
లండన్: ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లండ్ గడ్డపై వన్డే ఫార్మాట్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన ఆసీస్ బ్యాట్స్‌మన్‌గా ఘనత సాధించాడు. వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌లో ఫించ్ ఈ ఫీట్ నమోదు చేశాడు. 132 బంతుల్లో 15 ఫోర్లు, 5 సిక్సర్లు సాయంతో 153 పరుగుల వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. ఇది ఫించ్‌కు వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు కాగా, ఇంగ్లండ్ గడ్డపై ఆసీస్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఘనతను కూడా తన పేరున లిఖించుకున్నాడు.
(ఇక్కడ చదవండి: ఫించ్ శతక్కొట్టుడు)
అంతకముందు ఇంగ్లండ్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన రికార్డు షేన్ వాట్సన్ పేరిట ఉంది. 2013లో సౌతాంప్టన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వాట్సన్ ఈ ఘనత సాధించాడు. తాజాగా దాన్ని ఫించ్ బ్రేక్ చేసి నూతన రికార్డును నెలకొల్పాడు. ఇక వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు సాధించిన మూడో ఆసీస్ బ్యాట్స్‌మన్‌గా ఫించ్ గుర్తింపు సాధించాడు. ఈ జాబితాలో డేవిడ్ వార‍్నర్ (178; 2015 వరల్డ్‌కప్‌లో), మాథ్యూ హేడెన్ (158; 2007 వరల్డ్‌కప్‌లో) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.