ఆస్ట్రేలియా ఒపెన్ ఫైనల్లో నాదల్ పై వావ్రింకా సంచలన విజయం
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ పురుషల సింగిల్స్ విభాగంలో స్టానిస్లాస్ వావ్రింకా సంచలన విజయాన్ని నమోదు చేసి టైటిల్ ను ఎగురవేసుకుపోయాడు. ఫైనల్ మ్యాచ్ లో భాగంగా ఇక్కడ ఆదివారం జరిగిన పోరులో వావ్రింకా 6-3,6-2,3-6,6-3 తేడాతో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ను కంగుతినిపించాడు. దీంతో తొలిసారి గ్రాండ్ స్లామ్ ను సాధించిన ఆటగాడిగా వావ్రింకా రికార్డులోకెక్కాడు. ఆద్యంత ఏకపక్షం సాగిన పోరులో రఫెల్ నాదల్ మాత్రం సరైన పోటీ నివ్వకుండా చేతులెత్తేశాడు.
అంతకముందు క్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ ను మట్టికరిపించిన వావ్రింకా అదే ఊపును కనబరుస్తూ టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో నాదల్ వరుస సెట్లలో చిరకాల ప్రత్యర్థి స్విట్జర్లాండ్ క్రీడాకారుడు రోజర్ ఫెడరర్ పై గెలిచిన సంగతి తెలిసిందే. ఓపెన్ శకం ఆరంభయిన అనంతరం ఒక్కో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌ను రెండేసిసార్లు నెగ్గిన తొలి క్రీడాకారుడిగా... టెన్నిస్ చరిత్రలో మూడో క్రీడాకారుడిగా రికార్డులకెక్కాలని భావించిన నాదల్ కు స్విట్జర్లాండ్ క్రీడాకారుడు వావ్రింకా చేతిలో ఓటమి ఎదురవడం గమనార్హం.