
లండన్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆసీస్ కెప్టెన్ అరోన్ ఫించ్ శతకంతో మెరిశాడు. ఆదిలో తన సహజసిద్ధమైన బ్యాటింగ్‌ను వదిలి నెమ్మదిగా ఆడిన ఫించ్.. హాఫ్ సెంచరీ తర్వాత వేగాన్ని పెంచాడు. ఈ క్రమంలోనే 98 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ సాధించాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో భాగంగా సిరివర్థనే వేసిన 33 ఓవర్ రెండో బంతిని సిక్స్‌గా కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది ఫించ్ వన్డే కెరీర్‌లో 14వ సెంచరీ. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ దిగిన ఆసీస్ ఇన్నింగ్స్‌ను డేవిడ్ వార్నర్-అరోన్ ఫించ్‌లు ప్రారంభించారు.
వీరిద్దరూ 80 పరుగులు జత చేసిన తర్వాత వార్నర్(26) తొలి వికెట్‌గా ఔటయ్యాడు. ఆపై మరో 20 పరుగుల వ‍్యవధిలో ఫస్ట్ డౌన్‌లో వచ్చిన ఖవాజా(10) కూడా ఔట్ కావడంతో ఆసీస్ 100 పరుగుల వద్ద రెండో వికెట్‌ను చేజార్చుకుంది. ఆ తరుణంలో ఫించ్‌కు జత కలిసిన స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ జోడి స్టైక్ రోటేట్ చేస్తూ ముందుకు సాగడంతో ఆసీస్ స్కోరులో వేగం పెరిగింది. దాంతో ఆసీస్ 35 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఆసీస్ కోల్పోయిన తొలి రెండు వికెట్లు ధనంజయ డిసిల్వా ఖాతాలో పడ్డాయి.