కెప్టెన్గా కోహ్లి ఓకే.. కానీ
న్యూఢిల్లీ: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఆటలో ఇంకా నిలకడను కనబరచాల్సిన అవసరం ఉందని మాజీ దిగ్గజ ఆటగాడు గుండప్ప విశ్వనాథ్ అభిప్రాయపడ్డాడు. 2014, డిసెంబర్ చివర్లో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా మహేంద్ర సింగ్ ధోని నుంచి టెస్టు బాధ్యతలు తీసుకున్న కోహ్లి నాయకుడిగా క్రమేపీ పరిణితి సాధిస్తున్నా... ఆటలో మాత్రం చాలా మెరుగవ్వాలన్నాడు. విరాట్ ఆటలో దూకుడును తగ్గించి క్రీజ్ లో ఎక్కువ సేపు నిలబడటానికి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని సూచించాడు.
ప్రత్యేకంగా టెస్టుల్లో ఎక్కువగా స్ట్రోక్స్ ఆడి వికెట్ ను అనవసరంగా కోల్పోతున్న విషయాన్ని విరాట్ గుర్తిస్తే బాగుంటుందన్నాడు. అతను కొట్టే స్ట్రోక్స్ ఒకటి, రెండు సార్లు బాగానే ఉంటున్నా... అత్యధిక సార్లు మాత్రం వికెట్లు వెనుక దొరికిపోతున్నాడన్నాడు. ఇది అతని కెరీర్ ను డైలామాలో పాడేసే అవకాశం కూడా లేకపోలేదన్నాడు. దీన్ని విరాట్ వదిలిపెట్టి బ్యాటింగ్ శైలిని మార్చుకోవాలని విశ్వనాధ్ సూచించాడు.