
ఆసుపత్రి బయట షుమాకర్ అభిమానులు
గ్రెనోబ్లీ (ఫ్రాన్స్): స్కీయింగ్ చేస్తూ గాయపడి కోమాలోకి వెళ్లిన ఫార్ములావన్ దిగ్గజ డ్రైవర్ మైకేల్ షుమాకర్ త్వరగా కోలుకోవాలని అతని అభిమానులతో పాటు సహచరులు ఆకాంక్షించారు. శుక్రవారం షుమాకర్ 45వ పుట్టిన రోజు సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు డ్రైవర్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి చేరుకుని శుభాకాంక్షల బ్యానర్లను ప్రదర్శించారు. సహచర డ్రైవర్ ఫెలిప్ మసా కూడా షుమీకి శుభాకాంక్షలు తెలిపాడు.
మరోవైపు షుమాకర్ పుట్టిన ఊరు కెర్పెన్‌లోని అతని ఫ్యాన్ క్లబ్ మాత్రం బర్త్ డే వేడుకలకు దూరంగా ఉంది. ఇలాంటి సమయంలో వేడుకలు జరుపుకోవడం సరైంది కాదని చెప్పింది. షుమాకర్ కోలుకోవడంలో అతని వయసు, ఫిట్‌నెస్ బాగా ఉపయోగపడుతున్నాయని వైద్య విభాగం వెల్లడించింది. మరోవైపు యాక్సిడెంట్ జరిగిన సమయంలో షుమాకర్ విపరీతమైన వేగంతో ఉన్నాడని దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు.