హరారే: ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు, టీ 20 కెప్టెన్ అరోన్ ఫించ్ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగంగా మంగళవారం జింబాబ్వేతో మ్యాచ్‌లో ఫించ్ చెలరేగి ఆడి కొత్త రికార్డు సృష్టించాడు. 76 బంతుల్లో 16 ఫోర్లు, 10 సిక్సర్లతో 172 పరుగులు నమోదు చేశాడు. ఫలితంగా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు. ఈ క్రమంలోనే అతని పేరిటే ఉన్న 156 పరుగుల గత రికార్డును ఫించ్ సవరించుకున్నాడు.
తాజా మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఆసీస్ బ్యాటింగ్ చేపట్టింది. దాంతో ఆసీస్ ఇన్నింగ్స్‌ను ఫించ్, డీ ఆర్సీ షాట్‌లు ధాటిగా ఆరంభించారు. ఒకవైపు డీ ఆర్సీ షాట్(46; 42 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సమయోచితంగా ఆడితే ఫించ్ మాత్రమే ఆకాశమే హద్దుగా విజృంభించాడు. సిక్సర్లు, ఫోర్లతో జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ముందుగా 50 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోవడం ద్వారా అంతర్జాతీయ టీ20ల్లో రెండో సెంచరీ సాధించాడు. ఆపై మరింత రెచ్చిపోయిన ఫించ్.. జింబాబ్వే బౌలర్లను ఊచకోత కోశాడు. 124 పరుగుల్ని ఫోర్లు, సిక్సర్లు ద్వారా ఫించ్ సాధించడం ఇక్కడ మరో విశేషం. ఓపెనర్‌గా బరిలోకి వచ్చిన ఫించ్.. ఆఖరి ఓవర్ నాల్గో బంతికి హిట్ వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. ఫించ్ దూకుడుతో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment