వేగం.. వేగం.. వేగం..
చిన్నప్పుడు వేగాన్ని ఇష్టపడ్డాడు..అదే అతడిని ఆట వైపు మళ్లించింది..
ట్రాక్‌పై వేగాన్నే నమ్ముకున్నాడు.. అదే అతడిని శిఖరాన నిలిపింది..
ట్రాక్ బయటా వేగం తగ్గించలేదు.. దురదృష్టవశాత్తు అదే అతడిని చావుకు దగ్గరగా తీసుకెళ్లింది..
రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లే కార్ రేసింగ్‌లో అతను రారాజుగా వెలుగొందాడు..
ఫార్ములా వన్ అభిమానుల వినోదానికి కొత్త ఫార్ములాను రుచి చూపించాడు..
సుదీర్ఘ కాలం ఆటను శాసించి, పరుగులు పెట్టించి, ఏకంగా ఏడు సార్లు చాంపియన్ గా నిలిచిన ఆ డ్రైవరే మైకేల్ షుమాకర్.
1994 ఫార్ములా వన్ చాంపియన్ షిప్.. గత ఏడాది విజేత అలెన్ ప్రాస్ట్ అప్పటికే రేసింగ్‌కు గుడ్‌బై చెప్పడంతో ఈ సారి బరిలోకి దిగడం లేదు. మొత్తం 46 మంది డ్రైవర్లు బరిలో ఉండగా, వీరిలో 14 మంది తొలిసారి ఎఫ్1 సర్క్యూట్‌లోకి అడుగు పెడుతున్నారు. పాతికేళ్ల షుమాకర్‌కు ఇది మూడో ప్రయత్నం. అంతకు ముందు రెండు ప్రయత్నాల్లో 3వ, 4వ స్థానాల్లో నిలిచి తన సత్తా నిరూపించుకున్నాడు.
అయినా సరే, ఎవరూ చాంపియన్ ను ఊహించలేని విధంగా రేస్‌లు సాగాయి. మొత్తం 16 రేస్‌లలో 15 ముగిసినా తుది విజేత ఎవరో తేలలేదు. హోరాహోరీగా సాగిన ఆఖరి గ్రాండ్‌ప్రి ఆస్ట్రేలియాలో కొత్త చాంపియన్ బయటకు వచ్చాడు. ఓవరాల్‌గా 92 పాయింట్లు సాధించిన షుమాకర్ ఒకే ఒక పాయింట్ తేడాతో డామన్ హిల్ (91)ను వెనక్కి నెట్టాడు. అదీ ఎఫ్1 చరిత్రలో ఒక అద్భుతానికి ఆరంభంగా నిలిచింది.
ఆ తర్వాత మరో ఆరు సార్లు అతను జగజ్జేతగా నిలిచి ట్రాక్‌ను శాసించాడు. అయితే ఇద్దరు డ్రైవర్ల మరణం, గాయాలు, సాంకేతిక సమస్యలు తదితర అంశాలతో అత్యంత వివాదాస్పదంగా ఈ సీజన్ సాగడంతో ఆట నిబంధనల్లో పలు మార్పులు చేయాల్సి వచ్చింది. దాంతో కొత్త చాంపియ¯Œ గా షుమాకర్‌కు రావాల్సినంత గుర్తింపు రాలేదు. అయితే తర్వాతి ఏడాది ఇదే జట్టు (బెనెటాన్ ) తరఫున మళ్లీ చాంపియన్ గా నిలిచి షుమీ తానేంటో చూపించాడు.
అక్కడే మొదలు..
కార్టింగ్.. ఎఫ్1 స్థాయికి చేరినా, దిగ్గజ డ్రైవర్లంతా మొదలు పెట్టింది స్థానికంగా కార్టింగ్ ద్వారానే. అలాంటిది తండ్రే కార్టింగ్ ట్రాక్ నడిపిస్తుంటే ఆకర్షితుడు కాకుండా ఉంటాడా! నాలుగేళ్ల షుమాకర్‌కూ అలాగే ఆసక్తి కలిగింది. చిన్న పెడల్ కార్టింగ్‌తో ఆడుకుంటున్న అతడిని చూసి తండ్రి దానికి చిన్నపాటి మోటార్ సైకిల్ ఇంజిన్ బిగించడంతో ఆట మలుపు తిరిగింది. ఒక అద్భుతానికి అదే ఆరంభంగా మారింది. ఆరేళ్లకే తొలి సారి కార్టింగ్ చాంపియన్ షిప్‌లో విజేతగా నిలవడంతో అతని బంగారు భవిష్యత్తు తండ్రికి కళ్ల ముందు కనిపించింది.
దాంతో స్థానిక వ్యాపారుల నుంచి స్వల్ప స్పాన్సర్‌షిప్ సహా అతడిని ప్రోత్సహించేందుకు అన్ని వనరులూ ఉపయోగించాడు. ఆ ప్రోత్సాహం షుమాకర్‌ను ముందుకు నడిపించింది. తాను పుట్టిన జర్మనీలో కార్టింగ్ లైసెన్స్ ఇవ్వాలంటే కనీసం 14 ఏళ్ల వయసు ఉండాలి. కానీ 12 ఏళ్లకే దూసుకుపోతున్న అతను అదే వయసుకు లైసెన్స్ ఇచ్చే పొరుగు దేశం లగ్జెంబర్గ్‌కు వెళ్లి లైసెన్స్ తెచ్చుకున్నాడు. దాంతోనే పోటీ పడి జర్మన్ జూనియర్ కార్టింగ్ చాంపియన్ షిప్‌లో విజేతగా నిలిచాడు. ఆపై సింగిల్ సీట్ రేసింగ్, ఫార్ములా 3 చాంపియన్ షిప్ మీదుగా సాగిన ప్రస్థానం 1991లో తొలిసారి ఎఫ్1 అరంగేట్రం వరకు చేరింది.
అదే ప్రత్యేకత...
‘ఫార్ములా వన్ చరిత్రలో అత్యంత పరిపూర్ణమైన డ్రైవర్’.. ఒక్క మాటలో షుమాకర్ గురించి సహచరులు చెప్పే మాట ఇది. సహజసిద్ధమైన ప్రతిభతో పాటు అమిత ఆత్మవిశ్వాసం, తెలివితేటలు, అంకితభావం మాత్రమే కాకుండా రేసింగ్‌పై ఉన్న పిచ్చి ప్రేమ, ప్రతీ రోజు ఏదో ఒక విషయంలో మెరుగవ్వాలనే బలమైన కోరిక వెరసి షుమీని చాంపియన్ ను చేశాయి. ‘రేసు కొనసాగే సమయంలో అర సెకండ్∙వ్యవధిలో నిర్ణయాలు తీసుకోగలిగే మానసిక దృఢత్వం, అమిత వేగంలోనూ ప్రణాళికలు మార్చుకోగలిగే తత్వం అతడిని అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్లాయి’ అంటూ ఎఫ్1 సర్క్యూట్‌లో ఈ స్టార్ గురించి అందరూ చెబుతారు.
అన్నింటినీ మించి రేసు ముగియగానే తన పని ముగిసినట్లుగా భావించకుండా తాను ఉపయోగించే కారు ఫ్యాక్టరీకి వెళ్లి లోపాల గురించి మాట్లాడటం, ఇంజినీర్లకు సూచనలు ఇవ్వడం, వారిని ప్రోత్సహించడం.. ఇలా అన్ని చోట్లా తన భాగస్వామ్యం కనిపిస్తుంది. కెరీర్‌లో ఐదు సార్లు ‘చాంపియన్’గా నిలిచిన ఫెరారీ టీమ్‌తో అతనికి కుటుంబ సభ్యుడి తరహాలో అనుబంధం ఉంది.
విజయాల గాథ..
ఎఫ్1 అంటే షుమాకర్.. షుమాకర్ అంటే ఎఫ్1.. కార్ రేసింగ్ గురించి కాస్తయినా అవగాహన ఉన్న ఒక తరం మొత్తానికి అతనే ఏకైక హీరో. 1979 తర్వాత తమ టీమ్ నుంచి ఒక్క చాంపియన్ కూడా లేని ‘ఫెరారీ’ టీమ్ షుమాకర్‌తో చేసుకున్న ఒప్పందం అద్భుతాలు చేసింది. తొలి రెండు చాంపియన్ షిప్ విజయాల తర్వాత నాలుగు సీజన్లు తడబడిన షుమీ ‘ఫెరారీ’తో వేసిన అడుగు చరిత్ర సృష్టించింది. ఎదురు లేని ప్రదర్శనతో ట్రాక్‌పై చెలరేగిన అతను వరుసగా ఐదు సీజన్ల పాటు చాంపియన్ గా నిలవడం అతని కెరీర్‌లో అత్యుత్తమ సమయం.
ఏకంగా ఏడు టైటిల్స్‌తో శాసించిన అతని కెరీర్‌లో అంకెలు చెప్పే విశేషాలెన్నో ఉన్నాయి. 2002లో ఆరు రేస్‌లు మిగిలి ఉండగానే చాంపియన్ గా ఖరారు కావడం, ఒకే గ్రాండ్‌ప్రి వేదికపై ఎక్కువ విజయాలు, వరుసగా 15 సీజన్లు కనీసం ఒక్క రేస్ అయినా గెలవడం, ఎక్కువ సంఖ్యలో ఫాస్టెస్ట్ ల్యాప్‌లు.. ఇలా ట్రాక్‌పై అతని ఘనతల జాబితా చాలా పెద్దది. అతను ఆట మొదలుపెట్టే సమయానికి జర్మనీలో కారు రేసింగ్ సరదాకు మాత్రమే. కానీ షుమాకర్ ఘనతల తర్వాత జర్మనీపై ఎఫ్1 ముద్ర ఎంత బలంగా పడిందంటే అతను రిటైరయ్యే సమయానికి ప్రపంచ టాప్–10 డ్రైవర్లలో ముగ్గురు జర్మనీవాళ్లే.
ఆటతో అనుబంధమే..
చాలా మంది దిగ్గజ క్రీడాకారుల్లాగే ‘ఇక సమయం వచ్చింది’ అంటూ 2006 చాంపియన్ షిప్‌లో రెండో స్థానంలో నిలిచిన తర్వాత షుమీ తన ఆట ముగించాడు. అయితే కారు స్టీరింగ్ వెనక ఇన్నేళ్లుగా సాగిన ప్రస్థానం అతడిని కుదురుగా కూర్చోనీయలేదు. అందుకే నేనున్నానంటూ మళ్లీ ట్రాక్‌పైకి వచ్చేశాడు. రిటైర్మెంట్ ప్రకటించి మూడేళ్లు గడిచిన తర్వాత 2010లో కొత్త జట్టు మెర్సిడెజ్ తరఫున అతను బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు.
41 ఏళ్ల వయసులో ఇది మళ్లీ అవసరమా, తాను సంపాదించిన కీర్తి ప్రతిష్ఠలను పోగొట్టుకోవడం తప్ప మరేమీ దక్కదు అంటూ అతని గురించి విమర్శలు వినిపించాయి. అయితే ట్రాక్ అంటే తనకు ఉన్న అభిమానం వల్లే మళ్లీ వచ్చానని, ఫలితాల గురించి బెంగ లేదని అతను చెప్పుకున్నాడు. ఊహించినట్లుగానే ఫలితాలు గొప్పగా రాలేదు. 9వ, 8వ, 13వ స్థానాల్లో నిలిచిన తర్వాత పూర్తిగా తప్పుకున్నాడు. అయితే ‘నాకంటే కనీసం పదేళ్లు చిన్నవారైన ఐదుగురు ప్రపంచ చాంపియన్ లతో పోటీ పడ్డాను. ఓటమినుంచి ఏం నేర్చుకోవచ్చో కూడా తెలిసింది’ అంటూ వ్యాఖ్యానించాడు.
వెంటాడుతున్న విషాదం...
షుమాకర్ మొదటి నుంచి కుటుంబానికి ఎంతో ప్రాధాన్యమిచ్చేవాడు. అతనికి భార్యాపిల్లలతోనే లోకం. ప్రపంచంలో అత్యంత పాపులర్ ఆటగాడిగా ఉంటూ ఏడాదికి 100 మిలియన్ డాలర్ల చొప్పున సంపాదించిన సమయంలోనూ అతని కుటుంబం బయట ఎప్పుడూ కనిపించలేదు. అలాంటి సమయంలోనే ఒక దురదృష్టకరమైన రోజు 29 డిసెంబర్, 2013 వచ్చింది. ఆల్ఫ్స్ పర్వతాల్లో కుటుంబంతో సహా విహారానికి వెళ్లి స్కీయింగ్ చేస్తుండగా అనూహ్యంగా పట్టు జారి పడ్డాడు. వేగంగా దూసుకొచ్చి అతను నియంత్రణ కోల్పోవడంతో తల ఒక రాయిని ఢీకొట్టింది.
అంతే.. పేరుకే చావు నుంచి తప్పించుకున్నాడు. కానీ ఆ క్షణం నుంచి షుమీ ఈ లోకంలో లేనట్లు ఉండిపోయాడు. కోమాలోకి చేరుకున్న అతను మళ్లీ పూర్తి స్థాయిలో కోలుకోలేకపోయాడు. తొమ్మిదేళ్లుగా వేర్వేరు చికిత్సలు చేయిస్తూ ‘పరిస్థితి మెరుగైంది’ అంటూ సన్నిహితులు చెబుతూవస్తున్నా దానిపై ఏరోజూ స్పష్టత లేదు. ఆ ఘటన తర్వాత షుమాకర్ మళ్లీ బయట ఎవరికీ కనిపించలేదు. తండ్రి బాటనే ఎంచుకున్న కొడుకు మిక్ షుమాకర్ గత రెండు సీజన్లలో ఎఫ్1 రేసింగ్‌లలో పాల్గొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment