మెస్సీ ఈ సారైనా మెరిసేనా.. | foot ball final match today night | Sakshi
Sakshi News home page

మెస్సీ ఈ సారైనా మెరిసేనా..

Published Sat, Jul 4 2015 11:02 AM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

మెస్సీ ఈ సారైనా మెరిసేనా.. - Sakshi

మెస్సీ ఈ సారైనా మెరిసేనా..

'కోపా' టోర్నీపై కన్నేసిన మెస్సీ
ఒక్క పెద్ద కప్ కూడా
నెగ్గని అర్జెంటీనా స్టార్
నేటిరాత్రి ఫైనల్

లియోనల్ మెస్సీ.. పరిచయం అవసరం లేని పేరు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో అభిమానులను సంపాదించుకున్న ఫుట్‌బాల్ ఆటగాడు. ప్రస్తుతం జరుగుతున్న కోపా అమెరికా టోర్నీతో కెరీర్‌లో వందో అంతర్జాతీయ మ్యాచ్‌ను పూర్తి చేసుకున్నాడు. అయినా తన ఖాతాలో ఇప్పటివరకు ఒక్క పెద్ద టోర్నీ కూడా లేదు. ప్రపంచంలోనే గొప్ప ఆటగాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న మెస్సీ.. కొంత మంది దృష్టిలో మాత్రం ఫుట్‌బాల్ చరిత్రలోనే గొప్ప ఆటగాడు. అటువంటి ఆటగాడికి ఇప్పుడు పెద్ద టోర్నీని నెగ్గే అవకాశం వచ్చింది. ఈ రోజు (శనివారం రాత్రి) జరిగే కోపా అమెరికా కప్‌లో చిలీపై నెగ్గి ఆ కల నెరవేర్చుకుంటాడో.. లేదో.. చూడాలి.
 
21 ఏళ్ల వయసులో ప్రపంచం దృష్టిలో పడి.. మరో నాలుగేళ్లకు ఆల్‌టైమ్ గ్రేట్ ఆటగాళ్లలో ఒకడిగా మారడం చాలా అరుదుగా జరుగుతుంది. మెస్సీ అలాగే చేసి చూపాడు. ఐదేళ్ల వయసులోనే ఫుట్‌బాల్ ఆడడం మొదలు పెట్టిన మెస్సీ కెరీర్ బార్సిలోనా క్లబ్‌లో మలుపు తిరిగింది. పెద్ద క్లబ్ కావడంతో తన ప్రతిభను చాటాడానికి అవకాశం లభించింది. అప్పటికే ప్రపంచాన్ని ఏలుతున్న రోనాల్డిన్హో ఆడుతున్న క్లబ్‌లో ఉండి కూడా అతని స్థాయి పేరు తెచ్చుకున్నాడు మెస్సీ. క్లబ్ స్థాయిలో అన్ని రికార్డులను వరుసపెట్టి బద్దలు కొడుతూ వస్తున్న మెస్సీకి ఉన్న అతి పెద్ద వెలితి.. అంతర్జాతీయ స్థాయిలో పెద్ద కప్‌ను నెగ్గకపోవడం. ఈ రోజు జరిగే కోపా అమెరికా ఫైనల్లో నెగ్గి ఆ వెలితిని తీర్చుకోవాలని చూస్తున్నాడు.

11 ఏళ్ల వయసులో స్పెయిన్‌కు..
మెస్సీకి 11 ఏళ్ల వయసులో అరుదైన వ్యాధి వచ్చింది. అప్పటికే అతనాడుతున్న క్లబ్ వైద్య ఖర్చులు భరించలేమని చెప్పింది. మెస్సీ టాలెంట్ తెలుసుకున్న బార్సిలోనా మేనేజర్ అతనికి అవకాశం ఇచ్చాడు. మెస్సీ ప్రతిభ చూసి అప్పటికప్పుడు దగ్గర్లో కాగితం లేకపోవడంతో టిష్యూ పేపర్‌పై అతనితో ఒప్పందం రాసిచ్చాడు. బార్సిలోనా జూనియర్ జట్టులో అద్భుత ప్రదర్శన చేసి బార్సిలోనా జట్టుకు 17 ఏళ్ల వయసులో 2004లో ఎంపికయ్యాడు. ఇక బార్సిలోనా తరఫున అతడు అందుకోని అవార్డు లేదు, టైటిల్ లేదు. మొత్తం స్పెయిన్ క్లబ్ చరిత్రలోనే ఎక్కువ గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. అలాగే చాంపియన్స్‌లీగ్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. సరిగ్గా పదిరోజుల కిందట పుట్టిన రోజు (జూన్ 24) జరుపుకున్న అతని వయసు ప్రస్తుతం 28 ఏళ్లే.

స్పెయిన్‌కు ఆడే అవకాశమున్నా..
మెస్సీ చిన్నవయసులోనే స్పెయిన్‌కు వెళ్లడంతో ఆ దేశ పౌరసత్వం కూడా వచ్చింది. స్పెయిన్ అండర్-20 జట్టుకు ఆడే అవకాశం వచ్చినా సున్నితంగా తిరస్కరించి అర్జెంటీనానే ఎంచుకున్నాడు. 2005లో ఫిఫా అండర్-20 ప్రపంచకప్‌లో అర్జెంటీనా తరఫున పాల్గొని దాన్ని నెగ్గడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ టోర్నీలో గోల్డెన్ బూట్, ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డులు మెస్సీకే దక్కాయి. 2008లో బీజింగ్ ఒలింపిక్స్‌లో అర్జెంటీనా బంగారు పతకం నెగ్గడంలోనే మెస్సీదే కీలక పాత్ర.

తొలిమ్యాచే పీడకల..
2005లో హంగేరీపై మ్యాచ్‌లో 63వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి తొలిసారి సీనియర్ జట్టుకు ఆడాడు. అయితే మరో రెండు నిమిషాలకే రెడ్ కార్డుకు గురై మైదానం వీడాడు. మ్యాచ్ అనంతరం అర్జెంటీనా ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూంలో వెళితే ఒక మూలన కూర్చున్న మెస్సీ ఏడుస్తూ కనిపించాడు. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. వరుసగా మూడు ప్రపంచకప్‌లు, రెండు కోపా అమెరికా టోర్నీల్లో పాల్గొన్నాడు.

2014లో ప్రపంచకప్ ఫైనల్..
అర్జెంటీనాకు ప్రపంచకప్‌లో అతిపెద్ద గండం జర్మనీ. ముఖ్యంగా మెస్సీ పాల్గొన్న 2006, 10, 14 టోర్నీలలో జర్మనీ చేతిలో ఓడిపోయే ఇంటిముఖం పట్టింది. 2014లో అయితే మెస్సీ కెప్టెన్‌గా ఉన్న అర్జెంటీనా ఫైనల్‌కు చేరినా జర్మనీని ఆపలేక రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఆ టోర్నీలో మెస్సీకే బెస్ట్ ప్లేయర్ అవార్డు లభించింది. అలాగే 2007లో కోపా అమెరికా కప్ రన్నరప్‌గా నిలిచిన జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నాడు. ఈ రెండు సార్లు ట్రోఫీ అందుకోవడానికి దగ్గరగా వచ్చి భంగపడ్డాడు.
 
ఒలింపిక్స్‌ను మినహాయిస్తే ఏ ఫుట్‌బాల్ జట్టైనా పాల్గొనే అతిపెద్ద టోర్నీలు మూడే ఉంటాయి. అవి ప్రపంచకప్, ఫిఫా కాన్ఫడరేషన్ కప్, మూడోది ఆ దేశం ఉండే జోన్‌లలో ఏర్పాటు చేసే కప్. ఉదా: యూరో కప్ (యూరోపియన్ దేశాలకు)/ కోపా అమెరికా (దక్షిణామెరికా దేశాలకు). ఒలింపిక్స్‌లో పెద్ద దేశాల జట్లు పాల్గొన్నా కేవలం ముగ్గురు మాత్రమే 23 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న ఆటగాళ్లు తుది జట్టులో ఆడాలి.
 
ప్రస్తుతం జరుగుతున్న కోపా టోర్నీలో జమైకాతో జరిగిన మ్యాచ్‌తో మెస్సీ వందో మ్యాచ్‌ను పూర్తి చేసుకున్నాడు. ఇంకా 43 మ్యాచ్‌లు ఆడితే ఆ దేశం తరఫున అత్యధిక మ్యాచ్ ఆడిన ఆటగాడిగా నిలుస్తాడు. 46 గోల్స్‌తో ఆ దేశం తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాతో రెండు స్థానంలో నిలిచాడు. ఇంకో 10 గోల్స్ చేస్తే ఈ రికార్డును అందుకుంటాడు. ఈ రెండు రికార్డులను బద్దలుకొట్టడం మెస్సీకి పెద్ద కష్టం కాదు కానీ ట్రోఫీని నెగ్గడమే ప్రస్తుతం అతని ముందున్న పెద్ద లక్ష్యం. ఇది మెస్సీకే అర్జెంటీనా జాతీయ జట్టుకు కూడా ఎంతో అవసరం.
 
ఒక్క మెస్సీసే కాదు మరో అర్జెంటీనా సూపర్ స్టార్ కార్లోస్ తెవెజ్‌కు కూడా పెద్ద కప్ నెగ్గలేదనే వెలతి ఉంది. ఎందుకంటే గత 22 ఏళ్లుగా అర్జెంటీనా జట్టు పెద్ద టైటిల్ నెగ్గలేదు. 1993లో కోపా అమెరికా నెగ్గడమే దాని చివరి అతి పెద్ద విజయం. ఈ సారి తమ కంటే కాస్త బలహీనమైన చిలీపై నెగ్గాలని ఆ జట్టు యోచిస్తోంది. ప్రస్తుతం స్టార్ ఆటగాళ్లు డి మరియా, అగ్వేరో (మారడోన అల్లుడు), హిగ్యుయెన్, లావెజ్జీ, మాషరానో, జబలేటాలతో కూడిన కూడిన మెస్సీ బృందం స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే కప్‌ను నెగ్గడం కష్టమేమి కాదు. 
-మన్నె కిశోర్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement