లాసానే: ఫుట్‌బాల్‌లో సబ్‌స్టిట్యూట్‌ల కిక్ పెరగనుంది. ఇప్పటికైతే ఇది తాత్కాలికమే అయినప్పటికీ ఇకపై ఐదుగురు ఆటగాళ్లు సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగే అవకాశం త్వరలోనే రానుంది. కరోనా వైరస్ తర్వాత పునఃప్రారంభమయ్యే ఫుట్‌బాల్ టోర్నీల నిబంధనల్లో ఈ కీలక మార్పు చోటు చేసుకోనుంది. ఆటగాళ్లను గాయాల నుంచి రక్షించేందుకు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా) ప్రతిపాదించిన ‘ఐదుగురు సబ్‌స్టిట్యూట్’ నిబంధన అమలు చేయనున్నారు. దీనిపై ఫుట్‌బాల్ నియమావళి రూపకర్తలు ఈ వారంలో ఆమోదముద్ర వేసి అమల్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇది తాత్కాలిక నిబంధనే అయినప్పటికీ కరోనాతో సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగే ఫుట్‌బాలర్లకు బిజీ షెడ్యూల్‌లో గాయాలు కాకుండా ఇది ఎంతో ఉపయోగపడనుంది. దీనికి అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘం బోర్డు (ఐఎఫ్‌ఏబీ) శుక్రవారం ఆమోదం తెలుపనుంది. గతవారమే ఈ అంశంపై ఐఎఫ్‌ఏబీ సానుకూలంగా స్పందించింది. ‘ఫిఫా ప్రతిపాదించిన ఈ ఐదుగురు సబ్‌స్టిట్యూట్‌ల అంశంపై ఆలోచిస్తున్నాం. మ్యాచ్ సమయంలో మూడు సందర్భాల్లో జట్లు గరిష్టంగా ఐదుగురు సబ్‌స్టిట్యూట్‌లను ఆడించవచ్చు. ఒక వేళ ఎక్స్‌ట్రా సమయానికి దారితీస్తే ఆరో వ్యక్తిని కూడా వాడుకోవచ్చు’ అని తెలిపింది. ప్రస్తుతం మ్యాచ్‌లో ముగ్గురు సబ్‌స్టిట్యూట్‌లకు మాత్రమే అనుమతి ఉంది. 2018 నుంచి అదనపు సమయంలో నాలుగో వ్యక్తిని అనుమతిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment