ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు .. ఏడాదిలో ఇలా రేస్‌ల సంఖ్య మారుతూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వేదికలు కూడా మారిపోతున్నాయి. కానీ ఫలితం మాత్రం మారడం లేదు. ఒకే ఒక్కడు ఫార్ములా వన్ సర్క్యూట్‌ను శాసిస్తున్నాడు.
బరిలో నిలిచిన మిగతావారంతా ఇక రెండో స్థానం కోసమే పోటీ పడాలి అన్నట్లుగా ఆధిపత్యం సాగింది. సంవత్సరం క్రితం తన అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొట్టిన అతను ఈ ఏడాది అంతకు మించిన వేగంతో దూసుకుపోయి తన రికార్డులను తానే బద్దలు కొట్టాడు.
26 ఏళ్ల వయసులోనే వరుసగా మూడు సీజన్లు ఎఫ్1 చాంపియన్‌గా నిలిచి మరిన్ని సంచలనాలకు సిద్ధమైన ఆ డ్రైవర్ పేరే మ్యాక్స్ వెర్‌స్టాపెన్.. 2022 సీజన్‌లో 15 రేస్‌లను గెలిచి కొత్త రికార్డు నమోదు చేసిన అతను.. ఈసారి తొలి 19 రేస్‌లు ముగిసే సరికే 16 సార్లు విజేతగా నిలవడంతో తన ఘనతను తానే అధిగమించి సత్తా చాటాడు.
‘పిన్న వయసు’ ఘనతలన్నీ
17 ఏళ్ల 166 రోజులు.. తొలిసారి ఫార్ములా వన్ ట్రాక్‌పై రయ్యిమంటూ దూసుకుపోయినప్పుడు వెర్‌స్టాపెన్ వయసు! దీంతో ఎఫ్1 బరిలో దిగిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. అయితే ఇది అంతటితో ఆగిపోలేదు. ‘పిన్న వయసు’ ఘనతలన్నీ వరుసగా అతని ఖాతాలోనే చేరుతూ వచ్చాయి.
పాయింట్లు సాధించడంలో, రేస్ గెలవడంలో, పోడియం ఫినిష్‌లో భాగం కావడంలో, ఫాస్టెస్ట్ ల్యాప్.. ఇలా అన్నింటిలో అతను అందరికంటే చిన్నవాడే. ఈ రికార్డుల వరుస చూస్తుంటేనే అతను ఎంత వేగంగా ఎదిగాడనేది స్పష్టమవుతోంది. 2021లో ఎఫ్1 చాంపియన్‌గా నిలిచిన తొలి నెదర్లాండ్స్ డ్రైవర్‌గా గుర్తింపు పొందిన వెర్‌స్టాపెన్ ఆ తర్వాత వరుసగా రెండు సీజన్ల పాటు తన టైటిల్‌ను నిలబెట్టుకోవడం విశేషం!
తండ్రి మార్గనిర్దేశనంలో..
107.. వెర్‌స్టాపెన్ తండ్రి జోస్ వెర్‌స్టాపెన్ ఫార్ములా వన్‌లో పోటీ పడిన రేస్‌ల సంఖ్య. కానీ వీటిలో ఒక్కటంటే ఒక్క రేస్‌లో కూడా అతను విజేతగా నిలవలేకపోయాడు. ఆ తర్వాత పోటీల నుంచి తప్పుకొని ఎఫ్1 టీమ్‌ల సహాయక సిబ్బందిలో అతను చేరాడు. జోస్ మనసులో కూడా కొడుకు గురించి ఒక ప్రణాళిక ఉంది.
కానీ దానికి తొందరపడదల్చుకోలేదు. అయితే నాలుగున్నరేళ్ల వయసున్న మ్యాక్స్ తండ్రిని గోకార్టింగ్ కారు కొనివ్వమని కోరగా.. ఆరేళ్లు వచ్చాకే అవన్నీ అంటూ దాటవేసే ప్రయత్నం చేశాడు. కానీ మ్యాక్స్ వదల్లేదు. తండ్రిని పదేపదే అడగటంతో పాటు నాకంటే చిన్నవాళ్లు కూడా కార్టింగ్ చేస్తున్నారంటూ తల్లితో కూడా చెప్పించాడు. దాంతో జోస్ దిగిరాక తప్పలేదు.
చివరకు ఇద్దరూ రాజీ పడి
అయితే ఒక చిన్న కార్టింగ్ కారులో మొదలైన తన కొడుకు ప్రస్థానం అంత వేగంగా, అంత అద్భుతంగా సాగుతుందని ఆయనా ఊహించి ఉండడు. అయితే మ్యాక్స్ ఎదుగుదలలో ఒక్క ఆసక్తి మాత్రమే కాదు.. అతని కఠోర శ్రమ, సాధన, పట్టుదల, పోరాటం అన్నీ ఉన్నాయి. 15 ఏళ్ల వయసులో స్థానికంగా జరిగిన ఒక గోకార్టింగ్ చాంపియన్‌షిప్ దాదాపు చివరి వరకు ఆధిక్యంలో ఉండి కూడా మ్యాక్స్ ఓటమిపాలయ్యాడు.
ఇది తండ్రికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. కొంత కాలం పాటు వీరిద్దరి మధ్య మాటలే లేవు. చివరకు ఇద్దరూ రాజీ పడి మరింత సాధన చేసి ఫలితాలు సాధించాలని గట్టిగా నిశ్చయించుకున్నారు.
తను నాన్నతో... చెల్లి అమ్మతో
మరోవైపు అదే సమయంలో తన తల్లిదండ్రులు అనూహ్యంగా విడిపోవడం కూడా వెర్‌స్టాపెన్‌పై మానసికంగా ప్రభావం చూపించింది. తన చెల్లి.. తల్లితో వెళ్లిపోగా.. తాను తండ్రితో ఉండిపోయాడు. తండ్రికి ఎఫ్1 దిగ్గజం మైకేల్ షుమాకర్‌తో ఉన్న స్నేహం.. అతనికి ఆటపై మరింత ఆసక్తిని పెంచడమేకాకుండా సరైన దిశానిర్దేశమూ చేసింది.
ముందుగా ఎఫ్1తోనే..
వెర్‌స్టాపెన్ 2015లో తొలిసారి ఫార్ములా వన్ రేస్‌లోకి అడుగు పెట్టాడు. ఈ సీజన్‌లో 19 రేస్‌లలో పాల్గొన్న అతను 12వ స్థానంతో ముగించాడు. ఆసక్తికర అంశం ఏమిటంటే అతనికి అప్పటికి 18 ఏళ్లు కూడా పూర్తి కాలేదు. ఎఫ్1 లైసెన్స్ అందుకొని ట్రాక్‌పై రయ్యంటూ పరుగులు పెట్టిన కొద్ది రోజులకు గానీ వెర్‌స్టాపెన్‌కు అధికారికంగా రోడ్ డ్రైవింగ్ లైసెన్స్ రాలేదు.
ఏదైనా సాధించగలననే నమ్మకం
తొలి సీజన్ గొప్పగా లేకపోయినా అతనిలో మంచి ప్రతిభ ఉన్నట్లుగా సర్క్యూట్‌లో గుర్తింపు లభించింది. తర్వాతి ఏడాది వెర్‌స్టాపెన్ ఎఫ్1లో బోణీ చేశాడు. మొదటిసారి రెడ్‌బుల్ జట్టు తరఫున బరిలోకి దిగి.. 17 రేస్‌లలో పాల్గొని ఒక రేస్‌లో విజేతగా నిలిచాడు. ఇది అతని అద్భుత భవిష్యత్తుకు పునాది వేసిన మొదటి విజయం.
మొత్తంగా సీజన్‌ను ఐదో స్థానంతో ముగించడంలో వెర్‌స్టాపెన్ సఫలమయ్యాడు. 2017లో కీలక దశలో కాస్త తడబడి ఆరో స్థానంతో సరిపెట్టుకున్నా.. తర్వాతి సీజన్‌లో నాలుగో స్థానంలో నిలవడం అతని ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ముఖ్యంగా 11 పోడియంలు వెర్‌స్టాపెన్‌కు తాను ఏదైనా సాధించగలననే నమ్మకాన్ని కలిగించాయి.
ఆ తర్వాత పైపైకి దూసుకుపోవడమే తప్ప మళ్లీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఇక అగ్రస్థానానికి చేరే సమయం ఆసన్నమైందని మ్యాక్స్‌తో పాటు అతని తండ్రి జోస్‌కు కూడా అర్థమైంది. ఆపై వచ్చే ఏ అవకాశాన్నీ వదలకూడదని భావించిన తండ్రీ కొడుకులు తర్వాతి సీజన్‌పై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టారు. అన్ని రకాలుగా సన్నద్ధమయ్యారు.
తొలిసారి విజేతగా..
2021 ఎఫ్1 సీజన్ వచ్చేసింది. అప్పటి వరకు ఎఫ్1 చరిత్రలో 71 సార్లు డ్రైవర్స్ చాంపియన్‌షిప్ అందజేయగా.. 33 మంది విజేతలుగా నిలిచారు. గత ఏడు సీజన్‌లలో ఆరు సార్లు చాంపియన్‌గా నిలిచి మెర్సిడీజ్ డ్రైవర్ లూయీస్ హామిల్టన్ మంచి ఊపు మీదున్నాడు.
అంతకు ముందు కూడా ఒకసారి టైటిల్ సాధించిన అతను అత్యధిక టైటిల్స్‌తో షుమాకర్ (7 టైటిల్స్) రికార్డును కూడా సమం చేసేశాడు. బహ్రెయిన్‌లో జరిగిన తొలి రేసును కూడా హామిల్టన్ గెలుచుకొని తన ఫామ్‌ను చూపించాడు.
సమ ఉజ్జీలు
తర్వాతి రేసు ఇటలీలోని ఇమోలాలో. ఈసారి కూడా పోల్ పొజిషన్ సాధించి హామిల్టన్ పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. అయితే ఇక్కడే వెర్‌స్టాపెన్‌లోని అసలు సత్తా బయటకు వచ్చింది.
మొదటి కార్నర్‌లోనే హామిల్టన్‌ను ఓవర్‌టేక్ చేసిన అతను ఆ తర్వాత అంతే వేగంగా దూసుకుపోయాడు. చివరి వరకు తన ఆధిక్యాన్ని నిలబెట్టుకొని సీజన్‌లో తొలిరేస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఈ సీజన్ మొత్తం వీరిద్దరి మధ్య హోరాహోరీగా సాగింది.
ఒకరు ఒక రేస్‌లో విజేతగా నిలిస్తే ఆ వెంటనే మరొకరు తర్వాతి రేస్‌ను సొంతం చేసుకొని సమ ఉజ్జీగా నిలిచారు. ఆపై ఆబూ ధాబీలో జరిగిన చివరి రేస్‌లోనే (మొత్తం 22 రేస్‌లు) సీజన్ ఫలితం తేలడం విశేషం. సరిగ్గా ఈ రేస్‌కు ముందు సమానంగా 369.5 పాయింట్లతో వెర్‌స్టాపెన్, హామిల్టన్ ఆఖరి సమరానికి సిద్ధమయ్యారు.
వెర్‌స్టాపెన్ విజయనాదం
తొలి ల్యాప్‌లోనే ముందంజ వేసి హామిల్టన్ శుభారంభం చేసినా.. ఆ తర్వాత వెర్‌స్టాపెన్ ఎక్కడా తగ్గలేదు. అత్యంత ఆసక్తికరంగా సాగిన పోరులో చివరిదైన 58వ ల్యాప్‌లో హామిల్టన్‌ను వెనక్కి తోసి వెర్‌స్టాపెన్ విజయనాదం చేశాడు. 8 పాయింట్ల తేడాతో అగ్రస్థానం సాధించి తొలిసారి చాంపియన్‌గా నిలిచాడు.
దాంతో ఎఫ్1లో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. తర్వాతి ఏడాది ఏకంగా 146 పాయింట్ల ఆధిక్యంతో తన సమీప ప్రత్యర్థి చార్ల్స్ లెక్లర్క్‌ను చిత్తుగా ఓడించి టైటిల్ నిలబెట్టుకోవడం వెర్‌స్టాపెన్ ఆధిక్యాన్ని చూపించింది.
ఇక ఇదే జోరును కొనసాగించి 2023 సీజన్‌లో చాలా ముందుగానే విజేత స్థానాన్ని ఖాయం చేసుకొని వెర్‌స్టాపెన్ హ్యాట్రిక్ నమోదు చేశాడు. 26 ఏళ్ల వయసులోనే అసాధారణ వేగంతో దూసుకుపోతున్న వెర్‌స్టాపెన్ మున్ముందు సర్క్యూట్‌లో మరిన్ని సంచలన విజయాలతో కొత్త రికార్డులు నెలకొల్పడం ఖాయం.
- మొహమ్మద్ అబ్దుల్ హాది
Comments
Please login to add a commentAdd a comment