పారిస్: ఎట్టకేలకు ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్ ప్రారంభంకానుంది. మార్చి 15న మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రితో 2020 సీజన్ మొదలుకావాల్సినా... కరోనా వైరస్ కారణంగా సాధ్యపడలేదు. దాంతో ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రితోపాటు డచ్, మొనాకో, ఫ్రెంచ్ గ్రాండ్‌ప్రి రేసులు రద్దయ్యాయి. మరో ఐదు రేసులు వాయిదా పడ్డాయి. యూరప్ దేశాల్లో కరోనా వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టడంతో ఎఫ్1 మేనేజ్‌మెంట్ సీజన్ మొదలుపెట్టడానికి సిద్ధమైంది. జూలై 5న ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి రేసుతో 2020 సీజన్ ఆరంభమవుతుంది.
ఈ రేసు తర్వాత జూలై 12న ఆస్ట్రియాలోనే మరో రేసు జరుగుతుంది. జూలై 19న హంగేరి గ్రాండ్‌ప్రిని నిర్వహిస్తారు. అనంతరం వరుసగా రెండు వారాల్లో ఆగస్టు 2న, ఆగస్టు 9న బ్రిటిష్ గ్రాండ్‌ప్రి జరుగుతుంది. ఆగస్టు 16న స్పెయిన్ గ్రాండ్‌ప్రి, ఆగస్టు 30న బెల్జియం గ్రాండ్‌ప్రి, సెప్టెంబరు 6న ఇటలీ గ్రాండ్‌ప్రి జరుగుతాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమైతే ఎఫ్1 సీజన్‌లో మొత్తం 22 రేసులు జరగాలి. అయితే కరోనా మహమ్మారి ప్రభావం ఎఫ్1 రేసులపైనా పడింది. ఇప్పటికైతే ఎనిమిది రేసుల తేదీలను ఖరారు చేశారు. పరిస్థితులనుబట్టి ఈ సీజన్‌లో 15 లేదా 18 రేసులు నిర్వహిస్తామని ఎఫ్1 వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment