు, ప్రమోషన్స్, ఫంక్షన్లు) ఆటగాళ్లు అందుబాటులో ఉండాలి.
టూర్ ముగిసే వరకు జట్టుతో పాటే ఉండాలి
ఆటగాళ్లు టూర్ లేదా సిరీస్ అధికారికంగా ముగిసే వరకు జట్టుతో పాటే ఉండాలి. మ్యాచ్ తొందరగా ముగిసినా జట్టును వీడ కూడదు.
ప్రాక్టీస్ తర్వాత ప్రయాణం
షెడ్యూల్ ప్రాక్టీస్ పూర్తయ్యే వరకు ప్లేయర్లందరూ కలిసి ఉండాలి. ప్లేయర్లు ప్రాక్టీస్ అనంతరం కలిసి ప్రయాణించాలి.
ఎండార్స్‌మెంట్‌లపై నిబంధనలు
పర్యటన సమయంలో ఎలాంటి వ్యక్తిగత షూట్‌లు లేదా ఎండార్స్‌మెంట్‌లకు అనుమతి లేదు. ఆటపై ఏకాగ్రత దెబ్బతినకుండా ఇది నిర్దేశించబడింది.
కుటుంబ సభ్యుల అనుమతి
45 రోజుల కంటే ఎక్కువ గల విదేశీ పర్యటనల్లో మాత్రమే ప్లేయర్ల కుటుంబ సభ్యులకు రెండు వారాల అనుమతి ఉంటుంది.
ఈ కొత్త పాలసీ ప్రకారం జట్టు సభ్యులందరూ క్రమశిక్షణతో ఉంటూ, జట్టు కోసం కట్టుబడి పనిచేయాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment