స్టానిస్లాస్ వావ్రింకా
తొలి రోజు మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఒస్టాపెంకో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించగా... రెండోరోజు పురుషుల సింగిల్స్‌లో గతేడాది రన్నరప్, 2015 చాంపియన్ స్టానిస్లాస్ వావ్రింకా మొదటి రౌండ్‌లోనే వెనుదిరిగాడు. ప్రపంచ 67వ ర్యాంకర్ గిలెర్మో గార్సియా లోపెజ్ అద్వితీయ ఆటతీరు కనబరిచి ఐదు సెట్‌ల పోరాటంలో వావ్రింకాను బోల్తా కొట్టించాడు. ఈ ఓటమితో జూన్ రెండో వారంలో విడుదలయ్యే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో వావ్రింకా ప్రస్తుత 30వ ర్యాంక్ నుంచి దిగజారి 256వ ర్యాంక్‌కు పడిపోనున్నాడు. మరోవైపు మాజీ చాంపియన్, 20వ సీడ్ నొవాక్ జొకోవిచ్, ఏడో సీడ్ డొమినిక్ థీమ్ అలవోక విజయాలతో రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టారు.
పారిస్: కొంతకాలంగా గాయాలతో సతమతమవుతూ ఫామ్ కోల్పోయిన స్విట్జర్లాండ్ అగ్రశ్రేణి టెన్నిస్ ప్లేయర్ స్టానిస్లాస్ వావ్రింకాకు ఫ్రెంచ్ ఓపెన్‌లో చేదు ఫలితం ఎదురైంది. గతేడాది రన్నరప్‌గా నిలిచిన అతను ఈసారి తొలి రౌండ్‌లోనే చేతులెత్తేశాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 67వ ర్యాంకర్ గిలెర్మో గార్సియా లోపెజ్ (స్పెయిన్) 6–2, 3–6, 4–6, 7–6 (7/5), 6–3తో వావ్రింకాను ఓడించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. 3 గంటల 30 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో వావ్రింకా ఐదు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు.
అయితే ఊహించని రీతిలో ఏకంగా 72 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో ఐదుసార్లు వావ్రింకా సర్వీస్‌ను బ్రేక్ చేసిన లోపెజ్ 40 అనవసర తప్పిదాలు చేశాడు. ‘ఈ ఓటమితో నా ర్యాంక్ ఘోరంగా పడిపోతుందని తెలుసు. అయితే దీనిపై నాకేమీ ఇబ్బంది లేదు. మళ్లీ ఫామ్‌లోకి రావడానికి కాస్త సమయం ఎక్కువ పడుతుంది’ అని 33 ఏళ్ల వావ్రింకా వ్యాఖ్యానించాడు. ఇతర పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో 20వ సీడ్ జొకోవిచ్ 6–3, 6–4, 6–4తో దుత్రా సిల్వా (బ్రెజిల్)పై, డొమినిక్ థీమ్ 6–2, 6–4, 6–1తో ఇవాష్కా (బెలారస్)పై, 12వ సీడ్ సామ్ క్వెరీ (అమెరికా) 6–1, 6–2, 7–6 (8/6)తో టియాఫో (అమెరికా)పై గెలుపొంది రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు.
వొజ్నియాకి ముందంజ...
మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ వొజ్నియాకి (డెన్మార్క్), ఎనిమిదో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) రెండో రౌండ్‌లోకి చేరగా... 20వ సీడ్ సెవస్తోవా (లాత్వియా) తొలి రౌండ్‌లో పరాజయం చవి చూసింది. వొజ్నియాకి 7–6 (7/2), 6–1తో కోలిన్స్ (అమెరికా)పై, క్విటోవా 3–6, 6–1, 7–5తో వెరోనికా (పరాగ్వే)పై గెలిచారు. సెవస్తోవా 6–4, 1–6, 3–6తో మరీనో (కొలంబియా) చేతిలో ఓడింది.
Comments
Please login to add a commentAdd a comment