మూడు టెస్టులకు రూ. 9 కోట్లే! | For three test rs 9 crores | Sakshi
Sakshi News home page

మూడు టెస్టులకు రూ. 9 కోట్లే!

Published Wed, Jun 10 2015 3:43 AM | Last Updated on Fri, Nov 9 2018 6:35 PM

భారత్‌తో సిరీస్ అంటే భారీ మొత్తంలో సొమ్ము చేసుకోవచ్చని ఆశపడిన శ్రీలంక క్రికెట్ బోర్డుకు బ్రాడ్‌కాస్టర్లు షాక్ ఇచ్చారు...

శ్రీలంక బోర్డు నిరాశ
కొలంబో:
భారత్‌తో సిరీస్ అంటే భారీ మొత్తంలో సొమ్ము చేసుకోవచ్చని ఆశపడిన శ్రీలంక క్రికెట్ బోర్డుకు బ్రాడ్‌కాస్టర్లు షాక్ ఇచ్చారు. సొంతగడ్డపై ఈ ఏడాది ఆగస్టులో జరిగే మూడు టెస్టుల సిరీస్ ప్రసార హక్కుల కోసం టెన్ స్పోర్ట్స్ కేవలం 1.4 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 9 కోట్లు) మాత్రమే ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ ఒక్క చానల్ మినహా మరెవరూ హక్కుల కోసం టెండర్ వేయలేదు. ఇదే సిరీస్‌లో సంగక్కర తన కెరీర్ చివరి మ్యాచ్ ఆడనున్నాడు.

ఆరంభంలో స్టార్, సోనీ సంస్థలు ఆసక్తి చూపించినా టెండర్ మాత్రం వేయలేదు. ఇటీవల ప్రపంచకప్, ఐపీఎల్‌ల కారణంగా ఈ చానల్స్ బ్రాడ్‌కాస్టింగ్ బడ్జెట్ అయిపోవడంతో పాటు వర్షాలు కూడా సిరీస్‌ను దెబ్బ తీసే అవకాశం ఉండటమే దీనికి కారణమని తెలుస్తోంది. ‘భారత్‌తో ఒక్కో మ్యాచ్‌కు కనీసం 20 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 13 కోట్లు) అయినా వస్తాయని ఆశించాం. కానీ ఈ పరిణామం మమ్మల్ని తీవ్రంగా నిరాశపర్చింది. ఇప్పుడు కోట్ చేసిన మొత్తం చాలా చాలా తక్కువ. దీనిని పెంచమని టెన్‌స్పోర్ట్స్‌కు మరోసారి విజ్ఞప్తి చేస్తాం. లేదంటే ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తాం’ అని లంక బోర్డు చైర్మన్ సిదాత్ వెట్టిముని ఆవేదనగా చెప్పారు.

గత ఏడాది విండీస్ జట్టు అర్ధాంతరంగా వెనుదిరగడంతో భారత్ వచ్చి వన్డేలు ఆడిన లంకకు ప్రత్యుపకారంగా బీసీసీఐ ఈ సిరీస్ ఆడించేందుకు సిద్ధమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement