ఎర్రమట్టిపై రాఫెల్ నాదల్ మరోసారి ఎదురులేని ప్రదర్శన కనబర్చాడు... 13వ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గే క్రమంలో నాదల్ తుది పోరుకు అర్హత సాధించాడు. సెమీస్‌లో అతని జోరు ముందు ష్వార్ట్‌జ్‌మన్ నిలవలేకపోయాడు. ఇటీవలే రోమ్ ఓపెన్‌లో క్వార్టర్స్‌లో నాదల్‌పై సంచలన విజయం సాధించిన అర్జెంటీనా ఆటగాడు గ్రాండ్‌స్లామ్ పోరులో మాత్రం తలవంచక తప్పలేదు.
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో రాఫెల్ నాదల్ విజయ యాత్ర కొనసాగుతోంది. టైటిల్ సాధించే లక్ష్యంతో బరిలోకి దిగిన అతను ఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన సెమీస్‌లో రెండో సీడ్ నాదల్ 6–3, 6–3, 7–6 (7/0)తో 12వ సీడ్ డీగో ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా)ను ఓడించాడు. మొత్తం 3 గంటల 9 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి రెండు సెట్‌లు ఏకపక్షంగా సాగగా...చివరి సెట్‌లో మాత్రం ష్వార్ట్‌జ్‌మన్ కొంత పోటీనివ్వగలిగాడు. అయితే తుది ఫలితం మాత్రం నాదల్‌కు అనుకూలంగానే వచ్చింది. 3 ఏస్‌లు కొట్టిన అతను ఒక్క డబుల్‌ఫాల్ట్ కూడా చేయలేదు. మ్యాచ్‌లో నాదల్ 38 విన్నర్లు కొట్టాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్‌కు ఇది 99వ విజయం కావడం విశేషం. మరో మ్యాచ్ గెలిస్తే అతను 100వ విజయంతో పాటు 13వ సారి టైటిల్‌ను అందుకుంటాడు. ఇక్కడ 12 సార్లు ఫైనల్ చేరిన అతను 12 సార్లూ విజేతగా నిలిచాడు.
టైబ్రేక్‌లో జోరు...
మొదటి సెట్‌లో తన సర్వీస్‌ను కాపాడుకుంటూ ఒక సారి ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన నాదల్ 4–1తో ఆధిక్యంలో నిలిచాడు. ఆ తర్వాత ష్వార్ట్‌జ్‌మన్ కాస్త పోరాడి ఆధిక్యాన్ని 3–5కు తగ్గించగలిగినా, తర్వాతి గేమ్‌ను గెలుచుకొని నాదల్ సెట్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్ కూడా దాదాపు ఇదే తరహాలో సాగింది. అయితే తొలి సెట్‌కంటే 13 నిమిషాలు వేగంగా ఈ సెట్‌ను స్పెయిన్ దిగ్గజం ముగించగలిగాడు.
మూడో సెట్‌ను కూడా ఒక దశలో వరల్డ్ నంబర్ 2 సునాయాసంగా గెలుచుకుంటాడని అనిపించింది. అయితే అర్జెంటీనా ఆటగాడు తన సర్వశక్తులూ ఒడ్డి ప్రత్యర్థిని నిలువరించే ప్రయత్నం చేశాడు. నాదల్ 4–2తో ఉన్న దశనుంచి అతను చెలరేగడంతో స్కోరు 5–5కు చేరింది. ఈ సమయంలో నాదల్ కొంత ఒత్తిడికి లోనయ్యాడు. పది నిమిషాలకు పైగా సాగిన తర్వాతి గేమ్‌లో అతను అద్భుతమైన ఫోర్‌హ్యాండ్‌లతో మూడు బ్రేక్ పాయింట్లను కాపాడుకున్నాడు. అయితే ష్వార్ట్‌జ్‌మన్ 6–6తో సమం చేయడంతో టైబ్రేకర్ అనివార్యమైంది. ఇక్కడ నాదల్ తన స్థాయి ఏమిటో చూపించాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుసగా 7 గేమ్‌లు గెలిచి ఫైనల్ చేరాడు.
ఎదురు లేని నాదల్
Published Sat, Oct 10 2020 5:31 AM | Last Updated on Sat, Oct 10 2020 5:31 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment