సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగిన ఆటగాళ్లు జాతీయ జట్టులోకి తిరిగి రావాలంటే దేశవాలీ టోర్నీల్లో తప్పక ఆడాలని బీసీసీఐ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ దిగొచ్చినట్లు కనిపిస్తుంది. వ్యక్తిగత సమస్యల కారణంగా దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలోనే స్వదేశానికి వచ్చేసిన ఇషాన్ ఆతర్వాత ఏ దేశవాలీ టోర్నీలోనూ ఆడకుండా మిన్నకుండిపోయాడు.
టెస్ట్‌ల్లో టీమిండియాను రెగ్యులర్ వికెట్‌కీపర్ సమస్య వేధిస్తున్న నేపథ్యంలో చాలామంది ఇషాన్‌ను జట్టులోకి తీసుకోవాలని సూచించారు. అయితే రెండు నెలలకు పైగా ఎలాంటి క్రికెట్ ఆడని వ్యక్తిని నేరుగా తుది జట్టులో ఎలా తీసుకుంటామని బీసీసీఐ వాదిస్తుంది. ఈ విషయాన్ని టీమిండియా కోచ్ సైతం ఇషాన్‌ను ఉద్దేశిస్తూ చెప్పకనే చెప్పాడు.
అయితే ద్రవిడ్ మాటలను సైతం పెడచెవిన పెట్టిన ఇషాన్.. దేశవాలీ టోర్నీలను కాదని ఐపీఎల్ సన్నాహకాల్లో నిమగ్నమైపోయాడు. ఇషాన్ ప్రవర్తన చూసి చిర్రెతిపోయిన బీసీసీఐ పెద్దలు తాజాగా ఓ అల్టిమేటం జారీ చేశారు. బీసీసీఐతో సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగిన ఆటగాళ్లు జాతీయ జట్టులోకి తిరిగి రావాలంటే దేశవాలీ టోర్నీల్లో పాల్గొనాలని రూల్ పాస్ చేశారు.
జాతీయ జట్టు సభ్యులకు, ఎన్‌సీఏలో ఉన్న ఆటగాళ్లకు ఇందుకు మినహాయింపు ఉంటుందని బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన పరోక్షంగా తనను ఉద్దేశించే అని గ్రహించిన ఇషాన్ ఎట్టకేలకు దిగొచ్చాడు. ఐపీఎల్ ప్రాక్టీస్‌ను పక్కన పెట్టి త్వరలో ప్రారంభంకానున్న డీవై పాటిల్ టోర్నీలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు.
ఈ విషయాన్ని ఇషాన్ స్వయంగా చెప్పనప్పటికీ, అతని సన్నిహితులు లోకల్‌మీడియాతో చెప్పినట్లు సమాచారం. ఐపీఎల్‌కు ముందు దేశవాలీ టోర్నీల్లో పాల్గొనకుంటే సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దవుతుందని సోషల్‌మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టడంతో ఇషాన్ కాస్త తగ్గినట్లు కనిపిస్తుంది.
కాగా, వ్యక్తిగత కారణాలను సాకుగా చూపిన ఇషాన్.. కోచ్ ద్రవిడ్ చెప్పినా పట్టించుకోకుండా ఐపీఎల్ సన్నాహకాల్లో పాల్గొనడంపై బీసీసీఐ చాలా సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తుంది. ఇషాన్ విషయంలో త్వరలోనే బ్యాడ్‌న్యూస్ వస్తుందన్న ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఇషాన్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో 'గ్రేడ్-సీ'లో ఉన్నాడు. ఏడాదికి అతనికి కోటి రూపాయల వేతనం లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment