హారికకే పట్టం
‘ఫిడే’ గ్రాండ్ ప్రి విజేతగా తెలుగమ్మాయి
కోనేరు హంపికి రెండో స్థానం
చెంగ్డూ (చైనా): ఒలింపిక్స్‌లో చెస్ క్రీడ లేదు గానీ ఉంటే మనకు మరో రెండు పతకాలు ఖాయంగా వచ్చేవేమో! అంతర్జాతీయ యవనికపై భారత మహిళా చెస్ క్రీడాకారిణుల ఇటీవలి ప్రదర్శన చూస్తే అలాంటి భావనే కలుగుతోంది. గురువారం ఇక్కడ ముగిసిన ప్రతిష్టాత్మక ‘ఫిడే’ మహిళల గ్రాండ్ ప్రి టోర్నీలో ఇద్దరు తెలుగు క్రీడాకారిణులు స్వర్ణ, రజతాలు సొంతం చేసుకోవడం విశేషం. ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ద్రోణవల్లి హారిక విజేతగా నిలిచింది. ఆమె కెరీర్‌లో ఇది తొలి గ్రాండ్ ప్రి టైటిల్ కావడం మరో విశేషం. టాప్-12 క్రీడాకారిణులు పాల్గొన్న ఈ టోర్నమెంట్‌లో ఒక్క పరాజయం కూడా లేకుండా నిలకడగా ఆడిన హారిక, ప్రతీ రౌండ్ తర్వాత మొదటి లేదా రెండో స్థానాల్లోనే ఉంటూ తన ఆధిక్యం కొనసాగించింది.
ఏపీకే చెందిన గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపికి రెండో స్థానం లభించింది. మొత్తం 11 రౌండ్ల అనంతరం ఈ ఇద్దరూ చెరో 7 పాయింట్లతో సమంగా నిలిచారు. అయితే టైబ్రేక్ ఆధారంగా హారికకు టైటిల్ దక్కింది. గిర్యా ఓల్గా (రష్యా)తో జరిగిన తన చివరి రౌండ్ మ్యాచ్‌ను హారిక 62 ఎత్తులో డ్రాగా ముగించింది. మరో వైపు హంపి తన ఆఖరి రౌండ్‌లో ఆంటోనెటా స్టెఫనోటా (బల్గేరియా)పై 65 ఎత్తుల్లో విజయం సాధించింది. టోర్నీలో హారిక 3 విజయాలు సాధించి 8 గేమ్‌లను డ్రా చేసుకోగా... హంపి 5 గేమ్‌లలో నెగ్గి 4 నాలుగు డ్రా చేసుకుంది. మరో 2 ఓడింది. అయితే టైబ్రేక్ నిబంధనల ప్రకారం ఈ ఇద్దరి మధ్య జరిగిన ముఖాముఖి పోరులో హారిక గెలవడంతో ఆమెను విజేతగా ప్రకటించారు.
‘ తొలి గ్రాండ్ ప్రి టైటిల్ గెలవడం చాలా ఆనందంగా ఉంది. టోర్నీ ఆరంభం నుంచి చాలా బాగా ఆడాను. ఏ దశలోనూ ఒత్తిడికి లోను కాలేదు. అజేయంగా ముగించడం నా సంతోషాన్ని రెట్టింపు చేసింది. హంపి, నేను తరచుగా ఆడుతుంటాం కాబట్టి మా మధ్య పోటీకి ప్రత్యేకత ఏమీ లేదు. బయటినుంచి చూసేవారికి ఆసక్తికరంగా కనిపిస్తుందంతే. అయితే ఓవరాల్‌గా భారత్‌కే తొలి రెండు స్థానాలు దక్కడం మాత్రం అందరం గర్వపడే అంశం. ఇదే ఉత్సాహంతో మున్ముందు మరిన్ని విజయాలు సాధిస్తా. ’ - ‘సాక్షి’తో ద్రోణవల్లి హారిక