అటు నా లీ... ఇటు వావ్రింకా | French Open: Australian Open champion Li Na loses in first round | Sakshi
Sakshi News home page

అటు నా లీ... ఇటు వావ్రింకా

Published Wed, May 28 2014 12:37 AM | Last Updated on Sat, Sep 2 2017 7:56 AM

అటు నా లీ... ఇటు వావ్రింకా

అటు నా లీ... ఇటు వావ్రింకా

తొలి రౌండ్‌లోనే ఓడిన ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతలు
 మ్లాడెనోవిక్, లోపెజ్ సంచలనం
 ఫెరర్, ఇవనోవిచ్ ముందంజ
 ఫ్రెంచ్ ఓపెన్
 
 పారిస్: తమ అద్వితీయ ప్రదర్శనతో ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో టైటిల్స్ నెగ్గిన స్టార్ క్రీడాకారులు నా లీ (చైనా), స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్)లకు ఫ్రెంచ్ ఓపెన్ కలిసిరాలేదు. ఊహించనిరీతిలో ఈ ఇద్దరూ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. ప్రపంచ 103వ ర్యాంకర్ క్రిస్టినా మ్లాడెనోవిక్ (ఫ్రాన్స్), ప్రపంచ 41వ ర్యాంకర్ గిలెర్మో గార్సియో లోపెజ్ (స్పెయిన్) ఈ సంచలనాలకు రూపకర్తలుగా నిలిచారు. క్రిస్టినా మ్లాడెనోవిక్ (ఫ్రాన్స్) 7-5, 3-6, 1-6తో 2011 విజేత, రెండో సీడ్, ప్రపంచ రెండో ర్యాంకర్ నా లీని బోల్తా కొట్టించింది.

 పురుషుల సింగిల్స్‌లో గార్సియో లోపెజ్ 6-4, 5-7, 6-2, 6-0తో మూడో సీడ్, ప్రపంచ 3వ ర్యాంకర్ వావ్రింకాను కంగుతినిపించాడు. మ్లాడెనోవిక్‌తో 2 గంటల 4 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో నా లీ ఏకంగా 37 అనవసర తప్పిదాలు, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసి మూల్యం చెల్లించుకుంది. ఎనిమిదోసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో బరిలోకి దిగిన నా లీ తొలి రౌండ్‌లోనే ఓడిపోవడం ఇదే మొదటిసారి. మ్లాడెనోవిక్ ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసినా నా లీ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది.

 
  మరోవైపు వావ్రింకా నిలకడలేని ఆటతీరుతో తడబడ్డాడు. 2 గంటల 23 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో వావ్రింకా 62 అనవసర తప్పిదాలు చేశాడు. కెరీర్‌లో 38 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడిన లోపెజ్ ఇప్పటివరకు కేవలం నాలుగుసార్లు మాత్రమే మూడో రౌండ్‌కు చేరాడు. వావ్రింకాతో మ్యాచ్‌లో లోపెజ్ ఎనిమిది బ్రేక్ పాయింట్లు సాధించడం విశేషం. మరో మ్యాచ్‌లో 11వ సీడ్ గ్రిగోర్ దిమిత్రోవ్ (బల్గేరియా)కు కూడా చుక్కెదురైంది. అన్‌సీడెడ్ ఇవో కార్లోవిచ్ (క్రొయేషియా) 6-4, 7-5, 7-6 (7/4)తో దిమిత్రోవ్‌ను ఓడించాడు.
 

 ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్) 6-4, 6-3, 6-1తో సిసిలింగ్ (నెదర్లాండ్స్)పై; ఏడో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) 6-1, 6-4, 3-6, 6-3తో గొలుబెవ్ (కజకిస్థాన్)పై; 12వ సీడ్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్) 6-2, 6-1, 7-5తో బెర్నాడ్ టామిక్ (ఆస్ట్రేలియా)పై; 19వ సీడ్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) 7-5, 6-3, 6-4తో రాబర్ట్ (ఫ్రాన్స్)పై గెలిచారు. వేర్వేరు మ్యాచ్‌ల్లో 21వ సీడ్ నికొలస్ అల్మాగ్రో (స్పెయిన్), 16వ సీడ్ టామీ హాస్ (జర్మనీ) గాయాల కారణంగా మ్యాచ్ మధ్యలోనే వైదొలిగారు.
 
 మహిళల సింగిల్స్ విభాగంలో మాజీ చాంపియన్, 11వ సీడ్ అనా ఇవనోవిచ్ (సెర్బియా), నాలుగో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా), ఆరో సీడ్ జంకోవిచ్ (సెర్బియా) శుభారంభం చేశారు. ఇవనోవిచ్ 6-1, 6-3తో గార్సియా (ఫ్రాన్స్)పై, సిమోనా 6-0, 6-2తో అలీసా క్లెబనోవా (రష్యా)పై; జంకోవిచ్ 5-7, 6-1, 6-3తో ఫిచ్‌మన్ (కెనడా)పై గెలిచారు. ప్రపంచ మాజీ నంబర్‌వన్, 13వ సీడ్ కరోలిన్ వొజ్నియాకి (డెన్మార్క్) తొలి రౌండ్‌లోనే చేతులెత్తేసింది. యానినా విక్‌మాయెర్ (బెల్జియం) 7-6 (7/5), 4-6, 6-2తో వొజ్నియాకిని ఓడించింది.
 
 నేటి రెండో రౌండ్ మ్యాచ్‌లు మ. గం. 2.30 నుంచి
 నియో ప్రైమ్‌లో ప్రత్యక్ష ప్రసారం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement