‘షిర్కేకు ఆ అర్హత లేదు’
ముంబై: బీసీసీఐ కార్యదర్శి స్థానం నుంచి సుప్రీంకోర్టు ఉద్వాసనకుగురైన అజయ్‌షిర్కేకు బోర్డులో పూర్తిగా దారులు మూసుకుపోయినట్టేనని లోధా ప్యానెల్ స్పష్టం చేసింది. మహారాష్ట్ర క్రికెట్ సంఘం (ఎంసీఏ) ప్రతినిధిగా కూడా ఆయనకు బీసీసీఐ సమావేశాల్లో పాల్గొనేందుకు అర్హత లేదని తేల్చింది. తరచుగా అడిగే ప్రశ్నలకు ప్యానెల్ తగిన సమాధానాలు తెలిపి సందేహాలను నివృత్తి చేసింది. ఏడు ప్రశ్నలతో కూడిన ఈ జాబితాలో షిర్కే అంశం రెండో ప్రాధాన్యంలో పేర్కొంది. అలాగే బోర్డు అధ్యక్ష పదవి చేపట్టే అవకాశాలున్నట్టు పేర్కొంటున్న బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) చీఫ్ సౌరవ్ గంగూలీ మూడేళ్ల కూలింగ్ ఆఫ్ పీరియడ్ పరిధిలోకి వస్తాడని పేర్కొంది. ఈ ఏడాది జూన్‌లో గంగూలీ క్యాబ్ పదవీకాలం ముగుస్తుంది.