మూడోరౌండ్‌లో నాదల్
ముర్రే, ఫై కూడా...
సత్తా చాటిన క్విటోవా, జంకోవిచ్, ఎరానీ
ఫ్రెంచ్ ఓపెన్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో ఎలాంటి సంచలనాలకు తావివ్వకుండా టాప్ ప్లేయర్లు ముందంజ వేశారు. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) తన జైత్రయాత్ర కొనసాగిస్తూ మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లగా, మహిళల విభాగంలో క్విటోవా, జంకోవిచ్‌లు సత్తా చాటారు.
గురువారం జరిగిన రెండో రౌండ్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌సీడ్ నాదల్ 6-2, 6-2, 6-3తో ప్రపంచ 57వ ర్యాంకర్ డోమినిక్ తియోమ్ (ఆస్ట్రియా)పై నెగ్గాడు. ఈ గెలుపుతో ‘స్పెయిన్ బుల్’ పారిస్‌లో తన విజయాల సంఖ్యను 61కి పెంచుకున్నాడు. రెండు గంటలా 5 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నాదల్ రెండుసార్లు సర్వీస్‌ను కోల్పోయాడు. ఏడుసార్లు సర్వీస్‌ను చేజార్చుకున్న తియోమ్ 41 అనవసర తప్పిదాలు చేశాడు. రెండు ఏస్‌లు, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసిన ఆస్ట్రియా ఆటగాడు నాలుగు బ్రేక్ పాయింట్లలో రెండింటిని కాచుకున్నాడు. నాదల్ మాత్రం పది అవకాశాల్లో ఏడింటిని సద్వినియోగం చేసుకున్నాడు.
ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో 5వ సీడ్ డేవిడ్ ఫై (స్పెయిన్) 6-2, 6-3, 6-2తో సిమోన్ బొలెల్లీ (ఇటలీ)పై; 7వ సీడ్ ముర్రే (బ్రిటన్) 6-3, 6-1, 6-3తో మట్సోవిచ్ (ఆస్ట్రేలియా)పై; 12వ సీడ్ గాస్కెట్ (ఫ్రాన్స్) 7-6 (5), 6-4, 6-4తో కార్లోస్ బార్లోక్ (అర్జెంటీనా)పై; 19వ సీడ్ అండర్సన్ (రష్యా) 6-2, 6-3, 6-2తో అక్సెల్ మికోన్ (ఫ్రాన్స్)పై; డోనాల్డ్ యంగ్ (అమెరికా) 6-3, 7-6 (7/1), 6-3తో 26వ సీడ్ ఫెల్సియానో లోపెజ్ (స్పెయిన్)పై; 28వ సీడ్ కోల్చెర్బర్ (జర్మనీ) 6-3, 7-6 (5), 6-2తో డెనిస్ ఇస్టోమిన్ (ఉజ్బెకిస్థాన్)పై; గులెర్మో లోపెజ్ (స్పెయిన్) 6-4, 6-3, 4-6, 6-0తో మనారినో (ఫ్రాన్స్)పై; సెప్పీ (ఇటలీ) 6-2, 6-4, 6-4తో యువాన్ మోనాకో (అర్జెంటీనా)పై; ఇవో కార్లోవిచ్ (క్రొయేషియా) 7-5, 6-3, 6-4తో ఆండ్రియాస్ హైడర్ (ఆస్ట్రియా)పై; లియోనార్డ్ మేయర్ (అర్జెంటీనా) 6-2, 4-6, 6-4, 6-4తో గబాష్‌విల్లీ (రష్యా)పై గెలిచి తదుపరి రౌండ్‌లోకి ప్రవేశించారు.
మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో ఐదోసీడ్ క్విటోవా (చెక్) 6-4, 6-4తో ఎరకోవిచ్ (న్యూజిలాండ్)పై; ఆరోసీడ్ జంకోవిచ్ (సెర్బియా) 7-5, 6-0తో కురుమీ నారా (జపాన్)పై; 10వ సీడ్ సారా ఎరానీ (ఇటలీ) 6-2, 6-4తో ఫైజన్‌మేయర్ (జర్మనీ)పై; 15వ సీడ్ సొలానీ స్టీఫెన్స్ (అమెరికా) 6-1, 6-3తో పోలోనా హర్కాగ్ (స్లోవేనియా)పై; 22వ సీడ్ మకరోవా (రష్యా) 6-4, 6-3తో వాండేవాఘే (అమెరికా)పై; 23వ సీడ్ సఫరోవా (చెక్) 6-1, 5-7, 6-3తో డెల్లాక్వా (ఆస్ట్రేలియా)పై; కుజ్‌నెత్సోవా (రష్యా) 7-6 (5), 6-3తో కామిల్లా జియోర్జి (ఇటలీ)పై; మల్డోనోవిచ్ (ఫ్రాన్స్) 7-6 (5), 3-6, 6-3తో అలిసన్ రిస్కీ (అమెరికా)పై; 26వ సీడ్ సోరెనా క్రిస్టియా (రొమేనియా) 6-2, 7-5తో టెలియానా పెరీరా (బ్రెజిల్)పై గెలుపొందగా... 24వ సీడ్ పావ్‌లుంచెకోవా (రష్యా)కు బెర్టెన్స్ (నెదర్లాండ్స్) చేతిలో పరాజయం ఎదురైంది.